‘చేయూత’ దక్కేనా?

ABN , First Publish Date - 2020-07-04T11:23:30+05:30 IST

మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయంశక్తి సంఘాల మహిళలతో పాటు ఇతర

‘చేయూత’ దక్కేనా?

దరఖాస్తులకు రెండు రోజులే గడువు

ఇప్పటికి 50 శాతమేనమోదు

సర్వర్‌ బిజీతో ఇబ్బందులు 

ఫోన్‌ నంబర్‌కు ఆధార్‌ లింకు కాక ఇక్కట్లు 


కలెక్టరేట్‌, జూలై 3: మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయంశక్తి సంఘాల మహిళలతో పాటు ఇతర మహిళలకు నాలుగేళ్లలో ఒక్కొక్కరికీ రూ.75 వేల చొప్పున ఈ పథకం కింద అందించాలని నిర్ణయిందించి. ఈ నెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. గడువు సమయం చాలా తక్కువ  కావడంతో దరఖాస్తు చేసుకునేందుకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో 50 శాతం దరఖాస్తులు కూడా నమోదు కాలేదు.


ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ పథకం పొందాలంటే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వీటికోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ముందుగా నమోదు చేసుకోవాలి. కుల ధ్రువీకరణ పత్రం వచ్చేసరికి సుమారు రెండు, మూడు రోజులు పడుతోంది.  దీంతో దరఖాస్తులు వేగంగా నమోదు కావడంలేదు. గడువు నాటికి పూర్తిస్థాయిలో దరఖాస్తులు నమోదయ్యే సూచనలు కనిపించడం లేదు. 


 ఆధార్‌కు లింకుకాని ఫోన్‌ నంబర్లు

చాలామంది దరఖాస్తుదారుల ఫోన్‌ నంబర్లు ఆధార్‌ నంబర్‌కు లింకు కాలేదు. దీంతో దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. అర్ధాంతరంగా ఆన్‌లైన్‌ నిలిచిపోతోంది. ఆధార్‌ లింకు కోసం దరఖాస్తుదారులు అవస్థలు పడుతున్నారు. మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఒకపక్క గడువు ముగింపు దశకు చేరడం, మరోపక్క సర్వర్‌ మొరాయింపు మరింత ఇబ్బందిగా మారింది. ఆధార్‌, ఫోన్‌నంబర్‌ లింక్‌కు సుమారు రెండు, మూడు రోజులు సమయం పడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన గడువు ఏ మాత్రం సరిపడకపోవడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు సచివాలయ సిబ్బంది అనేక అవస్థలు పడుతున్నారు. 


వార్షిక ఆదాయంపై స్పష్టత కరువు 

ఈ పథకానికి అర్హులు ఎవరో.. అనర్హులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా వార్షిక ఆదాయం ఎంత ఉండాలనే విషయంలో సృష్టత లేకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. స్వయంశక్తి సంఘాల మహిళలతో పాటు ఇతర మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.


మూడు ఎకరాల పల్లపు భూమి ఉన్నా, 10 ఎకరాలు మెట్టు భూమి ఉన్నా అనర్హులని చెప్పింది. అదే విధంగా దరఖాస్తు చేసుకున్న మహిళలు ఎటువంటి పింఛన్‌ పొందినా ‘చేయూత’ పథకానికి అనర్హులే అన్న నిబంధన ఉంది. వార్షిక ఆదాయంపై సృష్టత లేకపోవటంతో చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు సతమతవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హతలకు సంబంధించి పూర్తి నిబంధనలు తెలియజేయడంతో పాటు గడువు పొడిగించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-07-04T11:23:30+05:30 IST