Abn logo
Aug 2 2021 @ 03:01AM

అప్‌లోడ్‌ అన్నారు.. ఆపేశారు!

పది రోజులుగా పనిచేయని పోలీసు వెబ్‌సైట్‌

డీజీపీ, అడ్వకేట్‌ జనరల్‌ మాటల అమలేదీ?

ఎఫ్‌ఐఆర్‌, కేసు స్థితి తెలుసుకోడానికి ఇబ్బందులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేశంలో మరే రాష్ట్రం సాధించనన్ని అవార్డులు సొంతం చేసుకుని ఎంతో పారదర్శకంగా ఉన్నామంటున్న ఏపీ పోలీసుశాఖ వెబ్‌సైట్‌ గత కొన్ని రోజులుగా పనిచేయడంలేదు. ప్రభుత్వ జీవోలు మొదలుకొని పోలీసు ఎఫ్‌ఐఆర్‌లు సైతం ఆన్‌లైన్‌లో పెట్టడం గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతోంది. అయితే పోలీసుశాఖ ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో మాత్రం దోబూచులాడుతోంది. ఆన్‌లైన్‌ సంగతి దేవుడికి ఎరుక.. అసలు ఏ సెక్షన్ల కింద ఎవరిపై కేసులు నమోదు చేశారో తెలుసుకుందామంటే పోలీస్‌ వెబ్‌సైట్‌  ్చఞఞౌజూజీఛ్ఛి.జౌఠి.జీుఽ తెరుచుకోవడం లేదు. రోజుకు 24గంటల్లో ఎప్పుడో ఒక నిమిషం కనిపించినా ఎఫ్‌ఐఆర్‌ వివరాలు తెలుసుకునేలోపు ఆగిపోతోంది. కొన్ని వివాదాస్పద కేసులు నమోదు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుశాఖ కావాలనే ఆ వెబ్‌సైట్‌ను స్లో చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌ బాస్‌ చెప్పే పారదర్శకత, న్యాయస్థానంలో అడ్వకేట్‌ జనరల్‌ చెప్పే మాటలకు వాస్తవంలో ఎక్కడా పొంతన కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసు సేవా యాప్‌ ఇప్పుడు మొబైల్‌లోనే అందుబాటులో ఉందని, అందులో ఏదైనా చూసుకోవచ్చని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు.

 

అడిగితే చెప్పరు.. ఆన్‌లైన్‌లో ఉంచరు..

ఎవరైనా తమ కేసు స్థితిగతుల గురించి అడిగితే పోలీసులు చెప్పే సమాధానం ఒక్కటే.. ‘దర్యాప్తు చేస్తున్నాం’. అంతకు మించి వివరాలు ఏవీ బయటికి వెల్లడించరు. గతేడాది కాకినాడకు చెందిన ఒక వ్యక్తి దేవుళ్ల గురించి నీచంగా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆ వ్యక్తిపై గుంటూరులో బాధిత మతానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయగా కాకినాడలో బాధ్యుడిని అరెస్టు చేసిన పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పేందుకు నిరాకరించారు. తమను సంప్రదించకుండా పత్రికల్లో ఏదైనా రాసినా, టీవీల్లో ప్రసారం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ హెచ్చరించింది. నిందితుడిని రిమాండ్‌కు పంపిన తర్వాత చార్జిషీట్‌ వరకూ అంతా గోప్యంగానే నడిచింది. 


సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల కేసూ అంతే.. 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన.. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కాజేసేందుకు ప్రయత్నించిన కేసు వివరాలూ పోలీసులు ఏ మాత్రం బయటికి వెల్లడించలేదు. కోల్‌కతా, మంగళూరు, ఢిల్లీల్లో సుమారు 117 కోట్ల రూపాయలు కాజేసేందుకు మూడు ముఠాలు ప్రయత్నించాయి. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన ఏపీ పోలీసులకు నిందితులు పొరుగు రాష్ట్రాల్లో పట్టుబడ్డారన్న వార్తలు వెలువడ్డాయి. వారిలో కొందరు తప్పించుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ, వీటిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు నోరు విప్పలేదు. ఇప్పటికీ ఆ కేసు ఏమైందో రాష్ట్ర ప్రజలకు ఒక పజిలే.   


ఆంధ్రప్రదేశ్ మరిన్ని...