బీజేపీలోకి ములాయం చిన్న కోడలు..?

ABN , First Publish Date - 2022-01-16T15:44:24+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ నువ్వా-నేనా అంటూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తలబడుతున్న తరుణంలో అనూహ్య రాజకీయ పరిణామం ..

బీజేపీలోకి ములాయం చిన్న కోడలు..?

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ నువ్వా-నేనా అంటూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తలబడుతున్న తరుణంలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు (ప్రతీక్ యాదవ్ భార్య), సమాజ్‌వాదీ పార్టీ నేత అపర్ణాయాదవ్ ఆ పార్టీకి ఉద్వాసన చెప్పి ఆదివారంనాడు బీజేపీలోకి చేరనున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్ధం తీసుకోనున్నారు. 


అపర్ణా యాదవ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కొద్దికాలంగా ఆమె బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. గతంలో సైతం ఆమె పలుమార్లు నరేంద్ర మోదీ నిర్ణయాలకు బహిరంగంగానే సమర్ధించారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. అపర్ణాయాదవ్‌కు లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించనున్నట్టు తెలుస్తోంది.


కుటుంబ విభేదాలు..

ఎన్ఆర్‌సీ, రామ మందిరం సహా పలు అంశాల విషయంలో అపర్ణా యావద్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య కొద్దికాలంగా విభేదాలు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రామ మందిర నిర్మాణానికి ఆమె రూ.11 లక్షలు విరాళం కూడా ఇచ్చారు. గతంలో తన కుటుంబ సభ్యులు చేసిన దానికి తాను బాధ్యురాలిని కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇది నేరుగా ములాయం సింగ్‌పై చేసిన తిరుగుబాటుగా ప్రచారమైంది. 1990లో ములాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాబ్రీ మసీదు వద్ద కరసేవకులపై కాల్పులకు పోలీసులను ములాయం ఆదేశించడం  అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. 2017లో యూపీ ఎన్నికల్లో ఎస్‌పీ టిక్కెట్టుపై పోటీచేసిన అపర్ణా యాదవ్ బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.

Updated Date - 2022-01-16T15:44:24+05:30 IST