రెండో రోజూ.. అవే పాట్లు

ABN , First Publish Date - 2022-08-18T06:45:12+05:30 IST

బుధవారం కూడా ముఖ హాజరు యాప్‌ మొరా యించడంతో ఉపాధ్యాయుల పాట్లు వర్ణనాతీతం.

రెండో రోజూ.. అవే పాట్లు
కైకలూరులో యాప్‌ పనిచేయడం లేదని చూపుతున్న ఉపాధ్యాయులు

యాప్‌తో ఉపాధ్యాయుల కుస్తీ

నమోదులో జాప్యంతో ఆందోళన

ముఖ హాజరు విధానం వద్దని వినతులు


ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన   హాజరు విధానం  ఉపాధ్యాయులకు  శాపంగా మారింది.   నెట్‌వర్క్‌ సమస్యతో హాజరు నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వందల సంఖ్యలో విధులకు హాజరైన ఉపాధ్యాయులకు కేవలం పదుల సంఖ్యలోనే హాజరు నమోదవుతోంది. ప్రభుత్వమే పాఠశాలలకు డివైజ్‌లు అందజేస్తే ముఖ హాజరు వేస్తామని, పైగా ఈ ఇంటిగ్రేటెడ్‌ యాప్‌తో తమ వ్యక్తిగత సమాచారానికి గోప్యత ఉండదని ఉపాధ్యాయులు అంటున్నారు.  


కైకలూరు, ఆగస్టు 17: బుధవారం కూడా ముఖ హాజరు యాప్‌ మొరా యించడంతో ఉపాధ్యాయుల పాట్లు వర్ణనాతీతం. నెట్‌వర్క్‌ సమస్య,   పదేపదే అప్‌డేట్‌ అడగటం, సర్వర్‌ పనిచేయకపోవడం వంటి సమస్యలతో తీవ్ర అవస్థలకు గురయ్యారు.  ఈ విధానంలో  వ్యక్తిగత సమాచారం దొంగి లించే అవకాశం ఉంటుందని, యాప్‌ ఓపెన్‌ చేసిన వెంటనే ఫోన్‌ కాంటాక్ట్స్‌, పర్మిషన్‌ అడుగుతుందని, లొకేషన్‌ తీసుకోకపోవడం తదితర సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. ఉదయం 7.30 గంటలకే ఉపాధ్యాయుడు హాజ రు వేసేందుకు కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్ళగా ఈ యాప్‌ ఓపెన్‌ కాలేదు. మొత్తం పాఠశాలలో 25 మంది ఉపాధ్యాయులు ఉండగా ఇద్దరి హాజరే తీసుకోవడంతో వారు అయోమయానికి గురయ్యారు. కొల్లేరు గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లో 21 మంది  ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వీరిలో 9 మంది హాజరే నమోదైంది. యాప్‌ లో సమస్యలు ఉండడం వల్ల ప్రభుత్వమే కొత్తడైవర్స్‌, నెట్‌వర్క్‌ను అంద జేయాలన్నారు. అనేక మంది ఉపాధ్యాయులు టచ్‌ ఫోన్‌లు ఉపయో గించడం లేదని, అందువల్ల ప్రతి పాఠశాలకు ప్రభుత్వమే ఒకఫోన్‌ను అందిం చాలని కోరుతున్నారు. గతంలో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు పరిశీలించే ప్రభుత్వం నూతన విధానంతో ఆందోళనకు గురి చేస్తోందని,  పాతవిధానాన్ని కొన సాగించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.

చాట్రాయి:  బుధవారం జడ్పీ హైస్కూల్స్‌ ఉపాధ్యాయులు మాత్రమే ముఖ హాజరు వేయటానికి ప్రయత్నించారు కానీ యాప్‌ పనిచేయలేదు. మండలంలో 190 మంది ఉపాధ్యాయులు ఉండగా  10 మంది లోపే ముఖ హాజరు వేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎక్కువ శాతం మంది బుధవారం ముఖ హాజరును పట్టించుకోలేదు.  పాఠశాలకు డివైజ్‌లు ఇచ్చి వైఫై సౌకర్యం కల్పించే వరకు ముఖ హాజరు వేయబోమని మండలంలో పోలవరం జడ్పీ హైస్కూల్‌  ఉపాధ్యాయురాళ్లు  హెచ్‌ఎం  మాధవరెడ్డికి బుధ వారం లేఖ అందజేశారు.  యూటీఎఫ్‌ జిల్లా కౌన్సిలర్‌ నీలిమ,  ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి,  ఉపాధ్యాయురాలు మెరీనా రాణి లేఖ అందజేశారు.


ఆ యాప్‌ను సొంత ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేయం

ఆగిరిపల్లి: ముఖ ఆధారిత అటెండెన్స్‌ యాప్‌ను తమ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసే ప్రసక్తే లేదని మండల ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రభుత్వమే డేటాతో కూడిన ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో  పిలుపు మేర కు ఎస్టీయూ, యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎంఈవో పి.రత్నకుమార్‌కు మెమొరాండం అందజేశారు. యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన క్యాదర్శులు జ్ఞాన సుందరం, జోగిరాజు, ఎస్టీయు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వేణుగోపాలరావు, ఎ.వెంకటేశ్వరరావు, కృష్ణ, వంశీ, వినయ్‌, అనూ రాధ తదితరులు పాల్గొన్నారు.


 యూనియన్‌ నేతల అభ్యంతరం..

ముదినేపల్లి: పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం తదితర వివరాలను అప్‌లోడ్‌ చేసేందుకు విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ అశక్తతను వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, పీఆర్‌టీ యూ నాయకులు ఎంఈవో నరేష్‌ కుమార్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ప్రత్యామ్నాయ విఽధానం ఏర్పాటు చేస్తేనే హాజరు నమోదు చేయగలమని యూనియన్‌ల నాయకులు బేతాళ రాజేంద్ర ప్రసాద్‌, గొట్టిపాటి రమేష్‌, పి.రాము, పి.కుమార స్వామి, ఆగొల్లు హరికృష్ణ, బి.జాన్సన్‌ బాబు, వి.హరిబాబు, జి.రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  


డివైజ్‌ ఇచ్చే వరకు హాజరు నమోదు చేయం..

ముసునూరు: ప్రభుత్వం డివైజ్‌ ఇచ్చేవరకు హాజరు నమోదు చేయ లేమని ఎమ్మార్సీ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ రమాదేవికి ఉపాధ్యా యులు వినతి పత్రాలు అందజేశారు. ఏలూరు జిల్లా యూటీఏఫ్‌ సహాయ అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, భోజన  పథకం వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు విద్యాశాఖ ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ను సొంత ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న  ఉత్తర్వులను  తక్షణమే నిలివేయాలని  డిమాండ్‌ చేశారు. ముఖ ఆధారిత హాజరు కోసం ప్రభుత్వం రూపొందించిన సమగ్ర యాప్‌ నిర్వహణకు డేటాతో కూడిన ట్యాబ్‌లను ఇవ్వాలని కోరారు. రెండో రోజు ఫ్యాప్టో పిలుపు మేరకు మండల వ్యాప్తంగా ఉన్న 265 మంది ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హాజరును బహిష్కరించారు. ఎంయస్‌ఆర్‌ శర్మ, జి. పుల్లయ్య, కె. బాబురావు, ఎస్‌వీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:45:12+05:30 IST