కోర్టులపై అభాండాలు వేయడం దురదృష్టకరం: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T21:49:03+05:30 IST

జగన్ సర్కార్‌పై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది వైసీపీ నాయకుల వైఖరి

కోర్టులపై అభాండాలు వేయడం దురదృష్టకరం: తులసిరెడ్డి

విజయవాడ: జగన్ సర్కార్‌పై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది వైసీపీ నాయకుల వైఖరి. పరిపాలన చేతకాక వైసీపీ నేతలు న్యాయస్థానాలపై అభాండాలు వేయడం దురదృష్టకరం. సర్కార్ జారీ చేసిన జీవోలు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుతున్నాయి. ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌లు, చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా కోర్టులు ఆ జీవోలు, చట్టాలు, ఆర్డినెన్స్‌లను కొట్టివేస్తున్నాయి. వీటి పట్ల కోర్టులు న్యాయ, చట్టపరంగా తప్పుబట్టడం సహజం. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టం ముందు అందరూ ఒక్కటే. కోర్టు తీర్పులు తమకు వ్యతిరేకంగా వస్తే పైకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించింది. తమకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులొచ్చాయనుకుని కోర్టులపై అభాండాలు వేయడం సబబుకాదు. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితను కూడా కోర్టులు శిక్షించాయి. కానీ వారు కోర్టులపై అభాండాలు వేయలేదు. 1962లో ఆనాటి సీఎం నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా కోర్టు వ్యాఖ్యానించగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారే తప్ప కోర్టులను తప్పుబట్టలేదు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్, అవినీతి కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం హర్షణీయం’ అని తులసిరెడ్డి స్వాగతించారు.

Updated Date - 2020-09-18T21:49:03+05:30 IST