Abn logo
Jul 3 2020 @ 21:04PM

అమరావతి రైతులకు మద్దతు పలికిన ఎన్నారైలు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. అమరావతి  రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్రిస్కో నగరంలో గుంటూరు ఎన్నారై అసోసియేషన్ తరఫున ప్రవాసాంధ్రులు అమరావతి రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్నారై అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస రావు కొమ్మినేని మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండలన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందలేదన్నారు. విభజన అనంతరం..రాజధాని, నిధులు లేని రాష్ట్రం కోసం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రైతులు 30వేల ఎకరాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభీష్టం మేరకు రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో సామాజిక మాద్యమాల ద్వారా ప్రతి ఒక్కరు అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం శివరావమ్మ మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలు, బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, తమ భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారన్నారు. వారి త్యాగం వృథాగా పోదన్న ఆమె.. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు రైతులకు మద్దతు పలకాలన్నారు. అంతేకాకుండా తనవంతుగా రూ.లక్షను అమరావతి జేఏఈకి విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement