Abn logo
Sep 27 2021 @ 03:17AM

ఉద్యోగాలు లేకుండానే జీతాలు!

హౌసింగ్‌లో రిటైరయిన వారికి అనధికార వేతనాలు 

13 మందికి నెలకు రూ.35 వేలు వంతున చెల్లింపు 

తాజాగా ఔట్‌సోర్సింగ్‌లో తీసుకోవాలని ప్రతిపాదన

కార్పొరేషన్‌ పాలకవర్గం అభ్యంతరం  

ఇద్దరు అధికారులు చక్రం తిప్పుతున్నారన్న సిబ్బంది  


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రిటైరయిన అధికారులు, ఉద్యోగులకు అనధికారికంగా వేతనాలు చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తూ గత ఏడాదిన్నర కాలంలో వివిధ హోదాల్లో పదవీ విరమణ పొందిన 13మందికి నెలకు రూ.35వేలు చొప్పున వేతనాలు ఇస్తున్నట్లు కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతకాలం నుంచి వేతనాలు ఇస్తూ, ఇప్పుడు వారిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన తీసుకోవాలంటూ నాలుగు రోజుల కిందట జరిగిన కార్పొరేషన్‌ పాలక మండలి సమావేశంలో ప్రతిపాదించడం చర్చనీయాంశమైంది. ఈ పద్ధతిలో విధుల్లోకి తీసుకోవాలంటే ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ అనుమతి తీసుకోవాలని, ఇలా నేరుగా బోర్డు సమావేశంలో ఎలా పెడతారని ఉన్నతాధికారులు దానిపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టుగా మార్చి వారిని విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో ముగ్గురు అసిస్టెంట్‌ మేనేజర్లు, ఒక టైపిస్ట్‌, ఇతర కేటగిరీల ఉద్యోగులు ఉన్నారు. వారందరికీ రూ.35వేలు చొప్పున వేతనం ఇచ్చేలా కార్పొరేషన్‌ తాజా ప్రతిపాదన చేసింది. అయితే అసలు ఇంతకాలం వారికి ఎలా వేతనాలు ఇచ్చారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రభుత్వ శాఖలో అయినా అధికారి నుంచి అటెండర్‌ వరకూ రిటైరయిన తర్వాత కొనసాగింపు ఇవ్వాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అది కూడా ఎంతకాలం వారిని కొనసాగించాలో కూడా ముందుగానే ఒప్పందంలో పేర్కొంటారు. కానీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఏడాదికి పైగా రిటైరయిన వారిలో చాలామందిని కార్యాలయంలోనే పనిచేయిస్తోంది. వారిలో అందరి అవసరం లేకపోయినా కొనసాగిస్తోంది. అది కూడా కార్పొరేషన్‌ అధికారిక అనుమతి లేకుండానే ఇంతకాలం వారికి వేతనాలు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం వెనుక ఇద్దరు అధికారులు ఉన్నారని కార్పొరేషన్‌ వర్గాలే చెబుతున్నాయి. ఒక జనరల్‌ మేనేజర్‌, ఒక మేనేజర్‌ స్థాయి అధికారి ఈ వేతనాలు ఇప్పించడం వెనుక కీలక పాత్ర పోషించారని, ఇందుకు ప్రతిఫలంగా ఒక్కొక్కరి నుంచి వారికి పెద్దమొత్తంలో ముడుపులు అందాయని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో చాలామంది సీనియర్‌ అధికారులు వరుసగా రిటైర్‌ అవుతున్నారు. ప్రస్తుతం హౌసింగ్‌ ప్రాజెక్టులు వేగవంతం అయిన సమయంలో అవసరం ఉన్నప్పటికీ వారి కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంటికి పంపేశారు. కానీ నాన్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను మాత్రం అవసరం ఉన్నా, లేకపోయినా వారి కొనసాగింపునకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదంతా కార్పొరేషన్‌ ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు ప్రతిపాదన పెట్టిందే తడవుగా దాన్ని బోర్డు సమావేశంలో ఎందుకు పెట్టించారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పకపోతే ఇప్పటికే వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకునేవారని చెబుతున్నారు. మరోవైపు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అడ్మిన్‌ విభాగంపైనా అనేక ఆరోపణలు వస్తున్నాయి. పదవీ విరమణ పొందిన అధికారులకు రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు ఇచ్చేందుకే వారిని ఏళ్ల తరబడి తిప్పించుకుంటున్నారు. ఓ అధికారి నాలుగేళ్లుగా తన రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల కోసం కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అలాగే పదోన్నతులిచ్చే విషయంలోనూ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అడ్మిన్‌ అధికారులపై ఇటీవల ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.