ఎవరి అభిప్రాయాలు వారివే..న్యాయస్థానాలపై వ్యాఖ్యలపై స్పీకర్‌ తమ్మినేని

ABN , First Publish Date - 2020-07-04T20:52:33+05:30 IST

ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని న్యాయస్థానాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు

ఎవరి అభిప్రాయాలు వారివే..న్యాయస్థానాలపై వ్యాఖ్యలపై స్పీకర్‌ తమ్మినేని

తిరుచానూరు(చిత్తూరు): ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని న్యాయస్థానాలపై తాను చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాలపై మీరు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని మీడియా ప్రశ్నించగా.. ఎవరి అభ్యంతరాలు వారికుంటాయన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని చెప్పారు. అలాగే తాను మాట్లాడిన అంశంపై ఇంతకూ మీరేమంటారని మీడియానే ఎదురు ప్రశ్నించారు. అలాగే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. సమాధానాన్ని దాటవేశారు. 


కరోనా నుంచి ప్రజలు త్వరగా బయటపడాలని ప్రార్థించా

కరోనా బారినుంచి ప్రజలంతా త్వరగా బయటపడాలని శ్రీవారు, అమ్మవారిని ప్రార్థించానని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పద్మావతి అమ్మవారిని శుక్రవారం సాయంత్రం తమ్మినేని దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద జేఈవో బసంత్‌కుమార్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు శక్తియుక్తులు ప్రసాదించాలని స్వామి, అమ్మవార్లను వేడుకున్నానని చెప్పారు. అలాగే చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ తదితరులు కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T20:52:33+05:30 IST