రావులపాలెంలో అరటి మార్కెట్ యార్డులో ఎగుమతులకు సిద్ధంగా ఉన్న అరటి గెలలు
గత రెండేళ్లతో పోలిస్తే భారీగా పెరుగుదల
కర్పూర అరటి గెల గరిష్ఠంగా రూ.500 పైనే..
రావులపాలెం రూరల్, జూన్ 25: పెళ్లిళ్లు, శుభకార్యాలు, పూజలకు వినియోగించే అరటి పండ్ల ధర రైతులపాలిట ఆశాజనకంగా ఉంది. అరటికి దిగుబడి ఉన్నా గత రెండు సంవత్సరాలుగా సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆశించిన ధరకంటే అధి కంగా పలకడంతో ఆ రైతులు ఆనందపడుతున్నారు. అంతర్రాష్ట్ర అరటి మార్కెట్ యార్డుగా ఖ్యాతిగాంచిన రావులపాలెం అరటిమార్కెట్ కొద్దికాలంగా కళకళలాడుతోంది. గత రెండేళ్లుగా అరటి గెలల దిగుబడి బాగున్నా కరోనా కారణంగా ఎగుమతులు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ సంవత్సరం జనవరి నుంచి కొంతమేర అరటి గెలలకు ధర పెరగడంతో రైతులు ఒకింత ఊరట చెందారు. ప్రస్తుతం అరటికి ధర భారీగా పెరగడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న గెలలకు మంచిధర పలుకుతుండడంతో గడిచిన రెండు సంవత్సరాల్లో నష్టాలు చవిచూసిన రైతులు కొంతమేర లాభాలబాట పట్టారు. ప్రస్తుతం కర్పూర అరటి గెల రూ.300 నుంచి రూ.500 పైబడి ఉం డగా, తెల్ల చక్కెరకేళీ రూ.300 నుంచి రూ.400 ఉంది. ఎర్ర చక్కెరకేళీ కూడా గరిష్ఠంగా రూ.400 పలుకుతుండడంతో అరటిమార్కెట్ రైతు లు, వ్యాపారులతో కోలాహలంగా మారింది. ఇక్కడ కొనుగోలు చేసిన గెలలను వ్యాపారులు ఒడిశా, తెలంగాణ, చెన్నైతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. రోజూ రావులపాలెం అరటిమార్కెట్‌యార్డు నుంచి 12 వేల అరటిగెలలు ఎగుమతవుతున్నాయి.