Jul 28 2021 @ 14:56PM

ar murugadoss: డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌కు ఊర‌ట‌నిచ్చిన హైకోర్టు తీర్పు

గతంలో తన సినిమా ద్వారా ప్రభుత్వ పథకాలను విమర్శించారంటూ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్‌పై వేసిన కేసులో ఆయనకు ఊరట దొరికింది. వివరాల్లోకెళ్తే.. 2018లో ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌,  అగ్రహీరో విజయ్‌ నటించిన చిత్రం ‘సర్కార్‌’ విడుద‌లైంది. ఈ మూవీలో ప్రభుత్వం అమలుచేసిన అనేక ఉచిత పథకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో గత అన్నాడీఎంకే పాలకులు ఈ చిత్రానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. పైగా ప్రభుత్వ పథకాలను విమర్శించినందుకు దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌పై చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో దేవరాజన్‌ అనే అన్నాడీఎంకే కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీంతో సీసీసీబీ పోలీసులు దర్శకుడు మురుగదాస్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా వుండేందుకు వీలుగా మురుగదాస్‌ మద్రాస్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. అదేసమయంలో ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ దర్శకుడు మురుగదాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సోమవారం హైకోర్టులో జరిగింది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ చిత్రం విడుదలైందని, సెన్సార్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి లేదా ప్రభుత్వం కేసు పెట్టలేదని, ఈ పిటిషన్‌ భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా వుందని కోర్టు పేర్కొంది.. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది.