అప్సరసలు కూడా...

ABN , First Publish Date - 2022-05-02T06:01:39+05:30 IST

అప్సరసలు కూడా అనుక్షణమూ నీ వెంట ఉండరు! ఒంటరితనాన్నే ఆనందించాలి...

అప్సరసలు కూడా...

అప్సరసలు కూడా అనుక్షణమూ నీ వెంట ఉండరు!

ఒంటరితనాన్నే ఆనందించాలి

     బహుశా జీవితమంతా!


సువాసనాభరితమైన కర్పూరంకూడా

     తృటిలో ఆవిరైపోతుంది

ఆ ‘సుఖ’ క్షణాలు కూడా అంతంతమాత్రంగానే

     గుర్తుంటాయ్‌!

ఏ క్షణాన్నో కాస్సేపు మిణుకు మిణుకుమంటూ

     మెరుస్తాయి చీకట్లో-

జ్ఞాపకాలు కూడా మసిబారి మాసిపోతాయి!

ఎంతకని దుమ్ము దులుపుకుంటూ

     తుడుచుకుంటూ చూసుకుంటూ

     మురుస్తావ్‌!

పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతాయి

     కోటగుమ్మాలు కూడా

మహావృక్షాలు కూడా మట్టిలో కలిసిపోతాయి

కాసుకోలేవు కాలంతెచ్చే భూకంపాల్నీ

     సముద్రపు తుఫానుల్నీ

నీవెంత? నీశక్తెంత?

విర్రవీగుతావుకానీ

     వెన్నుపూస విరుస్తుంది ప్రకృతిబీభత్సం-


వెల్లకిలా పడుక్కొని ఆకాశంవైపు చూస్తూ

నీ జీవితాదర్శాల గురించి

ప్రశాంతంగా ఆలోచించాలనుకుంటావు గానీ

సమయం ఎక్కడ దొరుకుతుంది నీకు?

సముద్రంలో ఈదటంతోనే

     కాలం గడిచిపోతోంది కదా!


సుమనశ్రీ

89785 84995


Updated Date - 2022-05-02T06:01:39+05:30 IST