అర్జీదారులు సంతృప్తి చెందాలి

ABN , First Publish Date - 2022-05-24T05:16:38+05:30 IST

అర్జీదారులు సంతృప్తి చెందేలా స్పందన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

అర్జీదారులు సంతృప్తి చెందాలి

  1.  స్పందన సమస్యలను త్వరగా పరిష్కరించాలి
  2.  అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు (కలెక్టరేట్‌), మే 23: అర్జీదారులు  సంతృప్తి చెందేలా స్పందన సమస్యలను త్వరగా  పరిష్కరించాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పందన అర్జీల పరిష్కారం, ఏపీ సేవల డెలివరీ తదితర అంశాలను  వీడియో కాన్ఫరెన్స ద్వారా  మున్సిపల్‌ కమిషనర్‌లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వీఆర్వోలు సరిగా స్పందించడం లేదని దరఖాస్తులు వస్తున్నాయని, వీటికి బాధ్యత వహించాల్సింది తహసీల్దార్లేనని అన్నారు.  ఇకపై ఇలాంటి ఆరోపణలు లేకుండా తహసీల్దార్లు గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్పందనకు వచ్చిన దరఖాస్తుల్లో గడువు దాటిన సమస్యలు జీరో కావడం పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఇక ముందు కూడా గడువులోపు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకూ సమస్యల పరిష్కారంలో పురోగతి చూపించాలని, రీఓపెన కాకుండా నాణ్యమైన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అవసరమైతే అర్జీదారులతో మీ సమస్యను పరిష్కరిస్తున్నామని చెబితే వారు సంతృప్తి చెందుతారని అన్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల బయోమెట్రిక్‌ నమోదు అంశంపై ప్రత్యేక దృష్టి సారించి నమోదు శాతం పెరిగేలా జడ్పీ సీఈవో చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన తదితర పథకాలకు  డిజిటల్‌ అక్నాలెడ్జిమెంట్‌ పొందేలా చూడాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత జగనన్న గోరుముద్ద పథకాన్ని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

  ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి:

 పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని  కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మే నెలాఖరులోపు మంజూరైన ఇళ్ల పనులన్నీ మొదలు కావాలని, వర్షాలు మొదలయ్యేలోపు  పునాది స్థాయికి తీసుకురావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు హౌసింగ్‌ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలన్నా రు. మండల స్పెషల్‌ ఆఫీసర్లు ఈ అంశంపై తహసీల్దార్‌, ఎంపీడీవో, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, హౌసింగ్‌ ఏఈలతో ప్రతి వారం సమీక్ష చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్లు ఎంపీడీవోలను ఆదేశించారు. 

స్పందనకు వచ్చిన వినతులు:

    తల్లిదండ్రుల ఆస్తి నుంచి తనకు వాటా  వచ్చేలా న్యాయం చేయాలని కర్నూ లు   కొత్తపేట  ప్రాంతానికి చెందిన టి.వెంకటరమణ వినతిపత్రం సమర్పించారు.

  తన భర్త చనిపోయాడని, కల్లూరు గ్రామ సర్వే నెంబర్‌ 781 - ఎ2- 2ఎ - 1బి లో గల 2 ఎకరాల పొలంలో తనకు రావాల్సిన వాటా వచ్చేలా చూడాలి జొహరాపురం గ్రామానికి చెందిన ఎస్‌.వెంకటమ్మ అర్జీ సమర్పించారు.


Updated Date - 2022-05-24T05:16:38+05:30 IST