Abn logo
Sep 26 2021 @ 00:00AM

కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ విజయభేరి

విజయం సాధించిన కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ సభ్యులు

గుంటూరు, సెప్టెంబరు 26: ఆంధ్రప్రదేశ్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఎన్‌జీవో అసోసియేషన్‌ నరసరావుపేట డివిజన్‌ గుర్తింపుఎన్నికల్లో ఎం. కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ విజయభేరి మోగించింది. జిన్నాటవర్‌ సెంటర్‌లోని వసుంధర భవన్‌లో ఆదివారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2గంటల వరకు జరిగాయి. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో కిషోర్‌కుమార్‌ అధ్యక్షుడిగాను, ఆయన ప్యానల్లో 12 మంది సభ్యులూ విజయం సాధించారు. డివిజన్‌లో 8 సర్కిల్స్‌లో 159మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోగా 41ఓట్ల ఆధిక్యతతో కిషోర్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డివిజన్‌లో జె.గోపినాధ్‌, చాముండేశ్వరరావులు ఒకప్యానల్‌ కాగా కిషోర్‌కుమార్‌, సోమశేఖర్‌ మరో ప్యానల్‌గా ఏర్పడి బరిలో నిలిచారు. గోపినాధ్‌, కిషోర్‌కుమార్‌లతో పాటు స్వతంత్ర అభ్యర్ధిగా ఎండీ మాలిక్‌జానీబాషా కూడా బరిలో దిగారు. ముఖ్యంగా గోపినాధ్‌, కిషోర్‌కుమార్‌ ప్యానల్స్‌ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ సభ్యులంతా గెలుపొందటం విశేషం. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన విజయవాడ -2 డివిజన్‌ ఏపీసీటీఎన్‌జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు గుర్తింపు పత్రాలను విజేతలకు అందజేశారు. ఈ మేరకు కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ సభ్యులకు సహచర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.