ప్రగతి చక్రం పల్టీ

ABN , First Publish Date - 2022-09-05T05:22:59+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటి నుంచి ప్రజా రవాణా శాఖగా తెరముందుకొచ్చినా ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ రవాణా శాఖ వ్యవస్థే మారిపోయింది.

ప్రగతి చక్రం పల్టీ

ఆర్టీసీ విలీనం తరువాత అన్నీ తిప్పలే

కాలం చెల్లిన బస్సులు

ఎరియర్స్‌,పీఆర్సీ డౌటే

గ్యారేజీ నిర్వహణ అంతంత మాత్రం

ఉద్యోగుల కష్టాలు గంపెడు

వేళాపాళాలేని సర్వీసులతో జనం ఆగ్రహం

అయినా పట్టని వైసీపీ సర్కార్‌


ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగం, జీవితం సాఫీగా సాగుతుందనుకున్నారు. తమ సర్వీసు, ఆరోగ్యానికి డోకా ఉండదనుకున్నారు.. నెలలు దాటి సంవత్సరాలు గడుస్తున్నా తిప్పలు పెరుగుతున్నాయే తప్ప కష్టాలు తీరడం లేదు. ఇప్పటిదాకా పీఆర్సీకి దిక్కులేదు.. ఎరియర్స్‌ మాటేలేదు. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమై ప్రజా రవాణాశాఖ (పీటీడీ)గా ఆవిర్భవించింది. అప్పటినుంచి అందులో పనిచేసే ఉద్యోగులంతా వరుస కష్టాలు అనుభవిస్తున్నారు. కాలం తీరి నిర్వహణ లోపించి డొక్కు బస్సుల య్యాయి. కొత్త బస్సులు లేనేలేవు. ఆఖరుకి గ్యారేజీలోని ఉద్యోగులకు కొత్త సామగ్రి ఇప్పటికీ చేతికందనే లేదు. ఒకనాటి ప్రగతి చక్రం ఇప్పుడు పల్టీలు కొడుతున్నది.  


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటి నుంచి ప్రజా రవాణా శాఖగా తెరముందుకొచ్చినా ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ రవాణా శాఖ వ్యవస్థే మారిపోయింది. అందులో పనిచేసే ఉద్యోగుల తీరే తిరగబడింది. ఎక్కడ చూసినా అసంతృప్తి, లోలోన ఆగ్రహంతో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్టీసీని విలీనం చేసి  ఏళ్ళు గడుస్తున్నా కనీస సౌకర్యాలు మెరుగుపర్చలేకపోయారు. కొత్త బస్సులు రానే రాలేదు. ఉన్న సర్వీసులు తగ్గించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. తగినంత ఆక్యుపెన్సీ లేదనే కారణాన్ని చూపి మరీ లిస్టులో లేకుండా చేశారు. ఇప్పుడు ఆయా ప్రాంతాలన్నింటిలోనూ ఎవరికైనా ఆటోలే గతి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అప్పట్లోనే ఆర్టీసీలో దాదాపు నాలుగు వేల మంది వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేశారు. వందలాది బస్సులు డిపోలో ఉండేవి. కొత్త డిపోల కోసం ప్రజలు పదేపదే ప్రజాప్రతినిధులను ప్రాధేయపడినా ఇప్పుడు అవన్నీ చెత్తబుట్టపాలయ్యాయి. వాస్తవానికి ప్రజా రవాణ బస్సుల్లో అత్యధికం ఇప్పుడు నిర్వహణలోపంతోనే ఉన్నాయి. ఎక్కడికక్కడ మరమ్మతులకు గురవుతూనే ఉన్నాయి. రానురాను ఈ తిప్పలు పెరుగుతున్నా కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా పాత బస్సుల్లో ప్రయాణం నరకంగా మారింది. కొన్నింటికి సీట్లు విరిగిపోవడం, మరికొన్ని వాలిపోవడం వంటి అనేక అసౌకర్యాలు ప్రజారవాణాలో నిత్యకృత్యంగా మారాయి. ఆఖరుకి ఈ మధ్యనే భారీగా చార్జీలు పెంచినా జనం నుంచి ప్రతిఘటన ఎదురుకాలేదు. దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సులే కాకుండా ఆఖరుకి పల్లెవెలుగు బస్సు చార్జీలను పెంచేశారు. ప్రభుత్వ శాఖ జోన్‌లోకి వచ్చిన తరువాత పాత ఆర్టీసిలో పనిచేసే వారిలో ఎవరూ నోరెత్తే పరిస్థితి లేదు. 


ఉద్యోగులకు తిప్పలు 

కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వంలో విలీనమైన తరువాత తమకిక పని సులువే అనుకున్నారు. కష్టాలు తొలగి ఆ స్థానంలో సరికొత్త జీవితం లభిస్తుందనుకున్నారు. కాని దీనికి విరుద్ధంగా ఏళ్ళు గడిచిపోతున్నా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎరియర్స్‌కు దిక్కులేకుండా పోయింది. 2013లో ఒకవైపు ఎరియర్స్‌ ఇస్తున్నామని చెబుతూనే దాని పూర్తి మొత్తంలో కేవలం 60 శాతం చెల్లించి మిగతా 40 శాతాన్ని అప్పట్లోనే పెండింగ్‌ పెట్టారు. 2017లోనూ పూర్తిగా చేతులెత్తేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతీ ఉద్యోగికి ఎరియర్స్‌ రూపంలో లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు రావాల్సి ఉన్నా అవన్నీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. పీఆర్సీ అమలు చేయబోతున్నామంటూ ఏ నెలకానెల ఊరడింపు, ఆ వెను వెంటనే సాంకేతిక లోపాలంటూ వాయిదా వేయడంతో ఉద్యోగులు విసుగెత్తిపోయారు. తమను మిగతా శాఖల ఉద్యోగుల మాదిరిగా ఎందుకు చూడడం లేదనే ప్రశ్న వీరు సంధిస్తున్నారు. ఉద్యోగుల సంఘాలు పదేపదే తమ డిమాండ్లు లేవనెత్తుతున్నా చూద్దాం.. చేద్దాంలే అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉన్నది. దీనికితోడు పీటీడీలో ఇప్పుడు ఉద్యోగులు సరికొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆర్టీసీలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే వెనువెంటనే కొంతలో కొంతైనా మెరుగైన వైద్యం అందే విధంగా అప్పట్లో ఉన్న ఆర్టీసీ డిస్పెన్సరీలు తక్షణం స్పందించేవి. వీలైతే అత్యాధునిక వైద్యాన్ని అందించి కార్పొరేషనే బిల్లులు చెల్లించేది. ఎప్పుడైతే ప్రభుత్వంలో విలీనమయ్యారో అప్పటి నుంచి ఈ ఉద్యోగులందరికీ ఆరోగ్య కష్టాలు ఆరంభమ య్యాయి. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) సరిగా అమలు చేయక పోవడంతో ఏదైనా సీరియస్‌ అనారోగ్యం వస్తే ముందస్తుగా వేలకు వేలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చెల్లించాల్సి వస్తుంది. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందనేలేదు. ‘ఒకప్పుడు ఆర్టీసీలో ఉన్నప్పుడు అనారోగ్యం చేస్తే వెంటనే కొంత సపోర్టు దక్కేది. దీంతో ఇంట్లో వాళ్ళు కూడా ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చామనే సంతోషమేగాని కష్టాలు తీరకపోగా మూడు రెట్లు పెరిగాయి. ఈహెచ్‌ఎస్‌ పనిచేయడం లేదు. పనిచేయని వాహనాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మాకేం చేయాలో తెలియడం లేదు’ అంటూ ఉద్యోగులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీటీడీలో ఏ ఉద్యోగిని కదిపినా ఇలాంటి పరిస్థితులు అడుగడునా కనిపిస్తున్నాయి. దీనికితోడు కాలం చెల్లిన బస్సులు, ఇంకోవైపు చేతికందని ఎరియర్స్‌, ఆరోగ్య కార్డు పనికిరాక పోవడం, టిమ్స్‌ సిబ్బందిలో ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే అన్నీ కష్టాలే. అధికారులు బాగున్నా పని మాత్రం దారుణంగా మారిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


 కొత్త బస్సుల మాటేంటి

ఈ మధ్యనే కొత్త బస్సుల కొనుగోలులో కొంత జాప్యం జరుగుతుందని, త్వరలోనే సమస్య తీరుతుందని పీటీడీ ఎండీ ద్వారకాతిరుమలరావు ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధ పరిస్థితులే ఉన్నారు. ఏలూరు, నూజివీడు, భీమవరం, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం వంటి డిపోలన్నింటిలోనూ ఇప్పటికే కాలం చెల్లిన బస్సులెన్నో ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే మారింది. ఆఖరుకి గ్యారేజీల్లో ఎప్పుడో మరమ్మతుల సమకూర్చిన సామగ్రే తప్ప గడిచిన మూడేళ్ళుగా కొత్త సామగ్రి సమకూరిస్తే ఒట్టు. ఉన్నంతలోనే బస్సులు నడపడం, ఏ రోజుకారోజు రాబడి, వ్యయాలపై లెక్కలేసుకోవడం, నష్టం వస్తుందంటూ బెంగపడడం తప్ప ప్రజారవాణాను దాదాపు గాలికొదిలేశారు. ఎక్కువగా రద్దీ ఉన్న రూట్లలో సైతం చిన్నచిన్న బస్సులను వేయడం, మరోవైపు సమయపాలన పాటించకపోవడం అనేక సమస్యలతో ప్రయాణికులు కొట్టుమిట్టాడుతున్నారు. 

Updated Date - 2022-09-05T05:22:59+05:30 IST