Abn logo
Sep 26 2021 @ 00:39AM

ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకోండి

అఖిలపక్ష నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్‌ ఈశ్వరరావు. పక్కన హేమలత ఉన్నారు

తుది గడువు నవంబరు 30

 నియోజకవర్గ ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి హేమలత

భీమునిపట్నం, సెప్టెంబరు 25: భీమిలి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్‌ బూత్‌ల అభ్యంతరాలపై నవంబరు 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.హేమలత పేర్కొన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-2022పై అఖిలపక్ష నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో మండలాల వారీగా ఉన్న మొత్తం పోలింగ్‌ బూత్‌లు, మహిళలు, పురుష ఓటర్ల గురించి వివరించారు. కాగా పద్మనాభ మండలం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సచివాలయ నిర్మాణం జరుగుతున్నందున అక్కడ ఉన్న బూత్‌ నంబర్‌-19ను రెడ్డిపల్లి మండల పరిషత్‌ ఎలిమెంటరీ పాఠశాలలోని ఓ గదిలోకి మార్పు చేయాలని ఆదేశించామన్నారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం శివారు పల్లిపేట స్కూల్‌ భవనంలో ఉన్న బూత్‌ నంబర్‌-87ను ఆ భవనం శిథిల స్థితికి చేరినందున మచ్చవానిపాలెం అంగన్‌వాడి భవనంలోకి మార్పు చేయాలని సూచించామన్నారు. అసిస్టెంట్‌ ఎలక్ర్టోరల్‌ అధికారి, భీమిలి మండల తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది నవంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై ప్రచార దినాలుగా నిర్ణయించి, ఆ రోజుల్లో పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఉండే అధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రతినిధులు కె.ఎల్లయ్య, ఎం.షణ్ముఖరావు, టీడీపీ ప్రతినిధులు జి.నూకరాజు, ఎం.సంజీవికుమార్‌, బీజేపీ నుంచి కె.రామానాయుడు, కె.శ్రీహరి, సీపీఎం తరపున ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, కాంగ్రెస్‌ నుంచి కె.జగన్నాఽథ్‌, గాదం మహేశ్‌తో పాటు ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సువర్ణబాయి, తదితరులు పాల్గొన్నారు.