AP: ఉద్యోగ నేతలు ఉక్కిరిబిక్కిరి!

ABN , First Publish Date - 2021-10-10T14:06:45+05:30 IST

తమ సమస్యలపై..

AP: ఉద్యోగ నేతలు ఉక్కిరిబిక్కిరి!

సమస్యలపై పోరాటానికి ఉద్యోగులు సిద్ధం

ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేస్తారన్న 

ఆందోళనలో సంఘాల నాయకులు 

అనేక రకాల విన్యాసాలతో అవస్థలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): తమ సమస్యలపై అమీతుమీ తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడి పెంచుతుంటే... ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక ఉద్యోగ సంఘాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయా? ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయా?... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో ఇటు ఉద్యోగులకు సమాధానాలు చెప్పుకోలేక అటు ప్రభుత్వ పెద్దలను ఎదిరించలేక ఉద్యోగ నేతలు సందిగ్ధావస్థలో చిక్కుకున్నారు. సుదీర్ఘకాలంగా పీఆర్సీ ప్రకటించకపోవడం, వైసీపీ ప్రభుత్వంలో ఒకటో తేదీన జీతం అందకపోవడం, సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోకపోవడం, ఒక్కమెడికల్‌ బిల్లు కూడా క్లెయిము కాకపోవడం, చివరకు తమ దాచుకున్న పీఎ్‌ఫను కూడా క్లెయిము చేసుకోలేని దుస్థితి నెలకొనడంతో ఇక సమరానికి సిద్ధం కావాలని సంఘాల నేతలపై ఉద్యోగులు ఒత్తిడి పెంచారు.


పెద్ద సంఘాలుగా ఉన్న ఏపీఎన్జీవో, ఏపీజేఏసీ అమరావతి సంఘాలను ఏకంచేసి వాటి నేతలతో సంయుక్తంగా గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు అనుభవిస్తున్న ఇబ్బందులు ప్రతిబింబించేలా సంఘాల నేతలు ప్రభుత్వానికి గట్టిగానే డిమాండ్‌ చేశారు. కొత్తగా విభజించిన రాష్ట్రమని ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇక ఓర్చుకోలేమని, పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రకటించారు. దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలని, సంక్రాంతి లోపు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించకపోతే పోరాటాలు ప్రారంభిస్తామని అల్టిమేటం ఇచ్చారు. 


సంఘాల నేతల తత్తరపాటు 

ఉద్యోగుల సమస్యలపై పరిష్కారానికి పోరాటానికి సిద్ధమైన సంఘాల నేతలకు ఆదిలోనే హంసపాదులాగా ప్రభుత్వ పెద్దల హెచ్చరికలు అడ్డంకులుగా మారాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం పేషీ అంటే ఉద్యోగ సంఘాల నేతలకు మంచినీళ్ల ప్రాయంగా ఉండేది. ఏ సంఘం వారైనా నేరుగా సీఎంను కలిసి తమ వినతిపత్రాలు ఇచ్చి మాట్లాడేవారు. అవసరమైతే బయటకొచ్చి మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు చేసేవారు. ఉద్యోగ సంఘాల నేతల వినతిపత్రాలను అప్పటి ప్రభుత్వం గానీ, సీఎం గానీ అతిముఖ్యంగా భావించేవారు. అయితే ఇప్పుడా ఆ పరిస్థితి లేదు.


ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా సీఎంను కలిసిన సందర్భాలే లేవు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తే అదే సీఎంను కలిసినట్టుగా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తమ గోడు పట్టించుకునేవారు లేరన్న నిరాశ, నిస్పృహలు ఇప్పటికే ఉద్యోగ నేతలను ఆవరించాయి. ఉన్నఫళంగా వచ్చిన ఈ వ్యతిరేకతను అడ్డుకునేందుకు ప్రెస్‌మీట్‌లో ఉన్న సంఘ నేతలను సజ్జల సుతిమెత్తగా హెచ్చరించడం, ఆ ఆడియో బహిర్గతం కావడం తెలిసిందే. ప్రభుత్వ పెద్దల నుంచి హెచ్చరికలు వచ్చాయని, దానికి ఉద్యోగ సంఘాల నేతలు మొత్తబడ్డారని సర్వత్రా ప్రచారమైంది. అయితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నేతలు నానా విన్యాసాలు చేశారు. ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి డిమాండ్లు వినిపించిన రోజునే సజ్జల ఫోన్‌ వచ్చింది. దానికి భయపడిపోయామన్న సంకేతాలు ఉద్యోగుల్లోకి పోతే పలుచనై పోతామని ఓవైపు కంగారు పడుతూనే మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి సీఎం గానీ, ప్రభుత్వం గానీ కారణం కాదని చెప్పడానికి నానాతంటాలూ పడ్డారు.


అందుకోసం శనివారం ప్రత్యేకంగా  ప్రెస్‌మీట్‌ పెట్టి సజ్జల ఒక్కరే అందుబాటులో ఉంటారని, రావత్‌, ఇతర ఉన్నతాధికారులెవరూ పట్టించుకోవడం లేదని కవర్‌ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం, మంత్రుల తప్పేమీ లేదంటూ... కేవలం ఉన్నతాధికారులదే తప్పంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు సమర్థించుకోవడం చూసిన ప్రతి ఒక్కరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ ప్రకటన, అరడజను పెండింగ్‌ డీఏల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవడం వంటివి ఆయన చెప్పిన ఉన్నతాధికారుల వల్ల అవుతుందా? నిజంగా సీఎం ఆదేశిస్తే అడ్డుకొనే ధైర్యం ఇప్పుడున్న ఐఏఎస్‌ అధికారుల్లో ఎవరికైనా ఉందా?... అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ నేతల వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ పెద్దలంటే వారు ఎంతగా భయపడుతున్నారో  అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-10-10T14:06:45+05:30 IST