కష్టకాలంలో ఆప్తబాంధవుడు

ABN , First Publish Date - 2020-03-31T09:18:23+05:30 IST

జీవితంలో కష్టాలు వచ్చినట్లే ఆ కష్టాలనుంచి మనను గట్టెక్కింప జేసే ఆప్తులు కూడా ఎప్పుడూ ఉంటారు. ప్రమాదాల్లో ఆదుకునే పెద్ద మనసు గల వ్యక్తులు ఉంటారు. నిజానికి అలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు అనిపించినప్పుడల్లా ఏ కష్టాన్నించైనా ...

కష్టకాలంలో ఆప్తబాంధవుడు

21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన వారం రోజుల తర్వాత కూడా భారత ప్రజలు ప్రశాంతంగా, సంయమనంగా వ్యవహరించడం మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. మోదీ సూచించినట్లుగా సామాజిక దూరం పాటించడం, మార్కెట్లలో, దుకాణాల వద్ద క్రమశిక్షణగా వ్యవహరించడం, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కొరత పెద్దగా లేకపోవడం, క్వారంటైన్‌కు రైళ్ల కోచ్‌లను  ఉపయోగించుకోవడం వంటి వినూత్న పద్ధతులను పాటించడం విదేశీ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.


జీవితంలో కష్టాలు వచ్చినట్లే ఆ కష్టాలనుంచి మనను గట్టెక్కింప జేసే ఆప్తులు కూడా ఎప్పుడూ ఉంటారు. ప్రమాదాల్లో ఆదుకునే పెద్ద మనసు గల వ్యక్తులు ఉంటారు. నిజానికి అలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు అనిపించినప్పుడల్లా ఏ కష్టాన్నించైనా మనం గట్టెక్కగలం అన్న ధీమా మనకు కలుగుతుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నప్పుడు అత్యంత సీనియర్ అయిన ఒక పత్రికాధిపతి స్పందిస్తూ ‘ఇవాళ్టి కష్ట సమయంలో మీరు ప్రధానమంత్రిగా ఉండడం మాకెంతో ధైర్యాన్నిస్తోంది’ అన్నారు. ఇది ఆ ఒక్క పత్రికాధిపతి మనోగతం కాదు. దేశంలో కోట్లాది ప్రజల మనోగతం.  కరోనా వైరస్ ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్న సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రజలకు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సోదరుడుగా కనపడుతూ మన దేశం ఈ సమస్యలనుంచి గట్టెక్కి తీరుతుందని, భయపడవద్దని ఒక ధైర్యం కల్పిస్తున్నారు. కోట్లాదిమంది బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో చిక్కుబడిన సమయంలో టీవీ ఆన్ చేసి చూస్తే– మన ప్రధానమంత్రి కళ్లముందు కనపడగానే వారికి కొండంత ధైర్యం కలుగుతోంది. ఆయన చెప్పిన మాటల్ని వారు చాలా శ్రద్ధగా, చెవులు రిక్కించి వింటున్నారు. ‘మరి కొద్ది రోజుల్లో కరోనాపై మనం యుద్ధంలో గెలుస్తాం’ అని ఆయన చెప్పినప్పుడు వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి.


ప్రధానమంత్రి ఇవాళ నిజంగా తాను దేశాధినేత అయిన ప్రధానమంత్రిని కానని, ప్రజల ప్రధాన సేవకుడినని నిరూపిస్తున్నారు. ప్రజలతోనూ, ప్రముఖులతోను ఆయన నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నారు. పత్రికాధిపతులతో ఆయన నేరుగా మాట్లాడి ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించాల్సిందని అభ్యర్థిస్తున్నారు. కరోనా వాతపడి ఆస్పత్రిలో క్వారంటైన్‌కు గురై కోలుకుంటున్న పేషంట్లతోనే కాదు, వారి కోసం రాత్రింబగళ్లు సేవ చేస్తున్న నర్సులతో కూడా ఆయన నేరుగా మాట్లాడి వారికి భరోసాను అందిస్తున్నారు. కనీసం రోజుకు 200మందితో ఆయన సంభాషిస్తున్నారు. ఆయన ఒక్క పిలుపునకు స్పందించి పారిశ్రామిక వేత్తలు, సినీతారలు, సంపన్నులు మాత్రమే కాదు, పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చి కరోనాపై పోరాడేందుకు కోట్లాది రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నారు.


ప్రధానమంత్రి పట్ల ప్రజల విశ్వాసం ఏ విధంగా ఉన్నదో మార్చి 22న జనతా కర్ఫ్యూలో కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడంతోనే అర్థమయింది. ప్రజలు తనను అపార్థం చేసుకోవడం లేదని, తన అభ్యర్థనలను మన్నిస్తున్నారని తెలిసిన తర్వాత ప్రధానమంత్రి మరో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. దీనికీ దేశం యావత్తు హృదయ పూర్వకంగా స్పందించింది. ఇవాళ ప్రజలే ప్రధానమంత్రి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. మోదీ ఇచ్చిన పిలుపును పాటించకపోతే నష్టాలేమిటో వారే అనేక సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుని పరస్పరం సలహాలు పంచుకుంటున్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత వారం రోజులకు పరిస్థితిని సమీక్షిస్తే కరోనాపై మోదీ ప్రకటించిన యుద్ధంలో మనం విజయం సాధించడంలో ముందడుగే వేస్తున్నామన్న విషయం స్పష్టమవుతోంది.


ఇవాళ దేశ ప్రజలకే కాదు, అంతర్జాతీయంగా పలువురు దేశాధినేతలకూ నరేంద్రమోదీ ఆదర్శంగా నిలిచారు. ఒక వైపు దేశంలో వివిధ వర్గాల ప్రతినిధులతోనూ, మంత్రివర్గ సహచరులతోనూ, అధికారులతోనూ, సైన్యాధిపతులతోనూ, వైద్యరంగంలో సేవలందిస్తున్న వారితోనూ, పేషంట్లతోనూ నిరంతరం సంబంధాలు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి రాత్రింబగళ్లు చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న నరేంద్రమోదీ అదే విధంగా వివిధ దేశాధినేతలతోనూ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తొలుత తానే చొరవ తీసుకుని సార్క్ దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆ దేశాల సంయుక్త నిధిని ఏర్పాటు చేశారు. అదే విధంగా చైనా అధ్యక్షుడితోనూ చర్చించారు. కరోనా వాతపడిన 130దేశాల ప్రభుత్వాధినేతలతోనూ మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాధినేతలంతా కూడా మోదీ వైపు చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇవాళ ప్రపంచానికి మోదీ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు జీ-20 దేశాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మోదీ చేసిన ప్రతిపాదనపై అన్ని దేశాలూ ముక్తకంఠంతో సంతోషం వ్యక్తం చేశాయి.


ప్రధానమంత్రి మోదీకి ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదు. 2001లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో పెను భూకంపం సంభవించింది. అత్యంత సీనియర్ నాయకులను కాదని తన లాంటి యువకుడిని ముఖ్యమంత్రిగా నియమించిన సందర్భంలో ఆ విపత్తును ఎదుర్కోవడంలో తాను విఫలమైతే తన రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయంగా మారుతుందన్న విషయం ఆయనకు బాగా తెలుసు. భుజ్ భూకంపంలో 12 లక్షల ఇళ్లు మట్టి పాలయ్యాయి. కాని ఆరు నెలల్లోపే మోదీ భూకంపానికి తట్టుకోగల 8 లక్షల ఇళ్లను నిర్మింపజేశారు. దాదాపు 4వేల మంది ఇంజనీర్లు, 27వేలమంది మేస్త్రీలు రాత్రింబగళ్లు పనిచేసి గుజరాత్‌ను పునర్నిర్మించారు. భారతదేశ చరిత్రలో మొదటి సారిగా భూకంప పీడిత ప్రాంతాల్లో గృహ నిర్మాణ టెక్నాలజీని ఉపయోగించారు. పూర్తిగా విధ్వంసమైన భుజ్ నగరాన్నే ఆయన అత్యాధునిక నగరంగా పునర్నిర్మాణం చేశారు. గుజరాత్‌లో విపత్తుకు గురైన అయిదు జిల్లాల్లో దాదాపు 6.6 లక్షల కొత్త బ్యాంకు ఖాతాలను తెరిపించి ప్రజలకు కావల్సిన ఆర్థిక సహాయాన్ని అందించారు.


కరోనా వైరస్ సృష్టించే బీభత్సాన్ని ముందుగానే ఊహించి యుద్ధ ప్రాతిపదికపై అనేక కీలక చర్యలు మోదీ చేపడుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తమ ప్రజలకు ఇవాళ నరేంద్రమోదీ భారత్ ప్రజలకు కలిగినంత విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. ఇవాళ భారత్ ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనడాన్ని, 21 రోజుల లాక్‌డౌన్‌ను కూడా చిత్తశుద్ధితో స్వీకరించి అమలు చేయడాన్ని చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. మోదీ నాయకత్వంలో భారత ప్రజలు చేసినట్లుగా తమ ప్రజలు కూడా తాము చేసిన సూచలను ఆమోదించి ఉంటే కరోనా వైరస్‌పై విజయం సాధించేవారమని యూరోపియన్ దేశాల్లో చర్చ జరుగుతోంది. 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన వారం రోజుల తర్వాత కూడా భారత దేశంలో ప్రజలు ప్రశాంతంగా, సంయమనంగా వ్యవహరించడం మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, మోదీ సూచించినట్లుగా రకరకాల కొత్త పద్ధతుల్లో సామాజిక దూరం పాటించడం, మార్కెట్లలో, దుకాణాల వద్ద క్రమశిక్షణగా వ్యవహరించడం, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల కొరత పెద్దగా లేకపోవడం, క్వారంటైన్‌కు రైళ్ల కోచ్‌లను ఉపయోగించుకోవడం వంటి వినూత్న పద్ధతులను పాటించడం, కంపెనీలు తమంతట తాము ముందుకు వచ్చి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లు, కిట్‌లను రూపొందించేందుకు సిద్ధపడడం విదేశీ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.


ప్రజలు మోదీలో విశ్వసనీయమైన, సమర్థుడైన నాయకుడిని చూస్తున్నారు. ఆయనను తమలో ఒకరిగా భావిస్తున్నారు. ‘మీలో చాలా మంది నాపై కోపం పెంచుకుని ఉంటారు. ఈ జీవన్మరణ పోరాటంలో మనం గెలిచేందుకే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇతర దేశాల్లో పరిస్థితులు చూస్తుంటే మిమ్మల్ని కాపాడడానికి ఇదొక్కటే మార్గమనిపించింది. నేను మీ అందరి కష్టనష్టాలను అర్థం చేసుకోగలను. వాటికి నన్ను క్షమించండి.’ అని తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రాధేయ పడడం ప్రజల మనసుల్లో మోదీ ఔన్నత్యాన్ని శిఖరాయమానం చేసింది. మోదీలాంటి నాయకుడికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. దేశ ప్రజల మనసులను గెలుచుకోవడమే కాకుండా నరేంద్రమోదీ అంతర్జాతీయంగా ఏర్పడిన నాయకత్వశూన్యతను కూడా పూరించే పథంలో ఉన్నారు. ఆయనకు మనసా వాచా కర్మణా అండదండలివ్వడమే ఇవాళ చారిత్రక అవసరం.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-03-31T09:18:23+05:30 IST