జూన్ 4వ తేదీ తుది గడువు: కలెక్టర్ హన్మంతరావు
సంగారెడ్డి రూరల్/ సిద్దిపేట అగ్రికల్చర్, మే. 24: అక్రెడిటేషన్ల జారీ కోసం పాత్రికేయులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్ ఎం. హన్మంతరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022-24 సంవత్సరానికి గాను రెండేళ్ల కాలవ్యవధికి అక్రెడిటేషన్ కార్డుల జారీకి పాత్రికేయులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని తెలిపారు. ప్రస్తుత అక్రెడిటేషన్ల గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తున్నందున కొత్తగా అక్రెడిటేషన్ కార్డుల జారీకి అర్హులైన ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ నెల 25 నుంచి సమాచారశాఖ ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లి అక్రెడిటేషన్ లింక్‌ను క్లిక్ చేసి జర్నలి్‌స్టలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్ అక్రెడిటేషన్ ఫారంలో అడిగిన సమాచారాన్ని భర్తీ చేస్తూ ఫొటోలను, డాక్యుమెంట్లను జత చేయాలని సూచించారు. మొదటి విడత ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు జూన్ 4వ తేదీ తుది గడువని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ జీవో 239 మేరకు అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత సమయంలోగా దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ హన్మంతరావు కోరారు.