ఆక్వా రైతు ఆశలు ఆవిరి

ABN , First Publish Date - 2022-08-19T05:59:03+05:30 IST

ఆక్వా రైతులకు చేదు అనుభవం ఎదురైంది.

ఆక్వా రైతు ఆశలు ఆవిరి
గోవిందపల్లిలో సాగులో ఉన్న టైగర్‌ రొయ్యలు

టైగర్‌ రొయ్యకు జుతామి ఫంగస్‌ 

లక్షల్లో చనిపోతున్న రొయ్యలు 

ఎగుమతి చేసిన టైగర్‌ కంటైనర్లూ వెనక్కి


కోట, ఆగస్టు 18 : ఆక్వా రైతులకు చేదు అనుభవం ఎదురైంది.వెనామి రొయ్యల సాగుతో నష్టాలపాలైన రైతులు టైగర్‌(మంచినీటి రొయ్య) రకం సాగుతో అయినా లాభాలు పొందాలనుకున్న ఆశ అడియాసగానే మిగిలింది.దాదాపు 15 యేళ్ల తరువాత టైగర్‌ సాగుపై మొగ్గుచూపితే అనుకోని చిక్కులు ఏర్పడుతున్నాయి. జుతామి (ఫంగస్‌) వ్యాధి టైగర్‌ రొయ్యపిల్లలకు సోకి వేల నుంచి లక్షల్లో పిల్లలు చనిపోయి ఒడ్డుకు చేరుతుండడంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. సముద్రతీరప్రాంత మండలాలైన కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల రైతులు మొదటిసారిగా 2007వ సంవత్సరంలో ఈ టైగర్‌ రొయ్యను సాగుచేశారు.జీరో సెల్నిటీ(భూమిలో ఉప్పు శాతం)లో కూడా టైగర్‌ సాగు బాగుండడంతో మంచినీటితోనే కాకుండా క్రీస్‌ (ఉప్పునీరు)తో కూడా ఈ సాగును చేపట్టి లక్షల రూపాయలను ఆర్జించారు. తరువాత వెనామీ సాగును ఇబ్బడిముబ్బడిగా చేపట్టారు. మొదట్లో మంచి ఆదాయమే వచ్చినప్పటికీ రానురాను నష్టాలు వస్తుండడంతో గత రెండేళ్ల నుంచి  మళ్లీ టైగర్‌ సాగుపై రైతులు మొగ్గు చూపారు.10 రోజుల క్రితం వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సాగులో ఉన్న టైగర్‌ రొయ్యపిల్లలకు జుతామి సోకి చనిపోతుండడంతో రైతులకు దిక్కు తోచడం లేదు.


పడిపోయిన డిమాండ్‌  


టైగర్‌ రొయ్యలకు అమెరికా, జపాన్‌, యూరప్‌ దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే ఉత్పత్తి ఎక్కువైపోవడంతో ఇటీవల డిమాండ్‌ పడిపోయినట్లు బయ్యర్లు చెబుతున్నారు. ఫంగస్‌ కారణంగానే ఆయా దేశాలకు కంటైనర్‌లో వెళ్లిన  టైగర్‌ రొయ్యలు తిరుగుముఖం పడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వరకు టన్ను టైగర్‌ రొయ్యలు రూ.6.20 లక్షల నుంచి 6.50 లక్షల వరకు పలకగా,  ప్రస్తుతం రూ.6 లక్షల వరకే పలుకుతున్నాయి.20 కౌంట్‌(కేజీకి 20రొయ్య పిల్లలు) 600 రూపాయలు, 21 కౌంట్‌ రూ.570,  22 కౌంట్‌ రూ.540,  23 కౌంట్‌ రూ. 530, 24 కౌంట్‌ రూ.520, 25 కౌంట్‌ రూ.500, 26 కౌంట్‌ రూ.490,  27 కౌంట్‌ రూ.470, 30 కౌంట్‌ రూ.460,  40 కౌంట్‌ రూ.360  దిశగా ఉన్నాయి.  

Updated Date - 2022-08-19T05:59:03+05:30 IST