అటకెక్కుతున్న అర్జీలు

ABN , First Publish Date - 2021-01-09T06:14:48+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీల పరిష్కారాలు నత్తకు నడక నేర్పుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో అయితే బుట్టదాఖలవుతున్నాయి.

అటకెక్కుతున్న అర్జీలు
రాచర్ల తహసీల్దార్‌ కార్యాలయం, పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు

జిల్లావ్యాప్తంగా 4696 పెండింగ్‌

పట్టించుకోని అధికారులు 

పేరుకుపోతున్న దరఖాస్తులు

ఒక్క రాచర్ల మండలంలోనే 500 

మీరిపోతున్న గడువు 

మళ్లీ అర్జీలు.. ఎదురుచూపులు

మీ సేవ ఖర్చులు తడిసిమోపెడు

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

వేధిస్తున్న సిబ్బంది కొరత 



పక్క చిత్రంలో కనిపిస్తున్న కాగితాల గుట్ట ఏమిటా.. అనుకుంటున్నారా...? ఇవి గత రెండు నెలల్లో రాచర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి మీ సేవల ద్వారా వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలు. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. జిల్లాలోని చాలా మండలాల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సామాన్య రైతులు భూముల ఆన్‌లైన్‌,  సవరణల కోసం, పేదలు ఇతర అవసరాల కోసం మీసేవల్లో దరఖాస్తు చేస్తే తహసీల్దార్‌ కార్యాలయంలో ఇలా బుట్టదాఖలు చేస్తున్నారు. కార్యాలయంలో అధికారులు లేరంటూ ఒక్క ఫైల్‌ కూడా ముందుకు సాగకపోవడంతో ఇక్కడే వీటికి చెదలు పట్టే పరిస్థితి నెలకొంది. మీసేవల్లో డిస్‌ప్లే గడువు ముగియనుండటంతో పలు అర్జీలు మరోసారి పెట్టుకోవాల్సిన  దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే అలా పంపించి పలువురు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 



ఒంగోలు(కలెక్టరేట్‌) / రాచర్ల జనవరి 8: ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీల పరిష్కారాలు నత్తకు నడక నేర్పుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో అయితే బుట్టదాఖలవుతున్నాయి. రెనెన్యూకు సంబంధించి ఆన్‌లైన్‌, కొత్త పాసుపుస్తకాలు, సర్వే, పేరు మార్పులు, మ్యూటేషన్‌.. తదితర అర్జీలకు మోక్షం గగనంగా మారింది. వేలసంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు కొన్ని చోట్ల సిబ్బంది కొరత ప్రధాన కారణమవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. దీంతో సామాన్యప్రజానీకం రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 56 మండలాలు ఉండగా ఆయా మండలాల్లోని పలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఐదారుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే పనిచేస్తుండటంతో ఆయా సమస్యలు ఎక్కడిక్కడే నిలిచిపోతున్నాయి.


గ్రామ సచివాలయాలు వచ్చినా..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు స్పందన పోర్టల్‌ను పలు చేర్పులు, మార్పులతో నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసింది. ఈ నాలుగు నెలల్లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయా శాఖలకు 8,245 ఫిర్యాదులు రాగా అందులో కేవలం 3,228 సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయి. మరో 321 దరఖాస్తులు సక్రమంగా పరిష్కారం కాక రీఓపెన్‌ అయ్యాయి. మరో 4,696 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు అర్హత ఉన్న వారికి అందకపోవడంతో ఆయా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. రైతు భరోసా, అమ్మఒడి, రేషన్‌కార్డులు, ఇసుక సమస్య తదితర వాటి కోసం ప్రజానీకం చేసుకున్న దరఖాస్తులు సిబ్బంది కొరత కారణంగా పరిష్కారం కావడం లేదు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ పరిధిలో 1,370, సచివాలయాల్లో 634, రెవెన్యూశాఖలో 695, మైన్స్‌లో 420, స్కూలు ఎడ్యుకేషన్‌లో 308 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా మిగిలిన అర్జీలు పలు శాఖల్లో నిలిచిపోయాయి.


వేధిస్తున్న సిబ్బంది కొరత

ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా మండల స్థాయిలో కీలకంగా పనిచేసే తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎక్కువ ఖాళీలు ఉండటం వలన నెలల తరబడి అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. నాగులుప్పలపాడు, వలేటి వారిపాలెం, రాచర్ల తదితర మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. అర్జీలు పరిష్కారం కాకపోవ డంతో ప్రభుత్వ పథకాల లబ్ధి అందక పేదలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 


లక్షలు వెచ్చిస్తున్నారు

గతనెల నుంచి ఆన్‌లైన్‌ కోసం, పేరు మార్పుల కోసం  అధికారికంగా ఇప్పటివరకూ మీసేవ ద్వారా గాని, సచివాలయం నుంచి గాని 5వేలకుపైగా దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చాయి. ఆన్‌లైన్‌ కోసం రైతు మీసేవ నుంచి అర్జీ పెట్టుకుంటే రూ.200వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే రూ.10లక్షలకుపైగా అటు మీసేవ నుంచి, ఇటు సచివాలయాల నుంచి దరఖాస్తులు రైతులు, ఇతర అర్జీదారులు ఖర్చుచేసి ఉంటారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్న రోజులు కావడంతో పనిదినాలు సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ 5వేల అర్జీలకు అదనంగా మరో రూ.30లక్షలు వెచ్చించినట్లు లెక్క. ఇంత కష్టపడి రైతులు అర్జీలు పెట్టుకుంటే వీటిని అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. మరోసారి అర్జీలు పెట్టుకోవాలంటే మీసేవలకు మరో రూ.10లక్షలు, రైతు పనిదినం కింద మరో రూ.30లక్షలు రైతులపై భారం పడుతోంది. సచివాలయం మొదలు, తహసీల్దార్‌ కార్యాలయం తదితర ఉద్యోగులు రైతుల సేవ కోసమే ఉన్నారని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ, ఇలా అర్జీలు బుట్టదాఖలు కావడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వేధిస్తున్న సిబ్బంది కొరత

ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా మండల స్థాయిలో కీలకంగా పనిచేసే తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎక్కువ ఖాళీలు ఉండటం వలన నెలల తరబడి అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయి. నాగులుప్పలపాడు, వలేటి వారిపాలెం, రాచర్ల తదితర మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. అర్జీలు పరిష్కారం కాకపోవ డంతో ప్రభుత్వ పథకాల లబ్ధి అందక పేదలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 


రాచర్లలో మరీ దారుణం

రాచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో గత రెండు నెలల కాలంగా ఒక్కటంటే ఒక్క ఫైల్‌ కూడా ముందుకు నడవడం లేదు. ప్రజలు మీ సేవల ద్వారా పెట్టుకున్న దరఖాస్తులు రెవెన్యూ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక గుట్టగా వేశారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో అర్జీలు పరిష్కరించలేక పోతున్నామని తహసీల్దారే పేర్కొవడం గమనార్హం. ఈ మండలంలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐ, సీనియర్‌ సహాయకుడు  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి భర్తీ అయితేనే ఈ అర్జీలకు పరిష్కారం అని అధికారులే చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో తహసీల్దార్‌ జి.జయపాల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ జి.శేఖర్‌ మాత్రమే ఉన్నారు. మిగిలిన అధికారులు వచ్చేవరకు ప్రత్యామ్నాయ మార్గం లోనైనా అర్జీలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-01-09T06:14:48+05:30 IST