అమలాపురం బయలుదేరిన Congress leaders... అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-01T17:18:49+05:30 IST

ఛలో అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్(Congress) నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

అమలాపురం బయలుదేరిన Congress leaders... అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: ఛలో అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్(Congress) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం చలో అమలాపురం కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రామవరప్పాడు రింగ్‌లో జగజ్జీవన్ రాం విగ్రహానికి ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్(Sailajanath), ఇతర నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం  అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.


ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ... అంబేద్కర్ పేరును కోనసీమకు పెడితే నేరం అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నెల తరువాత నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని విమర్శించారు. అంత మంది రోడ్ల మీదకు వచ్చే వరకు పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల కుట్రతోనే విధ్వంసం జరిగిందని ఆరోపించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో ఒరగ బెట్టిందేమిటని నిలదీశారు. అక్కడ దాడులు చేసి ఇక్కడ యాత్రలు చేస్తారా అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్, యన్టీఆర్‌ పేర్లకు లేని అభ్యంతరం అంబేద్కర్ కే ఎందుకని ఏపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.


అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు ఆపడం అన్యాయమన్నారు. ‘‘మనం దేశ సరి హద్దులో ఉన్నామా... ఏపీలో ఉన్నామా’’ అంటూ దుయ్యబట్టారు. అమలాపురం వెళ్లేందుకు తమకు ఆటంకాలు కలిగిస్తున్నారని, పోలీసులు ను అడ్డం పెట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. తాము అమలాపురం వెళితే ప్రభుత్వానికే మేలు జరుగుతుందని తెలిపారు. అక్కడ సోదరులతో మాట్లాడి శాంతి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ‘‘మమ్మలను ఆపితే... మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ఆర్.యస్.యస్ భావజాలంతో ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. తమను అమలాపురం వెళ్లనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఇప్పుడు ఆపారు... మరోసారి తప్పకుండా వెళ్లి తీరుతాం’’ అని శైలజానాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-01T17:18:49+05:30 IST