సముచిత న్యాయం

ABN , First Publish Date - 2021-04-27T05:47:17+05:30 IST

తొమ్మిది నిముషాల ఇరవై తొమ్మిది సెకన్లు... నల్లజాతియువకుడు జార్జిఫ్లాయిడ్‌ పీకమీద శ్వేతజాతి పోలీసు అధికారి తన మోకాలిని తొక్కిపెట్టి...

సముచిత న్యాయం

తొమ్మిది నిముషాల ఇరవై తొమ్మిది సెకన్లు... నల్లజాతియువకుడు జార్జిఫ్లాయిడ్‌ పీకమీద శ్వేతజాతి పోలీసు అధికారి తన మోకాలిని తొక్కిపెట్టి ఉంచిన కాలం. ‘ఊపిరాడటం లేదు...చచ్చిపోయేట్టున్నాను’ అన్న ఆ ఆఫ్రికన్‌ అమెరికన్‌ మొర డెరిక్‌ చోవిన్‌ అనే ఆ పోలీసు చెవికెక్కలేదు. ఫ్లాయిడ్‌ ఉగ్రవాది కాడు, అతడిదగ్గర మారణాయుధాలేమీ లేవు. అతడు ఇచ్చిన ఇరవై డాలర్ల నోటు నకిలీదని సిగరెట్టు అమ్మిన స్టోర్సు యజమాని ఫిర్యాదు చేశాడంతే. ఫ్లాయిడ్‌ చేతులు వెనక్కు విరిచికట్టి, పేవ్‌మెంట్‌ మీద బోర్లా పడేసిన తరువాత, ఆ తెల్లపోలీసు కాస్తంత కాలు సడలిస్తే అతడికి ఊపిరి ఆడుతుందే తప్ప, లేచి పరుగందుకొనే అవకాశం ఎంత మాత్రం లేదు. కాస్తంత ఊపిరి తీసుకోనివ్వు, లేదంటే చనిపోయేట్టున్నాడని చుట్టుపక్కల గుమిగూడినవారంతా సదరు పోలీసు అధికారికి పదేపదే చెప్పారు. చోవిన్‌ ఆ అభ్యర్థనలను లక్ష్యపెట్టలేదు. పదినిముషాల పాటు జేబులో చేతులు పెట్టుకొని, అలాగే పీకమీద మోకాలేసి తొక్కతూంటే ఎవరైనా బతుకుతారా? గత ఏడాది మే 25న అమెరికాలో జరిగిన ఈ ఘోరాతి ఘోరమైన హత్య ఆ దేశాన్ని రగిలించింది, మిగతా ప్రపంచాన్ని కుదిపేసింది. డెరిక్‌ చోవిన్‌ నేరస్థుడేనంటూ అమెరికా న్యాయస్థానం ఇటీవల చేసిన నిర్థారణ ఎంతో మందికి ఉపశమనం ఇచ్చింది.


మూడువారాల పాటు, నలభైఐదుమంది సాక్షులను విచారించిన న్యాయస్థానం, విచారణ ముగించిన రెండురోజుల్లోనే చోవిన్‌ను దోషిగా నిర్థారించింది. ప్రస్తుతానికి శిక్ష ఖరారు కానప్పటికీ, ఆయనకు నలభైయేళ్ళ జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. జాతివివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినవారు, ఆఫ్రికన్‌ అమెరికన్లు ఈ తీర్పును ఘనంగా స్వాగతించారు. కోర్టు బయట గుమిగూడినవారంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ఆ తెల్ల పోలీసును ఉరితీయాలన్నారు కొందరు. ఫ్లాయిడ్ కుటుంబీకులూ సంతోషించారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఈ తీర్పును చరిత్రాత్మకమైన ముందడుగుగా అభివర్ణించారు. ఇక్కడితో ఆగిపోకూడదనీ, పోలీసు వ్యవస్థలో సంస్కరణలకు అమెరికన్‌ కాంగ్రెస్‌ నడుబిగించాలనీ అన్నారు. ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదనీ, అందరికీ న్యాయం అన్న కలలను ఈ తరహా వివక్షలు దూరం చేస్తున్నాయని కమలాహారిస్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ఆసియన్లపై జరిగిన కాల్పులను దృష్టిలోపెట్టుకొని ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. 


తీర్పు ఇలా ఉన్నందుకు సంతోషించవలసిందే కానీ, సహజమైన పోలీసు వక్రీకరణలు, అసత్య వాదనలు ఈ కేసులోనూ చోటుచేసుకున్నాయి. ఫ్లాయిడ్‌ ఓ మానసిక రోగి అనీ, అనారోగ్యవంతుడనీ, కష్టపడి అతడిని అదుపులోకి తెచ్చుకున్న తరువాత సదరు పోలీసు అధికారి అంబులెన్సు కూడా పిలిపించాడని పోలీసులు న్యాయస్థానంలో వాదించారు. వారికి వ్యతిరేకంగా పనిచేసిన బలమైన సాక్ష్యమల్లా ఆ పదినిముషాల విడియో మాత్రమే. డార్నెల్లా ఫ్రెజర్‌ అనే పదిహేడేళ్ళ ఆఫ్రికన్‌ అమెరికన్‌ ఎంతో ధైర్యంగా రోడ్డు పక్కనే నిలబడి, మధ్యలో సెకను కూడా విడవకుండా తన మొబైల్‌లో తీసిన విడియో ప్రపంచాన్ని కుదిపేసింది, న్యాయస్థానంలో నిజాన్ని నిలబెట్టింది. ఆమె తీసిన విడియో నిజమైనదేనని మరో విడియో ద్వారా న్యాయమూర్తులు నిర్థారించుకున్నారు. పెడరెక్కలు విరిచి, నేలపై పడేసిన తరువాత కూడా ఆ పోలీసు అధికారి తన మోకాలితో ఇలా పీకనులిపేయడం ఆమెకు బాధ కలిగించి, ఆ అమానవీయ దృశ్యాన్ని రికార్డుచేసింది. జార్జి ఫ్లాయిడ్‌, డార్నెల్లా ఫ్రేజర్‌ ఒకరికొకరు తెలియకపోవచ్చు. కానీ, ఆమె చొరవ అతడికి మరణానంతర న్యాయం దక్కేట్టు చేసింది. బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ఐ కాంట్‌ బ్రీత్‌ అన్న ఆ వాక్యాలు అమెరికాను వెంటాడుతూనే ఉంటాయి. ఈ తీర్పు అమెరికా పోలీసు వ్యవస్థలో పాతుకుపోయివున్న వివక్షలను రూపుమాపి, వారి మనసుల్లో ఉన్న కల్మషాన్నేమీ కడిగివేయదు. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలోనే, కనీసం ఇద్దరు ఆఫ్రికన్‌ అమెరికన్లు పోలీసుల కాల్పుల్లో కన్నుమూశారు. అమెరికన్‌ సమాజంలో వర్ణవివక్ష ఊహకందనంత లోతుల్లో పాతుకొని ఉన్నది. శ్వేతజాతి పోలీసు అధికారులు ఆత్మరక్షణ పేరిట ఆఫ్రికన్‌ అమెరికన్ల ప్రాణాలు అతి సునాయాసంగా తీస్తున్నారు. తుపాకీ సంస్కృతితో పాటు, ఈ పరస్పర అవిశ్వాసాన్ని కూడా నిర్మూలించేందుకు బైడెన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి.

Updated Date - 2021-04-27T05:47:17+05:30 IST