అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో అపశ్రుతి

ABN , First Publish Date - 2021-10-21T05:37:20+05:30 IST

అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణానికి సంబంధించిన మట్టిని తొలగిస్తుండగా పక్కనున్న మట్టి పెళ్లలు కిందపడి వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో అపశ్రుతి
నాగరాజు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు

గోడ కూలి వ్యక్తి మృతి.. మరో ఇద్దరికి గాయాలు


మార్కాపురం, అక్టోబరు 20 : అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణానికి సంబంధించిన మట్టిని తొలగిస్తుండగా పక్కనున్న మట్టి పెళ్లలు కిందపడి వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మార్కాపురం పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్‌ఐ వై.నాగరాజు కథనం మేరకు... స్థానిక జవహర్‌నగర్‌ కాలనీలో పట్టణానికి చెందిన పలువురు వ్యక్తులు అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టారు. అందుకు సంబంధించిన పనులలో మండలంలోని పెద్దనాగులవరానికి చెందిన కూలీలు పనిచేస్తున్నారు. మట్టి తొలగింపు పనులను ఎక్స్‌కవేటర్‌తో చేస్తుండగా పక్కనే ఉన్న మట్టి పెళ్లలు  విరిగి కిందపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న ఓర్సు నాగరాజు(28) మట్టి కింద పూడుకుపోయాడు. మరో ఇద్దరు కూలీలు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తోటి కూలీలు, మట్టిని తొలగించి నాగరాజు మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ బీటీ నాయక్‌ సందర్శించారు. నాగరాజుకు ఇద్దరు కుమారులు, 2 నెలల కుమార్తె ఉంది. సంఘటనా స్థలం బంధువులు ఆర్తనాదాలతో మారుమోగింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు. 


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

కొనకనమిట్ల, అక్టోబరు 20 : మోటర్‌ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొని పొట్లూరి రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి కొనకనమిట్ల సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల పంచాయతీలోని పూట్లూరివారిపల్లెకి చెందిన పుట్లూరి రామిరెడ్డి(55) ఆరోగ్యం బాగలేకపోవడంతో కొనకనమిట్లకు వెళ్లి వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. అనంతరం స్వగ్రామం వెళ్తుండగా చింతగుంట అడ్డరోడ్డు మలుపు తిరుగుతుండగా మార్కాపురం నుంచి పొదిలి వస్తున్న ఆర్టీసీ బస్సు  ఢీకొనడంతో అదుపు తప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి దీంతో రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రామిరెడ్డికి భార్య రత్తమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ ఎం.శివ సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను, ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2021-10-21T05:37:20+05:30 IST