ఆక్వా రైతు విలవిల

ABN , First Publish Date - 2020-10-20T07:07:46+05:30 IST

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యానవన రైతులకు కలిగిన నష్టం అంచనా వేయడం కష్టంగా మారింది. మొత్తం ఎంత అనేది వారం

ఆక్వా రైతు విలవిల
కరపలో ముంపులో ఉన్న రొయ్యల చెరువు

గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని చెరువుల నుంచి చేపలన్నీ జంప్‌
ఉప్పుటేరు ప్రాంతాల పరిధిలో చెరువుల నుంచి రొయ్యలు పరుగో పరుగు
ముంపు నీటిని తోడుకుంటున్న రైతులు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యానవన రైతులకు కలిగిన నష్టం అంచనా వేయడం కష్టంగా మారింది. మొత్తం ఎంత అనేది వారం గడిస్తేనే కానీ తేలేట్టు కనిపించడం లేదు. ఇదే సమయంలో జిల్లాలో ఆక్వా రైతులు కూడా నష్టాన్ని చవిచూశారు. అయితే ఎంత మేర సాగు నష్టపోయిందో మత్స్యశాఖ అధికారులకు ఇప్పటి వరకు ఆక్వా రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిసింది. అయితే పిల్ల పెరిగి పెద్దదవుతున్న దశకు చేప, రొయ్య చేరిందని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 52 వేల ఎకరాల్లో ఆక్వా సాగులో ఉంది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల తర్వాత స్థానంలో మన జిల్లా వుంది. గోదావరి పరీ వాహక ప్రాంత పరిధి చేర్చి ఎక్కువగా కోనసీమలో మంచినీటి చేప, రొయ్యల చెరువులు సాగులో ఉన్నాయి. రాజమహేంద్రవరం డివిజనలో కొన్ని చెరువులు సాగులో ఉన్నాయి. ఉప్పుటేరు అధికంగా ప్రవహించే కాకినాడ డివిజన పరిధి ప్రాంతాల్లో ఉప్పునీటి చెరువులు సాగులో ఉన్నాయి. ఇందులో సుమారు 32వేల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు, 20 వేల ఎకరాల్లో మంచినీటి చెరువులను రైతులు సాగు చేస్తున్నారు. ఉప్పుటేరు ఎక్కువగా పొంగిన ప్రాంతాల సమీపంలో ఉన్న చెరువుల్లో రొయ్యలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మంచినీటి చెరు వుల నుంచి చేపలు ఏరు దాటేస్తున్న క్రమంలో వాటిని కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. వాయుగుండం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆక్వా రైతులను నిలువెల్లా ముంచెత్తాయి. సాధారణ వర్షాలేనని తాము పట్టిం చుకోలేదని దీంతో వరద నీటిలో రొయ్యలు, చేపలు ఈదుకుంటూపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కాకినాడ డివిజన పరిధిలోని తాళ్లరేవు మండలం పి.మల్లవరం, పోలేకుర్రు, పటవల, చొల్లంగి, తాళ్లరేవు, పిల్లంక, ఉప్పొంగల, గాడిమొగ, ఇంజరం, కోరంగి, కాజులూరు మండలం దుగ్గు దూరు, కాజులూరు, ఉప్పుమిల్లి, పల్లిపాలెంలలో రొయ్య, చేపల చెరువులున్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఆక్వా పంట సగానికి పైగా పాడైంది. కరప మండలం కరప, వేళంగి, భావారం, అరట్లకట్ల, పెనుగుదురు గ్రామాల్లో సాగులో ఉన్న అన్ని చెరువుల్లో రొయ్య పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆర్నెల్లపాటు పడిన కష్టం అంతా వరదనీటి పాలైం దని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు, నాయకులు వరి, ఉద్యానవన సాగులో నష్టాన్ని మాత్రమే అంచనా వేస్తున్నారని, ఆక్వా సాగులో కూడా ఎంత నష్టం జరిగిందో లెక్కకట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మత్స్య శాఖ జేడీని వివరణ కోరగా తమకు నష్టం జరిగిందని ఆక్వా రైతులెవ్వరూ ఇప్పటివరకు ఫిర్యాదు చేయ లేదని, అయినా ఎన్యూమరేషన చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించామని, ఆక్వా పంట నష్టపోతే ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.



Updated Date - 2020-10-20T07:07:46+05:30 IST