కాక రేపిన అన్నమయ్య జిల్లా కేంద్రం

ABN , First Publish Date - 2022-01-27T05:45:30+05:30 IST

ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. సీఎం జగన బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన హామీ. సీఎం జగన ప్రకటనతో రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు అవుతుందని, అన్నమయ్య రాజంపేట జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. వారి డిమాండ్‌ మేరకు అన్నమయ్య జిల్లా చేశారు. అయితే.. రాయచోటి జిల్లా కేంద్రంగా నోటిఫికేషన విడుదల చేశారు.

కాక రేపిన అన్నమయ్య జిల్లా కేంద్రం
రాయచోటి ఏరియల్‌ వ్యూ

రాజంపేట, రైల్వేకోడూరులలో తీవ్ర వ్యతిరేకత

జిల్లా సాధన కోసం ఉద్యమాలకు సన్నద్ధం

రాజంపేట జిల్లా చేయకపోతే రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదు

వైరల్‌ అవుతున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన వీడియో

రాయచోటికి కలిసొచ్చిన అదృష్టం 

జిల్లా ప్రకటనతో రాయచోటిలో రియల్‌ భూం

రహస్యంగా చక్రం తిప్పిన చీఫ్‌ విప్‌ శ్రీకాంతరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి 

కొత్త జిల్లాపై నోరు మెదపని ఎమ్మెల్యే మేడా, జడ్పీ చైర్మన ఆకేపాటి 

(కడప-ఆంధ్రజ్యోతి): ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం. సీఎం జగన బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన హామీ. సీఎం జగన ప్రకటనతో రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు అవుతుందని, అన్నమయ్య రాజంపేట జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. వారి డిమాండ్‌ మేరకు అన్నమయ్య జిల్లా చేశారు. అయితే.. రాయచోటి జిల్లా కేంద్రంగా నోటిఫికేషన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల ప్రజలు, రాజకీయ నాయకుల్లో ఆగ్రహజ్వాలను రాజేసింది. అదే క్రమంలో రాయచోటి ప్రాంత వాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ ప్రకటనతో రియల్‌ భూం పెరిగింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంతరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరవెనుక రాజకీయాల ఫలితమే రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.


రాజంపేటకు ఏం తక్కువ..?

రాజంపేటను జిల్లా కేంద్రం చేయడానికి అవసరమైన అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆధ్మాత్మిక, చారిత్రాత్మకంగా ఎనలేని గుర్తింపు ఉంది. సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. బ్రిటీష్‌ పాలకులు పాలన సాగించిన జిల్లా కేంద్రం సిద్దవటం, ఒంటిమిట్ట కోదండరామాలయం, తన కీర్తనలు, రచనలతో తిరుమల వెంకటేశ్వరుడి కీర్తిని చాటి చెప్పిన తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్యులు జన్మించిన తాళ్లపాక రాజంపేట నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వరస్వామి క్షేత్రం ఇక్కడికి సమీపంలోనే ఉంది. రాజంపేటను కాదని రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం ప్రకటించడం ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజంపేట జిల్లా సాధన పోరుకు సై అంటున్నారు. అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిలు ప్రభుత్వ నిర్ణయంపై నోరుమెదపడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు వారు మౌనం దాల్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. రాజంపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన మర్రి రవికుమార్‌ జగన సర్కారు నిర్ణయంపైన నిప్పులు చెరిగారు. అన్నమయ్య పుట్టిన రాజంపేటను కాదని.. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఎలా పెడతారు? సీఎం జగనకు ఎవరు సలహాలు ఇస్తున్నారు..? ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి తధ్యం..! అంటూ ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. 


రాయచోటికి కలిసొచ్చిన అదృష్టం

రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన ఇవ్వడం రాయచోటికి కలిసొచ్చిన అదృష్టమే అని చెప్పవచ్చు. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కడప జిల్లాకు చెందిన రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాజాగా.. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, తంబళపల్లె అసెంబ్లీ నియోకవర్గాలను కలుపుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన జారీ చేసింది. జిల్లా కేంద్రంగా రాజంపేట చేస్తే.. జిల్లా కేంద్రానికి మదనపల్లె, పుంగనూరు ప్రాంతవాసులు వెళ్లాలంటే 130-170 కి.మీలు అవుతుంది. దీంతో మదనపల్లె కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు మదనపల్లె జిల్లా సాధన సమితి పేరుతో ఆందోళనలు చేపట్టారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తే రాజంపేట, కోడూరు నియోజకవర్గాల వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అంతే దూరం అవుతుంది. ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఉన్న రాయచోటి జిల్లా కేంద్రంగా చేస్తే రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలకు 55-85 కి.మీలు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ప్రాంతాలకు 50-75 కి.మీలు ఉంటుంది. ఇదే రాయచోటికి కలిసొచ్చిన అదృష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం, సీఎం జగనకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రభుత్వ చీఫ్‌ విప్‌, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు తెరవెనుక రాజకీయ ప్రయత్నాలు కూడా కలిసొచ్చాయని అంటున్నారు. 


30 రోజుల్లో అభ్యంతరాల స్వీకరణ

రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన జారీ చేసింది. ఈ నోటిఫికేషన జారీ చేసిన నాటి నుంచి 30 రోజుల వరకు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కలెక్టరు విజయరామరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపుతారు. ఆ తరువాత ప్రభుత్వం తుది నోటిఫికేషన జారీ చేస్తుంది. ఆరోజు నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. 


అన్నమయ్య జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు

డివిజన మండలాలు

రాయచోటి (కొత్తగా): 

కడప జిల్లా రాయచోటి, సంబేపల్లి, గాలివీడు, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, చిత్తూరు జిల్లా పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేవీపల్లె


మదనపల్లె: 

మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండెం, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు


రాజంపేట:

కడప జిల్లా రైల్వేకోడూరు, పెనగలూరు, చిట్వేలి, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, ఒంటిమిట్ట, సిద్దవటం, నందలూరు, వీరబల్లి, టి.సుండుపల్లి


ప్రస్తుతం కడప జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు


డివిజన మండలాలు


కడప:

కడప, చక్రాయపేట, ఎర్రగుంట్ల, వీఎనపల్లి, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వేంపల్లి

జమ్మలమడుగు:

జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం

బద్వేలు: 

మైదుకూరు, దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, బద్వేలు, కాశినాయన, కలసపాడు, గోపవరం, ఆట్లూరు, 


ఫ అన్నమయ్య (రాయచోటి) జిల్లా స్వరూపం

జిల్లా పేరు : అన్నమయ్య 

కేంద్రం : రాయచోటి

నియోజకవర్గాలు : 6 (రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)

మండలాలు : 32

జనాభా (2011) : 17.68 లక్షలు

ఏరియా విస్తీర్ణం : 8,458 స్క్వేయర్‌ కి.మీలు



Updated Date - 2022-01-27T05:45:30+05:30 IST