కరెంటు లేక.. కుతకుత!

ABN , First Publish Date - 2022-05-02T08:15:24+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ వాడకంపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) విధించిన నియంత్రణలు గత శనివారంతో ముగిశాయి.

కరెంటు లేక.. కుతకుత!

కొనసాగుతోన్న సంక్షోభం.. తెప్పరిల్లని రాష్ట్రం

235-240 మి.యూనిట్ల డిమాండ్‌

సరఫరా 180 మి.యూనిట్లు మాత్రమే 

పరిశ్రమలకు ఈ నెలలోనూ పవర్‌ హాలిడే!

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ వాడకంపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) విధించిన నియంత్రణలు గత శనివారంతో ముగిశాయి. సంక్షోభం ఇంకా కొనసాగుతున్నందున విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)ల వినతి మేరకు మరికొంతకాలం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్‌ రోజువారీ డిమాండ్‌ 235-240 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటుండగా.. అందులో 180 మి.యూ. మాత్రమే అందుబాటులో ఉంటోంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార కేంద్రాలు సగం విద్యుత్‌ మాత్రమే వాడాలంటూ ప్రతి శనివారం పవర్‌ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిమితికి మించి వాడితే ఎడాపెడా జరిమానాలు వసూలు చేస్తున్నారు.


దీంతో పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. వాటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార కేంద్రాల్లో ఎయిర్‌ కండిషన్ల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని డిస్కమ్‌లు ఆదేశించాయి. గృహ విద్యుత్‌ వినియోగంపైనా నియంత్రణలు విధించాయి. ఏసీలు, గీజర్ల వాడకం తగ్గించాలని పేర్కొన్నాయి. ఇక వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ సరఫరా ఎప్పుడో అటకెక్కింది. ఏడు గంటలివ్వాలని ఇంధనశాఖ పైకి సూచిస్తున్నా.. డిస్కమ్‌లు పట్టుమని రెండు గంటలు కూడా ఇవ్వడం లేదు. డిమాండ్‌ను తట్టుకునేందుకు.. గ్రిడ్‌ దెబ్బతినకుండా కాపాడేందుకంటూ కోతలు పెంచుతున్నామని చెబుతున్నాయి. పల్లెల్లో ఇళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. తాజాగా వీధి దీపాలనూ ఆర్పేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సిబ్బందికి అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు జారీచేశాయి. విజయవాడలో ఉదయం మినహా.. మిగిలిన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్‌ పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో అనధికారిక విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. వేసవి తీవ్రతతో గృహ విద్యుత్‌ వినియోగమూ భారీగా పెరిగింది. వ్యవసాయ విద్యుత్‌కు మరో 15 రోజుల దాకా డిమాండ్‌ తగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో.. పరిశ్రమలకు, ఇళ్లకు కరెంటు కోతలు కొనసాగించడం తప్పదని ఇంధన శాఖ వర్గాలు చెబుతున్నాయి.


కొనుగోళ్లపై రహస్యం..

రాష్ట్రప్రభుత్వం ఎంత విద్యుత్‌ ఎంతకు కొనుగోలు చేస్తోందో.. ఎక్కడి నుంచి తెస్తోందో అంతా రహస్యమే.  పైగా డిస్కమ్‌లు కాకుండా వాటి తరఫున ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఏపీసీసీసీ) కొనుగోలు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలుకు ఏరోజుకారోజు ఆంధ్రప్రదేశ్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎ్‌సఎల్‌డీసీ)తో సమన్వయం చేసుకుంటోంది. అయితే డిస్కమ్‌ల తరఫున ఏపీసీసీసీ కొనుగోలు చేయడంపై ఏపీఈఆర్‌సీ ఇటీవల మండిపడిందని ఇంధనశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే విద్యుత్‌ కొనుగోలు సమాచారాన్ని గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించింది. ఇంకోవైపు.. విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని డిస్కమ్‌లు చెబుతున్నాయి. ఇటీవల పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో యూనిట్‌ రూ.20 వరకూ కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో యూనిట్‌ను రూ.6.50కి కొన్నందుకే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏకంగా రూ.20 చెల్లించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పైగా ఈ భారీ మొత్తాన్ని వినియోగదారుల నుంచి ట్రూఅప్‌ చార్జీల పేరుతో పిండేయాలనుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దరిమిలా.. బహిరంగ మార్కెట్లో యూనిట్‌ రూ.12కి మించి కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్లో సగటున యూనిట్‌కు రూ.11.54 చొప్పున రూ.40.23 కోట్లు చెల్లించి 34.86 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేశాయి. 


విద్యుత్‌ సంక్షోభం తీవ్ర రూపం దాల్చడంతో థర్మల్‌ విద్యుదుత్పత్తిపై ఇంధనశాఖ ఒక్కసారిగా దృష్టిసారించింది. ఏప్రిల్లో థర్మల్‌ విద్యుత్‌ 81.41 శాతం ప్లాంట్‌ లోడ్‌ రిలీ్‌ఫతో 1,865.82 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. విజయవాడ థర్మల్‌ యూనిట్‌లో 36 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. రాయలసీమ థర్మల్‌ స్టేషన్‌లో 27.51 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. ఏపీ జెన్కో గరిష్ఠ సామర్థ్యం 5,589 మెగావాట్లు కాగా.. 73 మిలియన్‌ యూనిట్లు.. నెల్లూరు ఎస్పీడీసీఎల్‌లో 1,600 మెగావాట్లకు గాను 47 శాతం మేర అంటే 21.44 మిలియన్‌ యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి అవుతోంది. ఇంకోవైపు ఈ థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయి. పట్టుమని రెండ్రోజులకు సరిపడా కూడా లేదు. వీటీపీఎ్‌సలో రోజుకు 28,500 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా.. 36,498 మెట్రిక్‌ టన్నులు, ఆర్‌టీపీపీలో రోజుకు 21,000 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా.. కేవలం 25733 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. కృష్ణపట్నంలో మాత్రం రోజుకు 19,000 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరమైతే.. 1,42,903 టన్నుల నిల్వ ఉంది. హిందూజాలో 9,600 మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా.. 18,544 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఈ నేపథ్యంలో బొగ్గు కొనుగోళ్లకు ఏపీ జెన్కో సిద్ధమైంది. థర్మల్‌ విద్కుత్కేంద్రాల్లో కచ్చితంగా 10 శాతం విదేశీ బొగ్గు వాడాలని కేంద్రం ఆదేశించడంతో.. 31 లక్షల మెట్రిక్‌ టన్నుల విదేశీ బొగ్గు కోసం జెన్‌కో టెండర్లు పిలిచింది. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రం కోసం 18లక్షలు.. జెన్కో ప్లాంట్ల కోసం 13లక్షల మెట్రిక్‌ టన్నుల కోసం  పి లిచిన ఈ టెండర్లకు స్పందన కోసం ఎదురు చూస్తోంది.

Updated Date - 2022-05-02T08:15:24+05:30 IST