ఆరని విప్లవజ్యోతి అల్లూరి

ABN , First Publish Date - 2022-07-03T08:04:30+05:30 IST

ఆరని విప్లవజ్యోతి అల్లూరి

ఆరని విప్లవజ్యోతి అల్లూరి

బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన మన్యం వీరుడు

దేశ స్వాతంత్ర్యోద్యమంలో విప్లవాగ్ని 

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

ఎందరికో ఆరాధ్యదైవం, స్ఫూర్తి ప్రదాత 

మరణించి వందేళ్లవుతున్నా చెదరని ఖ్యాతి 

దేశ స్వాతంత్య్రం కోసం జీవితం త్యాగం 

భీమవరంలో ప్రత్యేక కార్యక్రమం 

రేపు 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

రేపు సీతారామరాజు 125వ జయంతి

ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 30 కోట్లు

కేంద్రం ఇచ్చిన మొత్తం రూ. 9 కోట్లు

భీమవరంలో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్న అల్లూరి విగ్రహం


అతడే ఒక సైన్యం... కార్యక్షేత్రం మన్యం! గురి తప్పని విలుకాడు... తెల్లవాళ్లను పరుగులు తీయించిన మొనగాడు! గిరిజనులను వీరులను చేశాడు! ఎందరికో దైవంగా మారాడు! విల్లంబులతో విరుచుకుపడ్డాడు. ఠాణాలను కొల్లగొట్టాడు! తూటాలతో వేటాడాడు! స్వతంత్ర పోరాటంలో విప్లవాగ్నిని రగిల్చాడు! ఆ అగ్ని పేరు... అల్లూరి శ్రీరామరాజు!  జనం పిలుచుకునే పేరు... అల్లూరి సీతారామరాజు! రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి మన్యంలో చుక్కలు చూపించిన వీరుడు! ఆయన జీవితం, ఆయన గమ్యం, అందుకు ఎంచుకున్న మార్గం... అన్నీ ప్రత్యేకమే! అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.... 



(కొయ్యూరు, చింతపల్లి, భీమునిపట్నం రూరల్‌, రంపచోడవరం-ఆంధ్రజ్యోతి)

దేశ స్వాతంత్ర్యోద్యమంలో ‘మన్యం పితూరీ’ ఓ ప్రత్యేకం. నాలుగేళ్ల కాలంలోనే ఎన్నో సంచలనాలకు నెలవైన అరుదైన ఘట్టం. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన గెరిల్లా పోరాటం. అంతటి మహత్తర ఘట్టానికి నాయకత్వం వహించిన విప్లవ కెరటం అల్లూరి సీతారామరాజు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన ప్రాణాలర్పించి వందేళ్లు కావస్తున్నా.. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన పదఘట్టనల శబ్దం ఏజెన్సీ వాసుల గుండెల్లో ఇప్పటికీ మారుమోగుతోందంటే అతిశయోక్తి కాదు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకలో పాల్గొని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు అల్లూరి జన్మించారు. అమ్మమ్మ గారింట్లో జన్మించిన ఆయనకు తల్లి నాన్నగారైన శ్రీరామరాజు పేరు పెట్టారు. అల్లూరి మాతృమూర్తి పూర్వీకుల స్వగ్రామం విజయనగరం జిల్లా కొండవెలగాడ. 1875లో ఆమె తల్లిదండ్రులు అచ్యుతమ్మ, మందపాటి రామరాజు పాండ్రంగికి వలస వచ్చారు. ఆ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. 1875 ఫిబ్రవరిలో  సూర్యనారాయణమ్మ జన్మించారు. తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం. ఇక అల్లూరి తండ్రి పూర్వీకులు కోనసీమ ప్రాంతంలోని రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలకు చెందినవారు. కాలక్రమేణా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మోగల్లు వెళ్లి స్థిరపడ్డారు. అల్లూరి తండ్రి వెంకటరామరాజు ఫొటోగ్రాఫర్‌. గ్రామంలో ఫొటో స్టూడియోను నడిపేవారు. 1895లో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మల వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత అల్లూరి జన్మించారు. 1901లో సీతారామరాజు సోదరి సీతమ్మ మోగల్లులో, 1906లో సోదరుడు సూర్యనారాయణరాజు రాజమహేంద్రవరంలో జన్మించారు. 


చిన్నతనంలోనే తండ్రి మరణం

సీతారామరాజు చిన్నతనంలోనే తండ్రి వెంకటరామరాజు మరణించారు. 1906లో కలరా వ్యాధితో ఆయన రాజమండ్రిలో చనిపోయారు. అప్పుడు అల్లూరి వయసు పదకొండేళ్లు. అల్లూరి విద్యాభ్యాసం చాలా ఊళ్లలో సాగింది. భీమవరంలో మొదటిఫారం, రాజమండ్రిలో రెండో ఫారం, కాకినాడలో మూడో ఫారం చదివారు. 1912లో తల్లితో కలిసి పాండ్రంగిలోని తాత గారింటికి వచ్చారు. అక్కడ సంవత్సరంపాటు ఉన్నారు. తరువాత చిన్నాన్నతో కలిసి వెళ్లి నర్సాపురంలో టేలరు హైస్కూలులో 4వ ఫారం చదివారు. అనంతరం విశాఖపట్నం ఏవీఎన్‌ కళాశాలలో 5వ ఫారం చదివారు. 15 ఏళ్ల వయసులోనే ఆయనకు బ్రిటిష్‌ పాలకులపై ద్వేషభావం విపరీతంగా ఉండేది. 18వ ఏట రుషీకేష్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, కాశీ, ప్రయాగ వంటి వివిధ ప్రాంతాలను సందర్శించారు. 


గిరిజనుల బాధలకు చలించి.. 

కొంతకాలం తరువాత అల్లూరి కుటుంబం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న బంధువుల ఊరికి వచ్చి స్థిరపడింది. అప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వారి ఆగడాల గురించి ఆయన తెలుసుకున్నారు. గిరిజనుల బాధలు విని చలించిపోయారు. పేరిచర్ల సూర్యనారాయణరాజుతో కలిసి తూర్పు కనుమల్లో పర్యటించారు. లంబసింగి ఘాట్‌ రోడ్డు నిర్మాణం పనులకు వెళ్లే గిరిజనులు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. వారికి ఆరు అణాల కూలికి బదులుగా రెండు అణాలే ఇచ్చేవారు. అప్పటి తహసీల్దార్‌ బాస్టియన్‌పై బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ బ్రిటిష్‌ అధికారులు తిరిగి అల్లూరిపైనే కేసు పెట్టారు. ఆయన మన్యంలో ఉంటే ప్రమాదమని భావించిన బ్రిటీష్‌ పాలకులు నర్సీపట్నం తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఆ తరువాత అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టలో 50 ఎకరాల భూమి, కొన్ని పశువులను కేటాయించి, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచారు. 1922 జూన్‌లో పోలవరం డిప్యూటీ కలెక్టర్‌ ఫజులుల్లా ఖాన్‌ సహకారంతో తిరిగి మన్యానికి వచ్చారు. ఖాన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి కొన్ని రోజులు విప్లవానికి దూరంగా ఉన్నారు. అయితే అదే ఏడాది జూలై 27న ఖాన్‌ హఠాన్మరణం చెందడంతో సీతారామరాజు సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యారు. 


గంటందొర, మల్లుదొరతో కలసి దాడులు

1922 ఆగస్టు 15న కృష్ణాదేవిపేటకు అల్లూరి సీతారామరాజు చేరుకున్నారు. సమీపంలోని నడింపాలెం గ్రామానికి వెళ్లి గిరిజన పెద్దలు గాం గంటందొర, మల్లుదొరను కలిశారు. నాలుగు రోజుల తర్వాత మరోసారి అక్కడికి వెళ్లి మంప సమీపంలోని ఉర్లకొండపై ఉన్న గుహల్లో అనుయాయులతో రహస్య సమావేశాలు నిర్వహించారు. బ్రిటిషు వారిని తరిమికొట్టేందుకు సాయిధ పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చారు. 1922 ఆగస్టు 22న గంటం దొర, మల్లుదొర, ఎండుపడాల్‌, గోకిని ఎర్రే్‌సతోపాటు మరో 300 మంది గిరిజన విప్లవకారులతో కలిసి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులను తాళ్లతో బంధించి 11 తుపాకులు, 1390 తుపాకీ గుళ్లు, 14 బాయ్‌నెట్లు, ఐదు కత్తులు ఎత్తుకెళ్లారు. ఆ వివరాలను స్టేషన్‌ డైరీలో రాసి ఇంగ్లి్‌షలో సంతకం చేశారు. పోలీసు స్టేషన్‌ నుంచి బయటకొస్తుండగా ఇద్దరు పోలీసులు ఎదురయ్యారు. వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. ఆ మరుసటిరోజు కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు. ఏడు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలు విజయవంతం కావడంతో పోలీసు స్టేషన్‌లపై దాడుల పరంపరను కొనసాగించారు. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడ బంధీగా ఉన్న రంప పితూరీదారుడు మొట్టడం వీరయ్యదొరను విడిపించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు పోలీసు స్టేషన్లపై దాడులు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టించింది. 


ప్రపంచ యుద్ధవీరుల కాల్చివేత 

పోలీస్‌ స్టేషన్లపై అల్లూరి సేన వరుసగా దాడులు చేయడంతో బ్రిటిష్‌ ప్రభుత్వంలో అలజడి చెలరేగింది. అల్లూరి విప్లవాన్ని అణిచి వేయడానికి సాయుధ బలగాలతో రంగంలోకి దిగింది. బ్రిటిష్‌ పోలీసు ఉన్నతాధికారులు నర్సీపట్నంలో మకాం పెట్టి వ్యూహరచన జరిపారు. బలగాలతో మన్యంలో ప్రవేశించి విప్లవకారుల కోసం నలువైపులా వేట ప్రారంభించారు. అల్లూరి విప్లవ సేనకు, బ్రిటిష్‌ బలగాలకు మధ్య దాడులు, ప్రతి దాడులతో విశాఖ ఏజెన్సీ అట్టుడికింది. 1922 సెప్టెంబరు 24న ఏజెన్సీలోని దామనాపల్లి ఘాట్‌లో బ్రిటిష్‌ సాయుధ బలగాలపై అల్లూరి సేన మెరుపుదాడి చేసింది. ప్రపంచ యుద్ధాల్లో ఆరితేరిన స్కాట్‌ కవర్ట్‌, హైటర్‌ అనే ఇద్దరు ఉన్నత స్థాయి పోలీసు అధికారులను కాల్చి చంపింది. అల్లూరి సీతారామరాజు సాహసాలకు సాక్షిగా వీరిద్దరి సమాధులు నేటికీ నర్సీపట్నంలో ఉన్నాయి. 1922 అక్టోబరు 15న అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేస్తామంటూ అల్లూరి సేన ఆంగ్లేయులకు మిరపకాయి టపా పంపింది. చెప్పినట్టుగానే అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడ నుంచి రంపచోడవరం వెళ్లి 19వ తేదీన పోలీస్‌ స్టేషన్‌పై దాడులు నిర్వహించారు. అయితే బ్రిటిష్‌ వారు అప్రమత్తం కావడంతో ఈ రెండు పోలీస్‌ స్టేషన్లలో ఆయుధాలు లభించలేదు.  1923 ఏప్రిల్‌ 17న ప్రధాన అనుచరుడు గాం మల్లుదొరతో కలిసి తూర్పుగోదావరి జిల్లా దేముడు అన్నవరం పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అనంతరం దైవదర్శనం చేసుకున్నారు. 


తండ్రి చెంప దెబ్బ

అల్లూరి సీతారామరాజుకు విశాఖ, గోదావరి జిల్లాలతో ప్రత్యేక అనుబంధముంది. రామరాజులో మొదటిసారి విప్లవ స్ఫూర్తి కలిగింది గోదావరి తీరమైన రాజమహేంద్రిలోనే. తండ్రి వెంకటరామరాజు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్టూడియో నడిపేవారు. అక్కడ ఆర్థికంగా కలిసిరాకపోవడంతో మిత్రుల సూచన మేరకు 1902లో రాజమహేంద్రికి మార్చారు. సీతారామరాజు పదేళ్ల వయసులో ఒక రోజు తండ్రితో కలసి గోదావరి తీరానికి వాహ్యాళి(వాకింగ్‌)కి వెళ్లారు. అదే సమయంలో బ్రిటిష్‌ దొర ఒకరు అటుగా గుర్రంపై వచ్చారు. గోదావరి తీరానికి షికారుకు వచ్చిన వారంతా లేచి నిలబడి ఆ దొరకు వందనం చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి సీతారామరాజు కూడా దొరకు నమస్కారం చేశారు. దొరకు నమస్కారం చేయడంతో ఆగ్రహం చెందిన సీతారామరాజు తండ్రి అతని చెంపపై కొట్టారు. తెల్లదొరల దురాగతాలను వివరించి మందలించారు. ఈ సంఘటనతో అల్లూరి మనసులో తెల్లవారి పట్ల వ్యతిరేక భావం కలిగి అది బలంగా నాటుకుపోయింది. 


1800 మందితో ఉద్యమం 

1922 ఆగస్టులో ప్రారంభమైన మన్యం విప్లవం సీతారామరాజు, ఇతర మహావీరుల మరణంతో 1924 జూలై మొదటి వారంలో ముగిసింది. 1800 మందితో మన్యం ఉద్యమం సాగినట్టు చరిత్రకారులు వెల్లడించారు. వీరిలో 93 మంది ముఠాదారులు, 276 మంది అల్లూరి అభిమానులు ఉన్నారని, మిగిలినవారు పోరాట స్ఫూర్తితో అల్లూరి వెంట నడిచినట్టు చెబుతున్నారు.   


పింఛనుకూ నోచుకోని అల్లూరి మాతృమూర్తి 

అల్లూరి మరణానంతరం ఆయన తల్లి సూర్యనారాయణమ్మను మన పాలకులు విస్మరించారు. స్వాతంత్య్ర భారతదేశంలో ఆమె పింఛనుకు కూడా నోచుకోలేకపోయారు. మద్రాసు రాజధానిగా ఉన్న సమయంలో పింఛను కోసం ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, అప్పటి ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడు స్వాతంత్య్ర పోరాటంలో చనిపోయాడని, తనకు పింఛను ఇవ్వాలని సూర్యనారాయణమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమె దరఖాస్తును వారు తిరస్కరించారు. 1953 అక్టోబరు 30న 77 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. 


సకల విద్యాపారంగతుడు 

అల్లూరి  విద్యార్థి దశలోనే ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. అరుదైన కళల కోసం సుదూరప్రాంతాలకు వెళ్లారు. తపస్సు చేశారు. చదరంగం, హఠయోగం, గుర్రపుస్వారీ, జ్యోతిషం వంటి వాటిలో ప్రావీణ్యం సంపాదించారు. మల్లయుద్ధం, కర్రసాము, తుపాకీ కాల్చడం వంటి యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. తన 18వ ఏట తండ్రికి పిండప్రదానం చేయడానికి బ్రహ్మకపాలం వెళ్లారు.  ఆ సమయంలో దేశభక్తి, ఆధ్యాత్మిక భావాలు అలవడినట్టు  పరిశోధకులు చెబుతారు. తునిలో నేర్చుకున్న సంస్కృతంపై మరింత అధ్యయనం చేయడానికి కాశీలో ఏడాదిపాటు ఉన్నారు. ఆ తరువాత బస్తర్‌, పూరీ, నాగాలాండ్‌, అసోం ప్రాంతాల్లో పర్యటించి విలువిద్యలో మెలకువలు, బళ్లెం చాకచక్యంగా విసరడంతో పాటు  గాయాలు తొందరగా మానడానికి వైద్యం చేయడం కూడా గిరిజన ప్రాంతంలోనే నేర్చుకున్నారు. 


అల్లూరిని చుట్టిముట్టి.. 

బ్రిటిష్‌ సేనలకు కొరకరాని కొయ్యగా మారిన అల్లూరిని చంపేందుకు కలెక్టర్‌ రూథర్‌ఫర్డ్‌ రంగంలోకి దిగారు. అన్నవరంలో సీతారామరాజును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో రూథర్‌ఫర్డ్‌ సేనకు ఆయన్ను బంధించలేకపోయింది. దీంతో అల్లూరిని బంధించి ఇచ్చినా లేక ఆచూకీ తెలిపినా రూ.10 వేలు నజరానా ఇస్తామని ప్రకటించింది. 1924 మే 1 నుంచి 6వ తేదీ వరకు రాజవొమ్మంగి మండలం కొండపల్లి వద్ద బ్రిటిషు సేనలకు, అల్లూరి అనుచర గణానికి భీకర పోరాటం జరిగింది. అల్లూరిని గ్రామస్థులు అక్కడ నుంచి తప్పించారు. అక్కడ నుంచి మంప చేరుకున్న అల్లూరి మే 7వ తేదీన బ్రిటిషు సేనలు చుట్టుముట్టాయి. రాజేంద్రపాలెం తీసుకువచ్చి అక్కడ చింతచెట్టుకు కట్టి అల్లూరిని కాల్చి చంపారు. అనంతరం అల్లూరి భౌతికకాయాన్ని కృష్ణాదేవిపేటకు తీసుకువచ్చారు. ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించేందుకు జాప్యం చేశారు. 1924 మే 12న అధికారికంగా ప్రకటించారు.  అల్లూరి తన 27వ ఏటనే అస్తమించారు. 

Updated Date - 2022-07-03T08:04:30+05:30 IST