అఫ్ఘాన్‌లో ఆపద్ధర్మ సర్కారు

ABN , First Publish Date - 2021-09-08T07:15:34+05:30 IST

యుద్ధ కల్లోల అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది. అమెరికా సేనలు పూర్తిస్థాయిలో వైదొలగిన వారం తర్వాత తాలిబాన్లు తాత్కాలిక కేబినెట్‌ను ప్రకటించారు.

అఫ్ఘాన్‌లో ఆపద్ధర్మ సర్కారు

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అఖుంద్‌కు ప్రధాని పదవి

ఉప ప్రధానులుగా బరాదర్‌, అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌

మరో ఉగ్రవాది సిరాజ్‌ హక్కానీకి అంతర్గత భద్రత

విదేశాంగ శాఖకు ఆమీర్‌ఖాన్‌, ఒమర్‌ తనయుడికి రక్షణ శాఖ

పాకిస్థాన్‌ ముర్దాబాద్‌.. గళమెత్తిన అఫ్ఘాన్‌ మహిళలు

మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది అఖుంద్‌కు ప్రధాని పదవి.. ఉప ప్రధానులుగా బరాదర్‌, అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌


కాబూల్‌/దోహా/న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: యుద్ధ కల్లోల అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది. అమెరికా సేనలు పూర్తిస్థాయిలో వైదొలగిన వారం తర్వాత తాలిబాన్లు తాత్కాలిక కేబినెట్‌ను ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాలిబాన్ల అధికార ప్రతినిధి, సమాచార శాఖ సహాయ మంత్రిగా నియమితులైన జబియుల్లా ముజాహిద్‌ ఈ వివరాలను వెల్లడించారు. అమెరికాకు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అయిన మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ప్రధానిగా నియమితులయ్యారు. ఇంతకాలం అధ్యక్ష పదవిని అధిరోహస్తారని భావించిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఉప ప్రధానిగా, హక్కానీ నెట్‌వర్క్‌ చెందిన అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌ మరో ఉప ప్రధానిగా పనిచేస్తారు. ఇంకో 30 మందితో కేబినెట్‌ మంత్రులు/సహాయ మంత్రులు, నిఘా విభాగం, సెంట్రల్‌ బ్యాంకు చీఫ్‌ల జాబితాను విడుదల చేశారు. మరోవైపు తమ దేశ ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్థాన్‌, ఆ దేశ నిఘా సంస్థ ఐఎ్‌సఐ ప్రమేయంపై అఫ్ఘాన్‌ మహిళలు గళమెత్తారు. పాక్‌ వ్యతిరేక నినాదాలతో వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ‘‘పాకిస్థాన్‌ ముర్దాబాద్‌’’.. ‘‘ఐఎ్‌సఐ ముర్దాబాద్‌’’.. ‘‘గోబ్యాక్‌ పాకిస్థాన్‌’’.. ‘‘లీవ్‌ అఫ్ఘానిస్థాన్‌’’.. ‘‘తోలుబొమ్మ ప్రభుత్వం మాకొద్దు’’.. ‘‘మా హక్కులు మాకు కావాలి’’.. అంటూ నినాదాలిచ్చారు.


ఐఎ్‌సఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌, తాలిబాన్ల అగ్రనేత బరాదర్‌ చర్చలు జరిపారని సోమవారం అధికారిక ప్రకటన రావడంతోనే.. అఫ్ఘాన్లు సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనలను ప్రారంభించారు. మంగళవారం ఉదయం రాజధాని నగరం కాబూల్‌ సహా.. బల్ఖ్‌, దైకుండి ప్రావిన్సుల్లో, మరికొన్ని ప్రాంతాల్లోనూ మహిళలు, అఫ్ఘాన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. ‘‘మా దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ జోక్యం చేసుకోవొద్దు’’ అంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. కాబూల్‌ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. పాక్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని నిర్మొహమాటంగా తమ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో తాలిబాన్లు వారిపై విరుచుకుపడ్డారు. తొలుత ఆందోళనకారులను చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా.. నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో.. తాలిబాన్లు తమ వాహనాలు దిగి.. లాఠీచార్జ్‌ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా విరుచుకుపడ్డారు. వారిపై దాడి చేసి, అరెస్టు చేశారు. డజనుకుపైగా జర్నలిస్టులు, కెమెరామెన్‌ను అరెస్టు చేసినట్లు స్థానిక విలేకరులు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ప్రభుత్వ వార్తాసంస్థ/న్యూస్‌ చానల్‌ టోలోన్యూ్‌సకు చెందిన కెమెరామన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ విషయాన్ని టోలోన్యూస్‌ చీఫ్‌ లోత్ఫుల్లా నజాఫిజాదా ట్విటర్‌లో తెలిపారు. ‘‘నేను తాలిబాన్లతో మాట్లాడాను. మా కెమెరామన్‌ను విడుదల చేయమని కోరాను’’ అని వివరించారు.  


మసూద్‌ పిలుపుతో..

పంజ్‌షీర్‌ రెబెల్స్‌ నేత అహ్మద్‌ షా మసూద్‌ సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఓ ఆడియో రికార్డును విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఆయన ఎక్కడికక్కడ అఫ్ఘాన్లు తిరుగుబాటు చేయాలని కోరారు. తమపై పాక్‌ ఫైటర్‌ జెట్లతో తమపై దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. దీంతో అఫ్ఘాన్‌ పౌరులు రగిలిపోయారు. సోమవారం సాయంత్రం అధ్యక్ష భవనంపై అఫ్ఘాన్‌ జాతీయ పతాకాన్ని తాలిబాన్లు అవనతం చేయడంతో వారిలో కోపం కట్టలు తెంచుకుంది. మసూద్‌ పిలుపు అందగానే.. అంటే.. సోమవారం అర్ధరాత్రి నుంచే బల్ఖ్‌, దైకుండి ప్రావిన్సుల్లో మహిళలు రోడ్డెక్కారు. మంగళవారం తెల్లవారుజాముకల్లా ఆయా ప్రావిన్సుల్లోని ముఖ్య పట్టణాల్లో గుమిగూడి.. ఆందోళన నిర్వహించారు. మరికొన్ని ప్రావిన్సుల్లోనూ నిరసనలు జరిగినట్లు అఫ్ఘాన్‌ మీడియా పేర్కొంది. అయితే.. తాలిబాన్లు ఎక్కడికక్కడ నిరసనకారులను కట్టడి చేసినట్లు వివరించింది.


అమెరికా ప్రకటన వచ్చిన గంటలోనే..

ఖతార్‌లో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తాలిబాన్లు తమ డిమాండ్లకు అంగీకరించారని, దేశం వీడాలనుకునే అఫ్ఘాన్లను, అమెరికా పౌరులను అనుమతిస్తారని చెప్పారు. బ్లింకెన్‌ ప్రకటన వెలువడిన గంటలోనే విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ తాలిబాన్లు హుకుం జారీ చేశారు. తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా అఫ్ఘాన్‌ నుంచి విదేశాలకు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని ప్రకటించారు.


వార్తలను ఖండించిన చైనా

అఫ్ఘాన్‌లోని బగ్రామ్‌ ఎయిర్‌బే్‌సపై చైనా కన్నేసిందని, తాలిబాన్లూ ఆ ప్రాంతాన్ని చైనాకు కట్టబెట్టడానికి అంగీకరించారని వార్తలువచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనాలను చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెంబిన్‌ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలేనంటూ ప్రకటన విడుదల చేశారు. కాగా, తాలిబాన్లపై పోరాడేందుకు అఫ్ఘాన్‌ సేనల వద్ద 2 ఏళ్ల దాకా పోరాడేలా ఆయుధ సంపత్తి, వనరులు ఉన్నా.. కేవలం మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ అనాలోచిత చర్యల వల్లే అఫ్ఘాన్‌ను కోల్పోయామని మాజీ సైనికులు చెబుతున్నారు.

పాక్‌కు లబ్ధి.. భారత్‌కు నష్టం: ఒవైసీ

అఫ్ఘానిస్థాన్‌లో పరిణామాలు పాక్‌కు కచ్చితంగా లబ్ధి కలిగించేవేనని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మంగళవారం ఆయన యూపీలో విలేకరులతో మాట్లాడుతూ అఫ్ఘాన్‌లో భారత్‌ సుమారు రూ.35 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా.. అఫ్ఘానిస్థాన్‌తాలిబాన్ల వశమైనప్పటి నుంచి కాబూల్‌ నుంచి 53 మంది అఫ్ఘాన్‌ పౌరులు, 25 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే. వారంతా 14 రోజుల పాటు ఐటీబీపీ క్యాంప్‌సలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నారు. మంగళవారం క్వారంటైన్‌ గడువు పూర్తవ్వడంతో బయటకు వచ్చారు.



 

Updated Date - 2021-09-08T07:15:34+05:30 IST