రొటేషన్‌ చక్రవర్తీ రేపటి మాటేమిటి?

ABN , First Publish Date - 2021-07-24T07:20:40+05:30 IST

ఎట్టకేలకు ‘మ్యాటర్‌ ఓపెన్‌’ అయ్యింది! ‘పథకాల కోసమే అప్పులు తెస్తున్నాం! జనం తాగే మద్యంపై అదనపు పన్ను విధించి... ఆ అప్పులు తీరుస్తాం!’ అని సర్కారు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పింది

రొటేషన్‌ చక్రవర్తీ రేపటి మాటేమిటి?

అప్పుల కోసమే పుట్టిన ఏపీఎ్‌సడీసీ

పథకాల అమలుకే అప్పులంటూ సమర్థన

మద్యంపై అదనపు బాదుడే ‘హామీ’

ఒక ఇంటి నాన్న జేబు నుంచి లాగి..మరో ఇంటి ‘అమ్మఒడి’ పథకానికి!

ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొని!

చట్ట విరుద్ధంగా 25వేల కోట్ల రుణం

పాతికేళ్ల మద్యం ఆదాయం ‘తాకట్టు’

కొత్త అప్పుల కోసం నానా అగచాట్లు

సొంత ఆదాయ మార్గాలు వెతకరు

రాష్ట్రానికి సంపద సృష్టి కూడా లేదు

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థికం

భవిష్యత్తులో రుణం పుట్టకుంటే ఎలా?


సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న ప్రతి ఇంట్లో మద్యపానం చేసే పురుషులు ఉన్నారని చెప్పలేం. కానీ... ఒక ఇంట్లో నాన్న మద్యంపై పెట్టే ఖర్చుతోనే, మరో ఇంట్లో ‘అమ్మఒడి’లాంటి పథకాలు అమలవుతున్నాయన్నది నిజం. ఇది సర్కారు వారి ‘సంక్షేమ’ రొటేషన్‌!


మద్యం-రుణం బంధమిది..

మద్యంపై ఒకరు రూ.వంద ఖర్చు పెడితే... అందులో దాదాపు 80 రూపాయలు సర్కారుకు ఆదాయమే! జగన్‌ ప్రభుత్వం రాగానే ‘చీప్‌’ లిక్కర్‌ను సైతం ‘కాస్ట్‌లీ’గా మార్చేసింది. ఇది చాలదన్నట్లుగా... అప్పుల కోసం మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను బాదుతోంది. క్వార్టర్‌ సీసా ప్రాతిపదికన మూడు రకాలుగా ఈ పన్ను విధిస్తున్నారు. రూ.120 లోపు ధర ఉన్న మద్యం క్వార్టర్‌ సీసాకు రూ.40 అదనపు పన్ను విధించారు. (హాఫ్‌కు రూ.80, ఫుల్‌పై రూ.160). రూ.120-150 మధ్య ధర ఉండే క్వార్టర్‌ సీసాపై రూ.80 (హాఫ్‌కు 160, ఫుల్‌పై రూ.320 పన్ను), రూ.150 దాటిన బ్రాండ్‌ మద్యం క్వార్టర్‌పై రూ.120 అదనపు పన్ను (హాఫ్‌పై రూ.240, ఫుల్‌పై రూ.480) బాదుతున్నారు. ఒక్కో బీరుపై రూ.60 వసూలు చేస్తున్నారు.


రాష్ట్రమా... రాజకీయమా..

సంక్షేమ పథకాలు కచ్చితంగా అమలు చేయాల్సిందే! కానీ... ఇప్పుడు జరుగుతున్న తంతు వేరు. కేవలం రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు రాష్ట్ర భవిష్యత్తును ‘తాకట్టు’ పెట్టి మరీ అప్పులు తెస్తున్నారు. సొంతంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మరిచారు.  సంపద సృష్టించడాన్ని విస్మరించారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎట్టకేలకు ‘మ్యాటర్‌ ఓపెన్‌’ అయ్యింది! ‘పథకాల కోసమే అప్పులు తెస్తున్నాం! జనం తాగే మద్యంపై అదనపు పన్ను విధించి... ఆ అప్పులు తీరుస్తాం!’ అని సర్కారు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పింది. విషయం చాలా సింపుల్‌! ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సంస్థ’ (ఏపీఎ్‌సడీసీ)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా రూ.25వేల కోట్ల అప్పులు తెస్తోంది. ఈ అప్పులతోనే 

అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి వ్యక్తిగత ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తోంది. ఇక మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను (ఏఈఆర్‌టీ) విధించి... చేసిన అప్పు తీర్చుతామని చెబుతోంది. అంటే... ఒకవైపు ‘సంక్షేమం’ పేరిట డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి... మరోవైపు మద్యం రూపంలో జనం నుంచి అంతకుమించి లాగేసుకుంటోంది! ఇదీ... వైసీపీ సర్కారు అనుసరిస్తున్న ‘సంక్షేమ ఫార్ములా’!


ఇదీ సంక్షేమ రహస్యం...

‘ఎన్నడూలేనంత సంక్షేమం’ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆ సంగతేమిటోకానీ... ‘మద్యంపై అదనపు పన్ను విధించి, ఆ డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పిన తొలి ప్రభుత్వం మాత్రం ఇదే కావొచ్చు. సర్కారు  వచ్చీ రాగానే మద్యం పాలసీని మార్చేసింది. ‘మద్యం తాగకుండా నిరుత్సాహపరిచేందుకు’ అంటూ... ధరలను భారీగా పెంచేసింది. ఎప్పుడూ వినని కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. దశలవారీగా మధ్య నిషేధం హామీని పక్కన పెట్టేసింది. ఇదంతా ఒక ఎత్తైతే... కేవలం సంక్షేమ పథకాల అమలు కోసం తెచ్చిన అప్పులను తీర్చేందుకు, మద్యంపై అదనపు పన్ను విధించడం మరో ఎత్తు! ఒకరకంగా చెప్పాలంటే... ఇది ప్రజలకు ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో అంతకుమించి లాగేసుకోవడమే. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రతి ఇంట్లో మద్యం తాగేవారు ఉన్నారని కాదు! కానీ... మద్యంపై వచ్చే ఆదాయంతోనే సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటం చేదు వాస్తవం. కుటుంబాలను ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టేసే మద్యం ద్వారా వచ్చే ఆదాయమే... సంక్షేమ పథకాలకు ఆధారం కావడం విచిత్రం, విషాదమని సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 


సమతుల్యత ఏదీ?

‘సంక్షేమం’ ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది కాదు! వైసీపీ సర్కారు మాత్రమే అమలు చేస్తున్నదీ కాదు! గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతోపాటు... అభివృద్ధిపైనా దృష్టి సారించేవి. మరీ ముఖ్యంగా... తెచ్చిన అప్పుల్లో కనీసం 50 శాతం ‘క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌’ (రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి - అభివృద్ధికోసం వ్యయం)పై ఖర్చు చేయాలన్న నియమాన్ని పాటించే వారు. ప్రభుత్వ వ్యయంలో రెవెన్యూ వ్యయం పెరిగి, క్యాపిటల్‌ వ్యయం తగ్గడం ప్రమాదకరమైన ధోరణి! ఇప్పుడు ‘అభివృద్ధి వ్యయం’ దాదాపుగా కరిగిపోయింది. బడ్జెట్‌ ఖర్చులు పక్కనపెడితే... అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను కూడా ఉచిత పథకాలకు ఖర్చుపెడుతున్నారు. అందులో మరింత విచిత్రమేమిటంటే... ‘మీకు ఇచ్చిన పథకాల డబ్బును మీ నుంచే వసూలు చేస్తాం’ అంటూ మద్యంపై అదనపు పన్ను విధించారు.


నిషేధం కాదు... ఆదాయమే!

‘ఐదేళ్ల తర్వాత స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యం ఉంటుంది. అలా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాం’ అని అప్పట్లో ముఖ్యమంత్రి జగన్‌ సూటిగా చెప్పారు. అయితే... మద్యం పాలసీ మార్చి తొలి ఏడాది మాత్రమే షాపులను తగ్గించారు. రెండో ఏడాది యథాతథంగా ఉంచారు. ఇప్పుడు... పర్యాటకం పేరుతో మరో 300 బార్లు/షాపులకు అనుమతించారు. వీటిని పక్కనపెడితే... ఐదేళ్లు కాదుకదా, పాతికేళ్లకు కూడా మద్య నిషేధం విధించబోమని సర్కారు చెప్పకనే చెప్పింది. ఎందుకంటే... వచ్చే పాతికేళ్లపాటు మద్యంపై విధించిన అదనపు పన్నును హామీగా చూపించే ఏపీఎ్‌సడీసీ ద్వారా బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటోంది. ఆ ఆదాయంతోనే తిరిగి అప్పు తీర్చుతోంది.


కొత్త అప్పు పుట్టకుంటే?

‘ఔను. ఏపీఎ్‌సడీసీ ద్వారా అప్పులు తెచ్చాం. అమ్మ ఒడి, ఆసరా,  చేయూత వంటి పథకాల కోసమే అప్పులు తీసుకున్నాం. మద్యంపై విధించే అదనపు పన్నును ఈ అప్పుకు హామీగా చూపించాం’ అని సర్కారు సమర్థించుకుంటున్న తీరు ఆర్థిక నిపుణులను విస్తుగొలుపుతోంది. అప్పు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేరు. పెన్షన్లు చెల్లించలేరు. పథకాలూ అమలు చేయలేరు. మరి... భవిష్యత్తులో అప్పు పుట్టని పరిస్థితి వస్తే? నిజానికి... రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఎన్డీయే సర్కారు చాలా కఠినంగా ఉండేది. రుణాల విషయంలో ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చింది. కరోనా నేపథ్యంలో చూసి చూడనట్లుగా వదిలేసి... అదనపు అప్పులకు అనుమతులు ఇస్తోంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేస్తారు?  ఇప్పటికే... రాష్ట్రానికి రుణాలు ఇచ్చేందుకు పలు బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. సెక్యూరిటీ బాండ్లకు అత్యధిక వడ్డీని ఆఫర్‌ చేయాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే రెండులక్షల కోట్ల అప్పులు చేశారు.  రెండేళ్లకే అన్ని అప్పుల మార్గాలు మూసుకుపోయాయి. అంత అప్పు తెచ్చి... చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేకపోతున్నారు. ఆగస్టు నెల గడిచేందుకు కొత్త అప్పు కోసం ఐదు రోజులుగా ఢిల్లీలో తిరుగుతున్నారు. కేంద్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. 


ఆ పన్ను ఖజానాలో భాగమా? కాదా?

‘‘పాతిక వేల కోట్ల రుణానికి మద్యంపై అదనపు ఆదాయాన్ని హామీగా చూపించాం. ఇంకా... గ్యారెంటీ ప్రస్తావన ఎక్కడిది?’ అని ప్రభుత్వం ఒక వింత వాదన చేస్తోంది. కానీ... అదనపు  ఎక్సైజ్‌ పన్ను ఆదాయాన్ని 25 ఏళ్లపాటు ఏపీఎ్‌సడీసీకి మళ్లించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఏ పన్ను ఆదాయమైనా తొలుత ప్రభుత్వానికే చేరాలి. కానీ... నేరుగా కార్పొరేషన్‌కు మళ్లించే అధికారం ఏ చట్టం ప్రకారం సంక్రమించింది? ఖజానాలో భాగమైన ప్రతి రూపాయిని ఖర్చు చేయడం లేదా మళ్లించడంపై ఏ ఏడాదికి ఆ ఏడాదే బడ్జెట్‌ రూపంలో నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఒక్క ఆర్థిక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాంటిది... కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో భాగమైన అదనపు ఎక్సైజ్‌ పన్నును పాతికేళ్లపాటు ఒక కార్పొరేషన్‌కు మళ్లించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఈ ప్రశ్నలకు సర్కారు ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలియదు.


దుబారా అరికట్టరా?

ఆర్థిక పరిస్థితి బాగలేదు. అన్నింటికీ అప్పులు చేయాల్సి వస్తోంది. కనీసం... ఇలాంటప్పుడైనా దుబారా ఖర్చు తగ్గిస్తున్నారా అంటే అదీ లేదు. లెక్కకు మిక్కిలి సలహాదారులను నియమిస్తున్నారు. వారిలో అనేక మందికి కేబినెట్‌ హోదా కల్పించారు. నిధులు, విధులు ఏమీ లేకున్నా కులానికో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి... వాటికి చైర్మన్లను నియమించారు. ఇటీవలే 135 కార్పొరేషన్లకు సారథులను నియమించారు. వీరందరికీ జీత భత్యాలు, ఇతర సదుపాయాల కోసం ప్రతినెలా కనీసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు... ‘చాన్స్‌ దొరికినప్పుడల్లా’ సంక్షేమ పథకాలకు సంబంధించి సొంత మీడియాకు ఆదాయాన్ని సమకూర్చేలా కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు గుప్పిస్తున్నారు. అప్పులు చేసి... ఏరోజుకారోజు బండి లాగుతున్నప్పుడు కూడా ఇలాంటి దుబారా వ్యయం చేయడం అవసరమా?


వచ్చింది... వచ్చినట్లే!

ఒక వ్యక్తి రోజుకు క్వార్టర్‌, అది కూడా అత్యంత చీప్‌ మందు తాగుతాడనుకుందాం. దానిపైన అతను కట్టే అదనపు పన్నే రూ.40. అంటే... నెలకు రూ.1200. సంవత్సరానికి రూ.14,400. వెరసి... ఆ ఇంటికి దక్కే ‘అమ్మ ఒడి’ డబ్బులకు, ఆ నాన్న మద్యంపై కట్టే అదనపు పన్నుకు చెల్లుకు చెల్లు! సగటున క్వార్టర్‌పై రూ.80 అదనపు పన్ను విధిస్తున్నారు. దీని ప్రకారం చూస్తే... రోజుకు ఒక్క క్వార్టర్‌ తాగుతారనుకున్నా, సంవత్సరానికి ‘సగటు’ మందుబాబు బాసర్కారుకు కట్టే అదనపు పన్ను రూ.29,200. 


ఆ 25 వేల కోట్లు ఏ చట్టం కిందకు వస్తాయి?

కేంద్రానికి తెలియకుండా అప్పులు చేయకూడదని రాజ్యాంగంలోని 293 అధికరణ స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం అప్పులపై రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం చేసింది. అంటే, రాష్ట్రాలు చేసే అప్పులను చట్టబద్ధం చేసింది. రాష్ట్రాలు అప్పులు చేసుకునేందుకు ఒక చట్టం ఉన్నప్పటికీ... రాష్ట్రాలు నేరుగా అప్పులు చేయడానికి 293 అధికరణ అనుమతించదు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఉన్నప్పటికీ రాష్ట్రాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే అప్పులకు కేంద్రం రెండు విడతలుగా అనుమతి ఇస్తుంది. కేంద్రం అనుమతి ఉంటేనే అప్పులు చేసుకోవడానికి రాష్ట్రాలకు ఆర్‌బీఐ   సహకరిస్తుంది. చట్టబద్ధమైన అప్పులు తెచ్చుకోవడానికే ఇన్ని షరతులు ఉన్నాయి. అసలు ఏ చట్టం పరిధిలోకి రాని, రాజ్యాంగంలో లేని పద్ధతిలో అప్పులు తేవడం తీవ్ర ఆర్థిక నేరం. ఏపీఎ్‌సడీసీకి రూ.25వేల కోట్ల అప్పు తేవడం ఇలాంటి నేరమే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పైగా.. ఆ నిర్ణయానికి కేబినెట్‌ మూకుమ్మడిగా ఆమోదం తెలపడం గమనార్హం. 

Updated Date - 2021-07-24T07:20:40+05:30 IST