యాపిల్‌ సరసన మైక్రోసాఫ్ట్‌

ABN , First Publish Date - 2021-06-24T08:34:01+05:30 IST

తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యంలో దూసుకెళ్తోన్న మైక్రోసాఫ్ట్‌ మరో రికార్డు సృష్టించింది. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన రెండో అమెరికన్‌ లిస్టెడ్‌ కంపెనీగా అవతరించింది.

యాపిల్‌ సరసన మైక్రోసాఫ్ట్‌

2 లక్షల కోట్ల డాలర్లకు కంపెనీ మార్కెట్‌ విలువ

ఈ రికార్డు సృష్టించిన రెండో అమెరికన్‌ కంపెనీ 


న్యూయార్క్‌: తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యంలో దూసుకెళ్తోన్న మైక్రోసాఫ్ట్‌ మరో రికార్డు సృష్టించింది. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన రెండో అమెరికన్‌ లిస్టెడ్‌ కంపెనీగా అవతరించింది. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం యాపిల్‌దే. ఐఫోన్‌ తయారీ దిగ్గజం యాపిల్‌.. 2020 ఆగస్టులోనే ఈ రికార్డును నమోదు చేసుకుంది. ప్రస్తుతం యాపిల్‌ మార్కెట్‌ విలువ 2.23 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో మైక్రోసాఫ్ట్‌ షేరు ధర మంగళవారం ఒక దశలో 1.2 శాతం పుంజుకోవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ రెండు లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరుకోగలిగింది. చివరికి 1.1 శాతం లాభంతో షేరు ధర 265.51 డాలర్ల వద్ద ముగిసింది. దాంతో మార్కెట్‌ క్యాప్‌ మళ్లీ రెండు లక్షల కోట్ల డాలర్లకు దిగువకు పడిపోయింది. 


గేట్స్‌ ఫౌండేషన్‌కు బఫెట్‌ రాజీనామా:

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన భార్యతో కలిసి ప్రారంభించిన ఛారిటీ సంస్థ గేట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ సభ్యత్వానికి బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే చైర్మన్‌, ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ రాజీనామా చేశారు. బిల్‌గేట్స్‌, మిలిండా గేట్స్‌ దంపతులతోపాటు ఈ ఫౌండేషన్‌ బోర్డులోని ముగ్గురు సభ్యుల్లో బఫెట్‌ ఒకరు.  

Updated Date - 2021-06-24T08:34:01+05:30 IST