యాపిల్‌ ఐ ఫోన్‌..తెలివైన నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-05T09:52:53+05:30 IST

స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఆఖరి సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.

యాపిల్‌ ఐ ఫోన్‌..తెలివైన నిర్ణయం

 ప్రతిపాదనపై విభేదించిన సభ్యులు

 సరైన నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌కు సూచన

 రెండున్నర నెలల తరువాత స్టాండింగ్‌ కమిటీ సమావేశం


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఆఖరి సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. యాపిల్‌ ఐ ఫోన్‌ తీసుకొనే అంశానికి సంబంధించి చేతికి మట్టి అంటకుండా తెలివిగా వ్యవహరించారు. గ్రేటర్‌లో ప్రతియేటా కొత్తగా ఎన్నికయ్యే స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు ఫోన్‌లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది ఎన్నికైన కమిటీ పదవీకాలం ఈ నెల 10వ తేదీతో ముగుస్తుంది. కమిటీ సభ్యులకు గురువారం చివరి సమావేశం. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండున్నర నెలలుగా సమావేశం జరగలేదు. అభివృద్ధి పనుల ప్రతిపాదనల కోసమే అనుకున్నప్పటికీ.. ఎజెండాలో ఐ ఫోన్ల అంశాన్నీ అధికారులు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. 34 అంశాలతో కూడిన ఎజెండాపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు.


కమిటీ సభ్యులు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు యాపిల్‌ ఐ ఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ మొబైల్‌ ఇవ్వాలని ప్రతిపాదించారు.  ఈ ప్రతిపాదనతో సభ్యులు విభేదించారు. లాక్‌డౌన్‌ అమలుతో ప్రభుత్వ విభాగాలు భారీగా ఆదాయం కోల్పోయాయని, ఈ సమయంలో ఫోన్లు తీసుకోవడం సబబు కాదన్న ఉద్దేశంతో సభ్యులు ఫోన్లు తీసుకోవద్దని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌కు కమిటీ సూచించింది.  


ఆమోదించిన మరిన్ని అంశాలు

  • 201 బస్‌ షెల్టర్లను పునర్నిర్మించేందుకు నాలుగు ప్యాకేజీల కింద టెండర్లు పిలవాలి. కమిటీ సూచనల మేరకు టెండర్‌ నిబంధనలు రూపొందించాలి. 
  • 221 జంక్షన్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నిర్వహణ కాంట్రాక్ట్‌ను పొడిగించాలి. కొత్తగా 155 జంక్షన్లలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి. 
  • ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద సేకరించిన దేవాలయ ఆస్తులతో దుకాణాలు కోల్పోయిన వారికి వనస్థలిపురంలో కొత్తగా నిర్మించిన మోడల్‌ మార్కెట్‌లో షాపులు కేటాయించాలి. 
  • జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ 040 - 2111 1111 సేవలను మరో మూడేళ్లు పొడిగించాలి. 
  • ఇందిరాపార్కు నుంచి వీఎ్‌సటీ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు 33 కేవీ విద్యుత్‌ లైన్‌ను మార్చాలి. 
  • హస్తినాపురం గాయత్రినగర్‌లో రూ. 5.25 కోట్లతో ఆర్‌సీసీ బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణం. 

Updated Date - 2020-06-05T09:52:53+05:30 IST