America లో ఉంటున్న విశాఖ NRI భూమికి ఎసరు.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మే యత్నం.. చివరకు సీన్ రివర్స్

ABN , First Publish Date - 2021-09-07T18:58:09+05:30 IST

కొమ్మాదిలో రూ.100 కోట్ల భూ మాయ కేసులో మొత్తం రూ.5 కోట్లు చేతులు మారాయని, ముగ్గురు నిందితులు కాగా ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరిని అరెస్టు చేయాల్సి వుందని పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

America లో ఉంటున్న విశాఖ NRI భూమికి ఎసరు.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మే యత్నం.. చివరకు సీన్ రివర్స్

చేతులు మారింది రూ.5 కోట్లు

కొమ్మాది భూ మాయలో ఇద్దరు నిందితులు అరెస్టు

అమెరికాలో మరొకరు...త్వరలో రప్పించే ప్రయత్నం

పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కొమ్మాదిలో రూ.100 కోట్ల భూ మాయ కేసులో మొత్తం రూ.5 కోట్లు చేతులు మారాయని, ముగ్గురు నిందితులు కాగా ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరిని అరెస్టు చేయాల్సి వుందని పోలీస్‌ కమిషనర్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. పోలీస్‌ కమిషనరేట్‌లో నార్త్‌ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావుతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. 


కాకినాడలోని ఇంద్రపాలెం పోస్టాఫీసు వీధికి చెందిన వాసంశెట్టి జయసూర్య (51) ఈ కేసులో కీలక నిందితుడు (ఏ-1). తుమ్మల కృష్ణ చౌదరికి కొమ్మాదిలో వున్న 12.26 ఎకరాల భూమికి సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలను మీ-సేవ ద్వారా తీసుకున్నాడు. వాటి ద్వారా ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. నగరంలోని నారాయణ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి వచ్చిన జరజాపు శ్రీనివాసరావు (51) స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరు. విశాఖలోని వైర్‌లెస్‌ కాలనీలో కుటుంబంతో ఉంటున్నాడు. ఇతను ఈ కేసులో ఏ-2 నిందితుడు. జయసూర్య చెప్పిన కొమ్మాది భూమిని విక్రయించడానికి జరజాపు శ్రీనివాసరావు పీఎం పాలెంలో వుంటున్న నాగోతి అప్పలరాజును సంప్రదించాడు. అతడి ద్వారా మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సనపల చంద్రమౌళిని కలిశారు. ఆయన వీరిని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుకు పరిచయం చేశారు.


భూమిని కశ్యప్‌ డెవలపర్స్‌ ఎండీ సుకుమారవర్మ ఉరఫ్‌ తేజ (ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు) పేరు మీద కొనడానికి చర్చలు జరిగాయి. 12.26 ఎకరాలను రూ.18.7 కోట్లకు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. భూమి అమెరికాలో వుంటున్న తుమ్మల చౌదరిది కావడంతో ఆయనతో మాట్లాడిస్తామని చెప్పి ఏ-1, ఏ-2 నాటకం ఆడారు. అమెరికాలో వుంటున్న బి.ఆనందరాజు (నల్గొండ నివాసి)కు ఫోన్‌ చేసి, తాము ఫోన్‌ చేసినప్పుడల్లా కృష్ణ చౌదరిలా మాట్లాడాలని ఒప్పించారు. అందుకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ డీల్‌లో లావాదేవీల కోసం కూర్మన్నపాలెంలోని ఐసీఐసీఐ బ్యాంకులో కృష్ణ చౌదరి పేరుతో ఖాతా తెరిపించారు. అప్పటికే ఏ-1 జయసూర్యకు ఆ బ్రాంచీలో ఖాతా వుండడంతో వారు అంగీకరించారు. కన్నబాబు నుంచి ఈ డీల్‌ కోసం దఫదఫాలుగా రూ.49 లక్షలు, రూ.50 లక్షలు, రూ.2.5 కోట్లు, రూ.1.5 కోట్లు మొత్తం రూ.4.99 కోట్లు తీసుకున్నారు. ఇదిలావుండగా జయసూర్యకు విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక భూమిని తనఖా పెట్టి కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్య ప్రసన్న రూ.45 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ లావాదేవీలు బ్యాంకు ద్వారా జరిగాయి. భూమి రిజిస్ట్రేషన్‌కు కన్నబాబురాజు పత్రిక ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు ఆహ్వానించారు. ఆ విధంగా తమ భూమిని ఎవరో అమ్ముతున్నారని తెలుసుకున్న ప్రసన్న విశాఖపట్నం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేసి మొదట ఏ-2 జరజాపు శ్రీనివాసరావును, సోమవారం ఏ-1 జయసూర్యను అరెస్టు చేశారు. మూడో నిందితుడు బి.ఆనందరాజును అమెరికా నుంచి రప్పించాల్సి వుందని వెల్లడించారు.

Updated Date - 2021-09-07T18:58:09+05:30 IST