భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలకు దరఖాస్తు

ABN , First Publish Date - 2021-08-06T06:51:23+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.

భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలకు దరఖాస్తు

వాణిజ్యపరంగా విడుదలకు సన్నాహాలు: అరబిందో ఫార్మా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా బయో సిమిలర్లును మార్కెట్లోకి  విడుదల చేయనున్నామని, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ఉత్పత్తిని పెంచనున్నామని 2020-21 వార్షిక నివేదికలో అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌ కే నిత్యానంద రెడ్డి తెలిపారు. వాణిజ్యపరంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ఇందుకోసం అమెరికాకు చెందిన వాక్సినిటీ కంపెనీతో లైసెన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందానికి అనుగుణంగా మల్టీటోప్‌ పెప్టైడ్‌ ఆధారిత కొవిడ్‌ వ్యాక్సిన్‌ యూబీ612 అభివృద్ధి, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనున్నామని ఆయన వివరించారు. తైవాన్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌పై వాక్సినిటీ రెండో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి. భారత్‌లో రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలకు కూడా వ్యాక్సినిటీ దరఖాస్తు చేసింది. హైదరాబాద్‌లో వైరల్‌ వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ సిద్ధమవుతోందని నిత్యానంద రెడ్డి చెప్పారు. బయోసిమిలర్ల పోర్టుఫోలియోను సమకూర్చుకునే దిశగా స్థిరమైన పురోగతిని సాధిస్తున్నామని, 50 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని బయోసిమిలర్లను విడుదల చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం కంపెనీ 15 బయోసిమిలర్లను అభివృద్ధి చేస్తోంది. 


అమెరికా ఇంజెక్టబుల్స్‌ యూనిట్‌ పూర్తి

భవిష్యత్తులో వృద్ధికి ఇంజెక్టబుల్స్‌ వ్యాపారమే కీలకమని అరబిందో ఫార్మా భావిస్తోంది. ఇప్పటికే కంపెనీకి లిక్విడ్‌, లివోఫిలైజ్డ్‌ వైయల్స్‌, బ్యాగ్‌లు, ప్రీఫిల్డ్‌ సిరెంజ్‌లు మొదలైన ఇంజెక్టబుల్స్‌లో పట్టు ఉంది. కంపెనీకి ఇంజెక్టబుల్స్‌ తయారీలో మంచి అనుభవం, సామర్థ్యాలు ఉన్నాయని నిత్యానంద రెడ్డి చెప్పారు. అమెరికాలో ఇంజెక్టబుల్స్‌ తయారీకి ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో యూరప్‌, అభివృద్ధి మార్కెట్ల కోసం మరో ఇంజెక్టబుల్స్‌ తయారీ యూనిట్‌ను అరబిందో ఏర్పాటు చేస్తోంది. వచ్చే 15-18 నెలల్లో ఈ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మొత్తం మీద కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, ఇంజెక్టబుల్స్‌, కాంప్లెక్స్‌ జెనరిక్స్‌ ఔషధాలు భవిష్యత్‌ వృద్ధికి బాటలు వేయనున్నాయని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌ గోవిందరాజన్‌ తెలిపారు. కేన్సర్‌, ఆప్తమాలజీ, ఇమ్యునాలజీ విభాగాల ఔషధాలపై కంపెనీ దృష్టి కొనసాగుతుందన్నారు. 


స్పెషాలిటీ  ఔషధాలపై దృష్టి 

అమెరికాలోని స్పెషాలిటీ ఔషధాల మార్కెట్లోకి ప్రవేశించడానికి కాంప్లెక్సిటీ ఔషధాలపై కంపెనీ దృష్టి పెడుతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఔషధ మార్కెట్‌ అయిన చైనాలో విస్తరించడానికి పటిష్ఠమైన ప్రణాళికలను కంపెనీ సిద్ధం చేసుకుంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), ఇతర కీలక వృద్ధి మార్కెట్లయిన కెనడా, బ్రెజిల్‌, దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. 

Updated Date - 2021-08-06T06:51:23+05:30 IST