‘ఆక్వా’తో అనర్థాలు

ABN , First Publish Date - 2020-11-30T04:44:41+05:30 IST

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆక్వా సాగు వల్ల విడుదలవుతున్న వ్యర్థాలు, విషవాయువుల కారణంగా వ్యాధుల భారిన పడుతున్నారు. మరోవైపు ఈ వ్యర్థాలతో పంటల దిగుబడి తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వాసాగు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

‘ఆక్వా’తో అనర్థాలు
ఇచ్ఛాపురం మండలంలో అక్రమంగా సాగు చేస్తున్న రొయ్యల చెరువులు




నిబంధనలకు విరుద్ధంగా సాగు

రొయ్యల వ్యర్థాలతో దుర్గంధం

రోగాల భారిన పడుతున్న ప్రజలు

పంటలు నష్టపోతున్న రైతులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆక్వా సాగు వల్ల విడుదలవుతున్న వ్యర్థాలు, విషవాయువుల కారణంగా వ్యాధుల భారిన పడుతున్నారు. మరోవైపు ఈ వ్యర్థాలతో పంటల దిగుబడి తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆక్వాసాగు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 

--------------

జిల్లాలో ఆక్వాసాగుతో ప్రజలకు అనర్థాలు ఎదురవుతున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో సుమారు 958 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వందలాది మంది రైతులు రొయ్యల చెరువులను(ఆక్వా) సాగు చేస్తున్నారు. బడా రైతులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఆక్వా రంగంపై మొగ్గు చూపుతున్నారు. అధిక శాతం  నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులను నిర్మించారు. వీటి నుంచి విడుదలవుతున్న మురికి నీటిని కాలువల్లోకి వదిలివేస్తుండడంతో వరితో పాటు మత్స్య సంపద దెబ్బ తింటోంది. సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న బడా ఆక్వా రైతుల జోలికి పోలేక విధిలేని పరిస్థితుల్లో అన్నదాతలు వ్యవసాయానికి స్వస్తి చెప్పి పరిశ్రమల్లో కూలీలుగా మారిపోతున్నారు. మరోవైపు కుళ్లిన రొయ్యల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో దుర్ఘంధం వ్యాపిస్తోంది. రొయ్యల చెరువులకు వినియోగిస్తున్న రసాయనాల ప్రభావంతో విషవాయువులు వెలువడి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రోజంతా విద్యుత్‌ మోటార్లు, ఏరియేటర్లతో రణగొణ ధ్వనులతో వెలువడుతున్న శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా  ఉన్నతాధికారులు స్పందించి.. అక్రమ రొయ్యల సాగు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


నిబంధనలకు నీళ్లు

రొయ్యల చెరువులు సాగు చేయాలంటే ముందుగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత మండల రెవెన్యూ, మత్స్య, వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖ అధికారులు మొదట పరిశీలించి నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు వచ్చి పరిశీలించి.. కలెక్టర్‌ అనుమతి కోసం నివేదిక పంపిస్తారు. కలెక్టర్‌ అనుమతి ఇచ్చిన తరువాతే చెరువులను సాగు చేయాలి. కానీ జిల్లాలో చాలామంది ఆక్వా రైతులు ఈ నిబంధనలు పాటించడం  లేదని ప్రజలు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా సాగు చేస్తుండంతో భూమి, గాలి, నీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


నిబంధనలు తప్పని సరి 

రొయ్యల చెరువులు సాగు చేసే రైతులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాతే చెరువులు సాగు చేయాలి. అక్రమంగా సాగు చేస్తే  చర్యలు తప్పవు. 

పి.వి.శ్రీనివాసరావు, జేడీ, మత్స్యశాఖ.



Updated Date - 2020-11-30T04:44:41+05:30 IST