ఓటమిపై Telugudesam పార్టీ ఏమనుకుంటోంది.. Kuppam సంగతేంటి..!?

ABN , First Publish Date - 2021-11-18T08:22:32+05:30 IST

ఓటమిపై Telugudesam పార్టీ ఏమనుకుంటోంది.. Kuppam సంగతేంటి..!?

ఓటమిపై Telugudesam పార్టీ ఏమనుకుంటోంది.. Kuppam సంగతేంటి..!?

  • మేం పుంజుకుంటున్నాం
  • మున్సిపల్‌ ఫలితాలపై టీడీపీ విశ్లేషణ
  • కుప్పం ఓటమిపై నిరాశ
  • నెల్లూరులో ఒక్క డివిజనూ రాకపోవడంపై అసంతృప్తి..
  • మొత్తంగా ఓటింగ్‌ శాతం పెరిగిందంటూ సంతృప్తి


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో తాము పుంజుకుంటున్నామని తాజా మున్సిపల్‌ ఎన్నికలు సంకేతాలిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. బుధవారం వెలువడిన ఫలితాలపై విశ్లేషించుకున్న ఆ పార్టీ నాయకత్వం ఈ అంచనాకు వచ్చింది. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. సకల వనరులు, సర్వ శక్తులూ ప్రయోగించినా ఎన్నికలు జరిగిన అన్నిచోట్లా టీడీపీ ఓటింగ్‌ శాతం బాగా పెరిగిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  తమ ఓట్ల శాతం పెరిగిందని టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆరు నెలల కింద మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీకి 30.13 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో 44.96 శాతం వచ్చాయి.


‘ఆరు నెలల వ్యవధిలో సుమారు 15 శాతం ఓట్లు పెరగడం మాటలు కాదు. ఆరు నెలల కింద మాకు 12 శాతం సీట్లు దక్కితే ఇప్పుడు 26.94 శాతం సీట్లు లభించాయి. 4 మున్సిపాలిటీలు, 8 నగర పంచాయతీలకే ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ వీటిపై మరింత పెద్దఎత్తున దృష్టి పెట్టినా.. మా ఓటింగ్‌ శాతం భారీగా పెంచుకోగలిగాం’ అని ఆ పార్టీ ముఖ్యుడొకరు చెప్పారు. అయితే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోవడం టీడీపీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి పది వేల మెజారిటీ వచ్చింది. ఈసారి వైసీపీ నాయకత్వం కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను మోహరించింది. పోలింగ్‌ రోజు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంత ఓటర్లను దించి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలూ ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో ఒక్క డివిజన్‌ కూడా రాకపోవడం టీడీపీ నేతలను నివ్వెరపరచింది.


‘అధికార పార్టీ బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి తోడు మా పార్టీలో అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు, నాయకత్వ లేమి, సరైన ప్రణాళిక లేకపోవడం నెల్లూరులో నష్టం చేసింది. ఈ ఓటమిలో మా వైఫల్యం కూడా ఉంది’ అని టీడీపీ నేత ఒకరు చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చివరి అంకంలో అక్కడ మకాం పెట్టినా అంతర్గత సమస్యల పరిష్కారానికి సమయం చాలలేదు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయితీని గెలుచుకోవడం, కృష్ణా జిల్లా కొండపల్లిని ఖాతాలో వేసుకోవడం, జగ్గయ్యపేట మున్సిపాలిటీలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఇవ్వడం టీడీపీ వర్గాలకు సంతృప్తినిచ్చింది. దర్శిలో టీడీపీకి అంత గొప్ప నాయకత్వం లేకపోయినా ఆ నగర పంచాయతీని గెలుచుకోగలిగింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గం డోన్‌లో చాలాకాలంగా టీడీపీని నడిపించే నాయకుడు లేడు.


రెండు వారాల క్రితమే అక్కడ ఇన్‌చార్జిని నియమించారు. అయినా దాని పరిధిలోని బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చి మంచి ఫలితాలే సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బ తిన్న కడప జిల్లాలోనూ తాజాగా పుంజుకోగలిగామని.. రాజంపేట మున్సిపాలిటీ, కమలాపురం నగర పంచాయతీలను వైసీపీయే గెలుచుకున్నా.. తమ ఓట్ల శాతం పెంచుకున్నామని, కొన్ని స్థానాల్లో విజయం సాధించగలిగామని అంటున్నాయి.



Updated Date - 2021-11-18T08:22:32+05:30 IST