Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డిపై వేటు

నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనివాసరావు, సతీష్‌కుమార్‌

గుంటూరు, డిసెంబరు 5: ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా కమిటీలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు టీవీ రామిరెడ్డిని కమిటీ నుంచి తొలగించారు. ఆయన గత జులైలో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా ప్రస్తుతం ఎన్జీవో అసోసియేషన్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో రామిరెడ్డి అసోసియేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం లేదని రాష్ట్ర కమిటీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆదివారం గుంటూరులోని ఎన్జీవో కల్యాణ మండపంలో జిల్లా కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో రామిరెడ్డిపై వచ్చిన అభియోగాలపై చర్చించి ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు జిల్లా కార్యదర్శిగా ఉన్న ఘంటసాల శ్రీనివాసరావును అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా శెట్టిపల్లి సతీష్‌కుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ సహాయ మహిళా కార్యదర్శిగా శివజ్యోతి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు రాష్ట్ర కమిటీ నుంచి కె.జగదీశ్వరరావు, రంజిత్‌నాయుడు పరిశీలకులుగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలను ఈనెల 7 నుంచి జిల్లాలో విజయవంతం చేస్తామన్నారు.  

ఆందోళనకు ఉద్యోగులు సిద్ధం

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా  ఉన్న సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జేఏసీ పిలుపుమేరకు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం గుంటూరు ఎన్జీవో హోంలో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల తరువాత ఉద్యోగులు నేరుగా ఆందోళనకు దిగడం ఇదే మొదటిసారి. పీఆర్‌సీ, డీఏ బకాయిలు ఇతర సమస్యలపై ప్రభుత్వం సక్రమంగా స్పందించటం లేదని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 7నుంచి మూడురోజులపాటు ఉద్యోగులు నల్లబాడ్జీలతో విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వివిధ జిల్లాలో ఆందోళనలను విజయవంతం చేయడంపై చర్చించారు. జేఏసీ నేతలు ఎన్జీవో హోంలో జిల్లా ఆఫీస్‌ బేరర్లతో సమీక్షించారు. జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కార్యదర్శి సతీష్‌, రాంబాబు, మాగంటి నరసి ంహమూర్తి, ఎన్‌.శ్రీనివాసరావు, జానీబాషా తదితరులు ఆందోళన కార్యక్రమాలను వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  ఉద్యోగులకు అసోసియేషన్‌ నేతలు కరపత్రాలు పంపిణీ చేయాలని నే తలు తెలిపారు. ఆందోళనలో అందరూ పాల్గొనేటట్లు చేయాలని నేతలు సూచించారు.

Advertisement
Advertisement