విద్యాధికారిని నియమించరా?

ABN , First Publish Date - 2022-06-28T04:58:39+05:30 IST

ఉమ్మడి దౌల్తాబాద్‌ మండలానికి ఒకే విద్యాధికారి ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది.

విద్యాధికారిని నియమించరా?

  రాయపోల్‌కు ఐదేళ్లుగా ఇన్‌చార్జి ఎంఈవోనే

 ప్రారంభానికి నోచుకోని ఎమ్మార్సీ భవనం 


రాయపోల్‌, జూన్‌ 27: ఉమ్మడి దౌల్తాబాద్‌ మండలానికి ఒకే విద్యాధికారి ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. ఉమ్మడి దౌల్తాబాద్‌ మండలం నుంచి విడిపోయి రాయపోల్‌ కేంద్రంగా 2017 అక్టోబరు 11న నూతన మండలం ఏర్పాటయింది. పోలీస్‌ స్టేషన్‌తో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల విభజన వెను వెంటనే జరిగి పోయింది. కానీ విద్యాశాఖ విభజనకు నోచుకోలేదు. దౌల్తాబాద్‌ మండల విద్యాధికారే రాయపోల్‌ మండలానికి ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. మండల విద్యాధికారి కార్యాలయం కూడా దౌల్తాబాద్‌ కేంద్రంలోనే ఉంది. ఆర్వీఎం ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితమే మండల వనరుల కేంద్ర భవనాన్ని రాయపోల్‌లో నిర్మించారు. కానీ విద్యాధికారిని మాత్రం నియమించలేదు. ఉమ్మడి మండలానికి ఒకే విద్యాధికారి ఉండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడింది. రాయపోల్‌ మండలంలో 6 ఉన్నత, 4 ప్రాథమికోన్నత, 19 ప్రాథమిక, ఒక కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలున్నాయి. ఆయా పాఠశాలల్లో 3,546 మంది విద్యార్థులున్నారు. 150 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా 125 మంది పని చేస్తున్నారు. ఉపాధ్యాయులతో నిర్వహించే సమావేశాలు, శిక్షణా తరగతులను దౌల్తాబాద్‌లో నిర్వహిస్తుండడంతో తరచూ విద్యాబోధనకు అంతరాయం ఏర్పడుతున్నది. 


 

Updated Date - 2022-06-28T04:58:39+05:30 IST