అరటిదూట సాంబారు

ABN , First Publish Date - 2022-04-30T17:15:20+05:30 IST

అరటిదూట - ఒక అడుగుసైజు ముక్క, కందిపప్పు - ఒక కప్పు, చింతపండు - నిమ్మకాయంత, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.మిక్సీలో వేసి

అరటిదూట సాంబారు

కావలసినవి: అరటిదూట - ఒక అడుగుసైజు ముక్క, కందిపప్పు - ఒక కప్పు, చింతపండు - నిమ్మకాయంత, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.మిక్సీలో వేసి పొడి చేసుకోవలసిన పదార్థాలు  కందిపప్పు - ఒక టీస్పూన్‌, శనగపప్పు - ఒక టీస్పూన్‌, ధనియాలు - ఒకటిన్నర టీస్పూన్‌, కొబ్బరితురుము - రెండు టీస్పూన్లు, మినప్పప్పు - మూడు టీస్పూన్లు, ఎండుమిర్చి - మూడు. తాలింపు కోసం  ఆవాలు - అర టీస్పూన్‌, మెంతులు - అరటీస్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు. 


తయారీ విధానం: ముందుగా అరటిదూట నార తీసి గుండ్రంగా, చక్రాలుగా కట్‌ చేసుకోవాలి.స్టవ్‌పై పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవలసిన పదార్థాలన్నింటినీ వేసి దోరగా వేయించాలి. తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.చింతపండు రసం తీసి స్టవ్‌పై పెట్టి ఉప్పు, అరటిదూట ముక్కలు వేసి ఉడికించాలి. కందిపప్పు, పసుపు వేసి కలుపుకొని మరికాసేపు ఉడికించాలి. కాసేపయ్యాక మిక్సీలో వేసి పట్టుకున్న పొడిని వేసుకోవాలి. బాగా మరుగుతున్న సమయంలో కొత్తిమీర వేసి దింపుకోవాలి.స్టవ్‌పై మరోపాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును సాంబారులో వేసుకోవాలి. అంతే... నోరూరించే అరటిదూట సాంబారు రెడీ. 


అరటిదూటతో ప్రయోజనాలివి..

అరటిదూటలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

మలబద్ధకానికి ఇది మంచి మందులా పనిచేస్తుంది.

మధుమేహులు తినాల్సిన ఆహారం. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు ఇది సహాయపడుతుంది.

పేగుల్లో కదలికలను పెంచుతుంది.కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

ఎసిడిటీ, గుండెలో మంట వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఇందులో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఫలితంగా రక్తహీనత దూరమవుతుంది.

దీనిలో ఉండే పొటాషియం, విటమిన్‌ బి6 రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

Updated Date - 2022-04-30T17:15:20+05:30 IST