రాష్ట్ర పరువు తీసేందుకు ఎస్ఈబీ ఆరాటం: జయప్రకాష్ వెంచర్స్ కోఆర్డినేటర్

ABN , First Publish Date - 2022-01-26T23:24:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసేందుకు ఏఎస్ఈబీ అధికారులు ఆరాట పడుతున్నారని జయప్రకాష్

రాష్ట్ర పరువు తీసేందుకు ఎస్ఈబీ ఆరాటం: జయప్రకాష్ వెంచర్స్ కోఆర్డినేటర్

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసేందుకు ఏఎస్ఈబీ అధికారులు ఆరాట పడుతున్నారని జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ స్టేట్ కోఆర్డినేటర్ లోకేష్ ఆరోపించారు. జగ్గయ్యపేట మండల పరిధిలో పట్టుకున్న ఇసుక లారీలపై లోకేష్ స్పందించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని బలుసుపాడు తక్కెళ్ళపాడు గ్రామాలకు వే బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న లారీలను అక్రమంగా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో వాహనాలను సీజ్ చేసి ఆ వాహనాలు తెలంగాణ పోతాయని ఎలా చెబుతున్నారని అధికారులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇసుక సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోకి ఇసుకను పంపేందుకు కాదని ఆయన పేర్కొన్నారు. అధికారులు విచక్షణ కోల్పోయి అక్రమంగా లారీలను సీజ్ చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 

Updated Date - 2022-01-26T23:24:42+05:30 IST