మాయావతిని సీఎం చేస్తామన్నా పొత్తుకు ఒప్పుకోలేదు: రాహుల్

ABN , First Publish Date - 2022-04-09T22:46:55+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయవతి సారథ్యంలోని బీఎస్‌పీతో పొత్తు పెట్టుకుని... ఆమెను ముఖ్యమంత్రి..

మాయావతిని సీఎం చేస్తామన్నా పొత్తుకు ఒప్పుకోలేదు: రాహుల్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయవతి సారథ్యంలోని బీఎస్‌పీతో పొత్తు పెట్టుకుని... ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఆ ఆఫర్‌కు మాయావతి ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. కేంద్ర ఏజెన్సీల ఒత్తిడే అందుకు కారణం కావచ్చునని అన్నారు. ''ద దలిత్ ట్రూత్ : ద బ్యాటిల్స్ ఫర్ లియలైజింగ్ అంబేద్కర్స్ విజన్'' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సన్నిహితుడు కె.రాజు ఈ పుస్తకాన్ని రచించగా, సమృద్ధ భారత్ పౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.


ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, సంస్థలకు స్వేచ్ఛ ఇవ్వకుంటే రాజ్యాంగానికి అర్ధం లేదని, బిఆర్ ఆంబేద్కర్ రాజ్యాంగమనే ఆయుధాన్ని మనకు ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆ ఆయుధానికి ఆర్థం లేకుండా పోతోందని అన్నారు. పెగాసస్ ద్వారా రాజకీయ వేత్తలను కంట్రోల్ చేయడం, మీడియాను కంట్రోల్ చేయడం, నలుగురు ముగ్గురు పారిశ్రామిక వేత్తల కోసం పని చేయడం జరుగుతోందని విమర్శించారు. గాంధీ, అంబేద్కర్‌లు చూపించిన మార్గంలోనే మనమంతా పయనించాలని, అదంత సులభం కానప్పటికీ ఆ మార్గాన్నే అనుసరించాలని ఆయన సూచించారు.


''కొందరు రాజకీయవేత్తలు ఉన్నారు. మీరు చూసే ఉండొచ్చు. ఎన్నికల్లో మాయవతి ఏమాత్రం పోరాటం సాగించలేదు. పొత్తు పెట్టుకుందాం, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండండంటూ మేము సందేశం పంపాం. ఆమె స్పందించలేదు. కాన్షీరామ్ వంటి నేతలంటే మాకెంతో గౌరవం. యూపీలో దళితుల సాధికరత కోసం వారంతా అహరహం శ్రమించారు. కాంగ్రెస్ కూడా నష్టపోయింది. కానీ, మాయవతి వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నం. నేను వారి కోసం పోరాడనని మాయవతి ఓపెన్‌గానే చెప్పేశారు. ఎందుకు? సీబీఐ, ఈడీ, పెగాసస్ వల్లే..'' అని రాహుల్ అన్నారు.


బీజేపీతో అవగాహన వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తగినంత ప్రచారం కానీ, పొత్తులు కుదుర్చుకోవడం కానీ మాయావతి చేయలేదంటూ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్దఎత్తున విమర్శలు వెల్లువత్తాయి. అయితే, ఈ ఆరోపణలను మాయావతి కొట్టివేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ కేవలం ఒకే సీటు గెలుచుకుంది. గతంలో 22 శాతంగా ఉన్న ఆ పార్టీ ఓటింగ్ షేర్ 2022 ఎన్నికల్లో 12.88 శాతానికి పడిపోయింది. 

Updated Date - 2022-04-09T22:46:55+05:30 IST