సముచిత చర్య

ABN , First Publish Date - 2020-05-26T09:24:48+05:30 IST

‘ఇవిజాబితాలో పేర్లు కావు, వారు మనమే’ అంటూ అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువవుతున్న నేపథ్యంలో, న్యూయార్క్‌ టైమ్స్‌ ఆదివారం మొదటి పేజీలో ప్రచురించిన మృతుల జాబితా అమెరికాని ఓ కుదుపు కుదుపుతున్నది...

సముచిత చర్య

‘ఇవిజాబితాలో పేర్లు కావు, వారు మనమే’ అంటూ అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువవుతున్న నేపథ్యంలో, న్యూయార్క్‌ టైమ్స్‌ ఆదివారం మొదటి పేజీలో ప్రచురించిన మృతుల జాబితా అమెరికాని ఓ కుదుపు కుదుపుతున్నది. ‘లక్షకు చేరువవుతున్న మరణాలు, లెక్కకు అందనంత నష్టం’ అన్న పతాక శీర్షికతో, సర్వసాధారణంగా ఫోటోలు, వార్తలు, రంగులతో మెరిపించాల్సిన మొదటి పేజీని నలుపు తెలుపులో కేవలం మృతుల వివరాలతో నింపేసింది ఆ పత్రిక. ‘ప్రతి ఒక్కరికీ కేటాయించిన ఆ రెండు లైన్లలో నాకు పేర్లు, ఊర్లు కాదు, వారి జీవితచరిత్ర కనిపిస్తున్నది’ అని సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యాఖ్యానించారు. ‘ఒక మరణం–ఒక బంధం–విచ్ఛిన్నమైన ఓ కుటుంబం’ అని కొందరు వాపోయారు. లక్షమంది మృతుల్లో ఒక శాతానికి మాత్రమే ఇక్కడ చోటు దక్కి ఉండవచ్చు కానీ, ఆ పత్రిక చూపిన సాహసం, ప్రదర్శించిన మానవత్వం అమెరికన్ల మనసులు కదిలించింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొందరు మిత్రులతో గోల్ఫ్‌ ఆడుతున్న దృశ్యాలు టీవీ చానళ్ళలో చూసి వారి గుండెలు రగిలిపోయాయి.


కేవలం మృతుల సంఖ్య ఒక మరణం చుట్టూ అలుముకున్న విషాదాన్ని తెలియచెప్పలేదు. అమెరికా ఎదుర్కొంటున్న ఒక మహాసంక్షోభాన్ని ప్రజల ముందు విభిన్నంగా ఆవిష్కరించినందుకూ, అందుకు ఎంతో శ్రమించినందుకు న్యూయార్క్‌టైమ్స్‌ను అభినందించాలి. పత్రికాస్వేచ్ఛ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకు మండిపడతారో అమెరికన్లకు మరోమారు అర్థమై ఉంటుంది. చావులు తగ్గాయనీ, వ్యాప్తి నీరసించిందనీ ఆయన సగర్వంగా ట్వీట్‌చేసిన రోజే, ఈ జాబితా వెలువడం, మరోవైపు ఇంతటి సంక్షోభంలోనూ ట్రంప్‌ తన వ్యక్తిగత రిసార్టులో గోల్ఫ్‌ ఆడుతూ మిత్రులతో కరచాలనాలు చేయడం ప్రజలు చూశారు. ట్రంప్‌ మొదట్లో అంచనాకట్టిన మృతుల సంఖ్యకంటే అమెరికాలో ఇప్పుడు రెట్టింపు ఉంది. కరోనా బాధితులు, మృతులు అత్యధికంగా నల్లవారు, హిస్పానిక్స్‌ కనుక తెల్లసమాజానికి పట్టింపులేకపోతున్నది. భారీ ఉద్దీపనలతో తన ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడంతో పాటు, మరణాలను నియంత్రించడంలో తన వైఫల్యాన్ని ట్రంప్‌ తెలివిగా చైనామీద యుద్ధంగా మార్చేశారు. 


ఈ వైరస్‌ కమ్ముకురాకముందు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయావకాశాలు మెరుగ్గానే ఉండేవి. ఉద్యోగాలు, టారిఫ్‌లు, వలసలు ఇత్యాది అంశాల్లో తాను అమెరికన్ల ప్రయోజనం కోసం పోరాడుతున్నట్టు ఆయన బాగానే నమ్మించారు. సుంకాల విషయంలో చైనా తదితర దేశాల మెడలు వంచి రాజీకి తెచ్చుకున్నారు. కానీ, ఆయన నిర్లక్ష్య స్వభావాన్నీ, అవగాహనారాహిత్యాన్ని ప్రజలకు కరోనా స్పష్టంగా తెలియచెప్పింది. అధికారులు, నిపుణులు, చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలను కూడా బేఖాతరు చేయడం ద్వారా ఆయన దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. రోగులకు డిస్‌ఇన్ఫెక్టెంట్స్‌ ఎక్కించడం వంటి అర్థంలేని వ్యాఖ్యలతో అభాసుపాలైనారు. ఇక చైనా కరోనా కుట్ర గురించి ఆయన మాట్లాడని రోజులేదు. ఇంటలిజెన్స్‌ విభాగం డైరక్టరేట్‌ సైతం కరోనా మానవ సృష్టి కాదని తేల్చినా వెనక్కుతగ్గలేదు. తనను ఓడించి, జో బిడెన్‌ను గెలిపించేందుకే చైనా ఈ వైరస్‌ను వాడుకున్నదని అన్నారాయన.


ప్రపంచ ఆరోగ్యసంస్థను చైనా చేతి కీలుబొమ్మగా అభివర్ణించి, దానిని నిధుల నిలిపివేత పేరిట బెదిరించడమూ తెలిసిందే. వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలపై ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తీర్మానించడం చైనాకు పెద్ద ఎదురుదెబ్బ. 120  దేశాలు ముక్తకంఠంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాదనలేని స్థితి చైనాది. ఆరోగ్యసంస్థను ఇరకాటంలో పడనీయకుండా, చైనా పేరు నేరుగా ఎత్తకుండా మొత్తానికి యూరప్‌దేశాలు ఈ కథ నడిపించాయి. అమెరికా–చైనా మధ్య ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నదనీ, ఇది అమెరికన్‌ పాలకుల రాజకీయ అవసరమని చైనా విదేశాంగమంత్రి ఇటీవల ఓ వ్యాఖ్యచేశారు. అమెరికాను ప్రస్తుతం పొలిటికల్‌ వైరస్‌ పట్టిపీడిస్తున్నదని ఎన్నడూలేనంత ఘాటుగా అన్నారు. ఇక అమెరికాతో మర్యాదగా వ్యవహరించడం అనవసరమనీ, ఆత్మరక్షణకు స్వస్తిచెప్పి, కరనా సృష్టించిన సంక్షోభాన్ని సదవకాశంగా మార్చుకోవడం ఉత్తమమని చైనా అనుకుంటున్నట్టుంది. హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రతాచట్టాన్ని అమలు చేయడానికి సంకల్పించడం, సరిహద్దులో మనతో గొడవకు దిగడం వంటివి అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలను ప్రత్యక్షంగా దెబ్బతీయాలని నిర్ణయించుకోవడమే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకూ ఈ వేడి మరింత రాజుకోవడం ఖాయం.

Updated Date - 2020-05-26T09:24:48+05:30 IST