క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2021-10-27T04:57:04+05:30 IST

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయశాఖ అధికారులు, విత్తన దుకాణదారులతో సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చేసిన వాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సాగు చేస్తే బాధ్యుడు రైతేనని కలెక్టర్‌ చెప్పడంపై విపక్షాలు మండిపడ్డాయి. వరి విత్తనాలు విక్రయిస్తే విత్తన దుకాణాలను మూసివేయిస్తామని, కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఆ దుకాణం ఎప్పటికీ తెరుచుకోదని, సుప్రీం కోర్టు, హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నా తెరవనివ్వనని వెంకట్రామారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

క్షమాపణ చెప్పాలి

కలెక్టర్‌ అనుచిత వ్యాఖ్యలపై విపక్షాల మండిపాటు

రైతులను కించపరిచేలా మాట్లాడడం సరికాదు

విత్తన దుకాణదారులను బెదిరించడంపై ఆగ్రహం


యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై  వ్యవసాయశాఖ అధికారులు, విత్తన దుకాణదారులతో సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చేసిన వాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సాగు చేస్తే బాధ్యుడు రైతేనని కలెక్టర్‌ చెప్పడంపై  విపక్షాలు మండిపడ్డాయి. వరి విత్తనాలు విక్రయిస్తే విత్తన దుకాణాలను మూసివేయిస్తామని, కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఆ దుకాణం ఎప్పటికీ తెరుచుకోదని, సుప్రీం కోర్టు, హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నా తెరవనివ్వనని వెంకట్రామారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


కలెక్టర్‌ మాటలు తగ్గించుకోవాలి

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

సిద్దిపేట అర్బన్‌, అక్టోబరు 26 : ‘సుప్రీంకోర్టు చెప్పినా వినను.. నేను చెప్పిందే వినాలి’ అనే కలెక్టర్‌ మాటలు దేనికి సంకేతమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మాటలు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. మంగళవారం సిద్దిపేట సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్టే ఆర్డర్‌ ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తున్న విషయం కలెక్టర్‌ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. విత్తన డీలర్ల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల పట్ల కేసీఆర్‌ వైకరి శృతిమించేలా ఉందన్నారు. వరి పంట వేయొద్దు అనడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మొదట్లో నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్‌ తర్వాత మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నాడని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి శంకర్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మన్నెకుమార్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, మల్లేశం, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే 

సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి 

కలెక్టర్‌ రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి విత్తనాలు అమ్మొద్దని, అమ్మితే షాపులు సీజ్‌ చేస్తామని కలెక్టర్‌ వ్యాఖ్యలు చేయడం సరైనవి కావని మండిపడ్డారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అలా మాట్లాడటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వరి వేస్తే ఉరి అని ప్రచారం చేయడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకొని టీఆర్‌ఎస్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. కలెక్టర్‌ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


కలెక్టర్‌ను బర్తరఫ్‌ చేయాలి

కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు దరిపల్లి చంద్రం

సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 26 : వరి విత్తనాలు అమ్మితే ఊరుకునే ప్రసక్తి లేదని డీలర్లను బెదిరింపులకు పాల్పడుతూ నియంతలా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు దరిపల్లి చంద్రం, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు ఏ పంటలు వేసుకోవాలో వారికి బాగా తెలుసని రైతులకు మంచి జరిగే ఆలోచన మాత్రమే చేయాలని హితవు పలికారు. కలెక్టర్‌ తన బాధ్యత మరచి, డీలర్లను చెండాడుతా, వెంటాడుతా లాంటి పదాలు వాడడం సరైనది కాదన్నారు. డీలర్లను వరి విత్తనాలు విక్రయించొద్దని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి రైతులకు, డీలర్లకు, న్యాయస్థానానికి బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్‌ అతీక్‌, గ్యాదరి మధు, మాజర్‌ మాలిక్‌, భిక్షపతి, అనిల్‌రెడ్డి, ఫయ్యాజ్‌, గాయసుద్దీన్‌, ఆయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.


వరి వేయొద్దంటే ఎట్లా ?

కిసాన్‌ సెల్‌ తొగుట మండలాధ్యక్షుడు శ్రీనాకర్‌రెడ్డి

తొగుట, అక్టోబరు 26 : ప్రాజెక్టులు కట్టింది కమీషన్ల కోసమా... లేక రైతుల కోసమా..? రైతులు వరి వేయొద్దంటే ఎట్లా ? అని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ మండలాధ్యక్షుడు శ్రీనాకర్‌రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తొగుటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట కలెక్టర్‌ మాటలు రైతుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు చెప్పినా పట్టించుకోను అని రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడటం మంచి సంస్కృతి కాదన్నారు. కలెక్టర్‌ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చే యాసంగికి వరి విత్తనాలు అందుబాటులో వుంచాలని కోరారు. 


వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

కిసాన్‌ మోర్చా నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌, అక్టోబరు 26 : రైతులు, సీడ్స్‌ వ్యాపారులపై కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు కవ్వ వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ పొలాలు జాలుగా మారాయని, ఇలాంటి భూముల్లో వరి కాకుండా వేరే పంట వేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. వరి వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలనడం సరికాదన్నారు. అలాగే కరీంనగర్‌ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ సిద్దిపేట జిల్లాలో ఇప్పటికీ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు.


ఇవేం మాటలు?

ఉపసర్పంచ్‌ అమర్‌ 

మిరుదొడ్డి, అక్టోబరు 26 : రైతులను కించపరిచేలా ఇవేం మాటలని కొండాపూర్‌ గ్రామ  ఉపసర్పంచు అమర్‌ ప్రశ్నించారు. మంగళవారం గ్రామంలో ఆయన మాట్లాడారు. అధికారపార్టీకి అనుకూలంగా కలెక్టర్‌ మాట్లాడడం సరికాదన్నారు. కలెక్టర్‌ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యాసంగిలో రైతులు వేసే పంటలకు సహకరించాలని కోరారు. 

Updated Date - 2021-10-27T04:57:04+05:30 IST