ఆ ప్రయాణం.. ప్రహసనం!

ABN , First Publish Date - 2020-10-28T15:48:06+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. ఇది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. తెలంగాణాకు చెందిన ఆర్టీసీ బస్సులు..

ఆ ప్రయాణం.. ప్రహసనం!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా అస్తవ్యస్తం

గరికపాడు వరకే బస్సులు

పట్టించుకోని ప్రభుత్వం


జగ్గయ్యపేట: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. ఇది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. తెలంగాణాకు చెందిన ఆర్టీసీ బస్సులు గరికపాడు వరకు.. జిల్లా బస్సులు గరికపాడు వరకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి.   మంగళవారం హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చిన వాహనాలు గంటల తరబడి గరికపాడు వద్ద వేచి ఉన్నా వాటిలో ఎక్కేందుకు ప్రయాణికులు లేరు. ఒకరిద్దరితోనే ఖాళీగా వెళ్లాయి. విజయవాడ నుంచి దాదాపు 50 సర్వీసులు గరికపాడు వరకు వచ్చినా ఆశించిన స్థాయిలో రెవెన్యూ లేదు. అదే సమయంలో వాహనాలు గరికపాడు వద్దకు వచ్చి వెళ్లేందుకు ఫ్లైఓవర్‌ వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా వచ్చే ప్రయాణికులకు ఆ ప్రాంతంలో తాగునీరు లేకపోవటంతో పాటు ఎటువంటి సమాచారమూ తెలియక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. 


హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు 20 ఏళ్లలో ఇంత ఇబ్బంది ఎప్పుడే పడలేదని ప్రయాణికుడు సురేష్‌ వాపోయాడు. కోదాడ వరకు వచ్చి అక్కడి నుంచి గరికపాడు మళ్లీ విజయవాడ వెళ్లి బస్సు మారాల్సి ఉండటంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. 


హైదరాబాద్‌ వెళ్లేందుకు విజయవాడ నుంచి ఉదయం 10 గంటలకు గరికపాడు వద్దకు చేరుకున్నామని ప్రయాణికురాలు సరస్వతీ తెలిపారు. తనతోపాటు వృద్ధ మహిళ కూడా ఉందనీ, తాగేందుకు నీరు, ఆహారం లేని ప్రాంతాల్లో బస్సులు ఆపటం నరకంగా ఉందని వాపోయింది.  


బస్సులు నడపలేని సీఎం రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు?: మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

నందిగామ: హైదరాబాద్‌కు బస్సులు నడపలేని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ర్టాన్ని ఏం నడుపుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్‌ నడపలేడని లోకేష్‌ను విమర్శించిన మంత్రి కొడాలి నాని తెలంగాణాకు బస్సులు నడపలేని ముఖ్యమంత్రి జగన్‌ను ఏమంటారో చెప్పాలని చురకంటించారు. వైసీపీ పాలనలో రైతులకు అడుగడుగునా అవమానాలు తప్ప  ఉపయోగమేమీ లేదన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను నిర్వీర్యం చేసి దోపిడీదారుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు.  


Updated Date - 2020-10-28T15:48:06+05:30 IST