చిక్కితే అంతే..

ABN , First Publish Date - 2021-01-21T06:52:34+05:30 IST

కాల్‌మనీ కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో రుణాలిస్తామని, క్షణాల్లో మంజూరు చేస్తామని యువతకు పలు యాప్‌ల నిర్వాహకులు వల వేస్తున్నారు.

చిక్కితే అంతే..

  నరకం చూపుతున్న  ‘లోన్‌’ యాప్‌లు

  రుణం తీసుకుని వాయిదా జాప్యం చేస్తే  మానసిక వేధింపులు 

  ఆన్‌లైన్‌లో పుట్టుకొస్తున్న ఇన్‌స్టెంట్‌ అప్లికేషన్లు 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) కాల్‌మనీ కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో రుణాలిస్తామని, క్షణాల్లో మంజూరు చేస్తామని యువతకు పలు యాప్‌ల నిర్వాహకులు వల వేస్తున్నారు. వందల సంఖ్యలో పుట్టుకొస్తున్న ఈ యాప్‌లిచ్చే ప్రకటనలు చూసి డబ్బు అత్యవసరమైన వారు ఈ యాప్‌లకు బుక్కయిపోతున్నారు. కొన్ని యాప్‌ల నిర్వాహకులైతే ఒక అడుగు ముందుకు వేసి ఆయా ప్రైవేట్‌ పైనాన్స్‌ సంస్థల్లో రుణాలు తీసుకుని, సక్రమంగా వాయిదాలు చెల్లిస్తున్న జాబితా సంపాదిస్తున్నారు. అలాగే పలు క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆయా షాపింగ్‌ మాల్స్‌లో ఈఎంఐ పద్ధతిన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి ఒక్క వాయిదా కూడా పెండింగ్‌ లేకుండా చెల్లించిన వారికి నేరుగా ఫోన్‌ చేస్తున్నారు. నగదు కావాలా, ఎంత కావాలి, వడ్డీ చాలా తక్కువ, ఫోన్‌లో కనిపించే యాప్‌పై ఒక్కసారి క్లిక్‌ చేసి దరఖాస్తు నింపితే చాలని, క్షణాల్లో బ్యాంకులో నగదు జమ చేస్తామని ఆకర్షణీయ తాయిళాలు ప్రకటిస్తున్నారు. దీంతో కొందరు అవసరం లేకపోయినా రుణం తీసుకుంటున్నారు. తర్వాత ఏదైనా అవాంతరం వల్ల సకాలంలో వాయిదా చెల్లించకపోతే వారికి నరకం చూపుతున్నారు. రూ.2 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆన్‌లైన్‌లో రుణాలిస్తుండడంతో కొందరు ఉద్యోగులు కూడా ఈ రుణాలకు మొగ్గు చూపుతున్నారు. ఆనక సకాలంలో చెల్లించని వారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఉదాహరణకు కాకినాడలో ఓ ప్రభుత్వ డ్రైవర్‌ ఒక యాప్‌ ద్వారా రూ.40 వేల రుణం తీసుకుని సక్రమంగా చెల్లించనందుకు అతనిపై వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక బలన్మ రణం పొందాడు. అయితే అతని మృతిని కుటుంబీకులు వేరే విధంగా చెప్పడం విశేషం. మరణించిన ఉద్యోగి మద్యానికి బానిసని, అనారోగ్యంతోనే మరణించాడని పేర్కొనడం గమనార్హం. ఇటువంటి మరణాలు జిల్లాలో అక్కడక్కడా వెలుగు చూస్తున్నప్పటికీ వాస్తవాలను కుటుంబీకులు బయటకు చె ప్పుకోలేకపోతున్నారు. 


సరెండర్‌ అవ్వాల్సిందే.. 


లోన్‌ యాప్‌ నిర్వాహకులు అడిగిన వెంటనే రుణం మంజూరు చేస్తుండడంతో వీటిపై పలువురు దృష్టి సారిస్తున్నారు. తమ వివరాలు ఏంటో కూడా తెలియకుండా యాప్‌లు ఇస్తున్న రుణాలకు కొందరు తర్వాత బలైపోతున్నారు. అప్పు ఇచ్చేవరకు ఎంతో హుందాగా మర్యాదగా మాట్లాడుతున్న నిర్వాహకులు, ఏదైనా ఒక నెల రుణం చెల్లించడంలో ఆలస్యమైతే వారి ప్రతాపం చూపుతున్నారు. రుణ వాయిదా చెల్లించడంలో ఒక్క రోజు ఆలస్యమైనా వడ్డీపై చక్రవడ్డీ వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో యాప్‌ నిర్వాహకులకు సంబంధించిన ఒక లింక్‌ ఫోన్‌లో పంపుతారు. దాన్ని క్లిక్‌ చేశాక ఓ దరఖాస్తు తెరుచుకుంటుంది. ఇందులో రుణ గ్రహీతకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయమంటారు. అలాగే ఫోన్‌లో అభ్యర్థి వ్యక్తిగత సమాచారం తీసుకోవచ్చా అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఓకే అని క్లిక్‌ చేస్తే, తర్వాత నుంచి అప్పు తీరే వరకు ఆ వ్యక్తులు యాప్‌ యాజమాన్యానికి సరెండర్‌ అవ్వాల్సిందే. ఇలా జిల్లాలో ఎందరో ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల బారిన పడి వడ్డీపై వడ్డీ చెల్లిస్తూ జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. ఈ యాప్‌లను ప్రభుత్వం వెంటనే నిషేధించాలని, వీటి ద్వారా రుణాలు తీసుకోవద్దని విస్తృత ప్రచారం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



Updated Date - 2021-01-21T06:52:34+05:30 IST