Abn logo
Sep 18 2021 @ 00:06AM

పదేళ్లలో ఏపీ నిట్‌ అగ్రగామి

డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్య ప్రకాశరావు

మేనేజ్‌మెంట్‌ కోర్సులకు అనుమతి 

ప్లేస్‌మెంట్స్‌లో పెరుగుతున్న సగటు ప్యాకేజీ

ఆంధ్రజ్యోతితో డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్య ప్రకాశరావు 


    (తాడేపల్లిగూడెం–ఆంధ్ర జ్యోతి):

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) విద్య, విజ్ఞానం అందించడంతోపాటు, ఉద్యోగాల కల్పనలోనూ తనదై న ముద్ర వేసుకుంటోంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ పదేళ్లలో దేశంలోనే అగ్రగామి విద్యాసంస్థగా నిలుస్తామని చెబుతున్నారు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావు. ఇప్పటి వరకు ఏపీ నిట్‌ సాధించిన ప్రగతి, భవిష్యత్‌ ప్రణాళికలపై ఆయన ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ మోడ్‌ క్యాంపస్‌ నిర్మాణం పూర్తయ్యింది. విద్యార్థులకు అకడమిక్‌ కాంప్లెక్స్‌, హాస్టల్‌ వసతు లు సిద్ధమయ్యాయి. కళలు, క్రీడలు ప్రోత్సహించేలా ఇండోర్‌ స్టేడియం, ఆడిటోరియం ఏర్పాటయ్యాయి. మరో రూ.753 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించాం. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నె న్స్‌లో ఆమోదం పొంది కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇది కార్యరూపం దాలిస్తే నిట్‌లోవున్న ఎనిమిది ఇంజనీరింగ్‌ కోర్సులకు ప్రత్యేక అకడమిక్‌ భవనాలతోపాటు అంత ర్జాతీయ హాస్టల్‌ ఏర్పాటవుతుంది. పరిశోధనలకు కీలకమైన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటవుతుంది. 2025–26 నాటికే వీటిని పూర్తి చేయాలని సంకల్పించాం. 


   ఏటా 720 మంది ప్రవేశం


ఈ విద్యా సంవత్సరం నుంచే ఆర్థికంగా వెనుకపడిన విద్యార్థులకు 10 శాతం కోటాను కేంద్రం అమల్లోకి తీసుకు వచ్చింది. తద్వారా ఈ ఏడాది 720 మంది విద్యార్థులకు ప్రవేశం పొందే అవకాశం ఉంది. 2025–26 విద్యా సంవత్సరం నాటికి 4,624 మంది విద్యార్థులకు అవసరమైన వసతులు నిట్‌లో సమకూరనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో  225 మంది ఫ్యాకల్టీ, 275 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అవసరం. తక్షణం 110 మంది టీచింగ్‌, 120 మంది నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీని భర్తీ చే సేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌లో తీర్మానం చేశాం. అదే 2025 నాటికి 329 టీచింగ్‌ 342 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఉండాలి. నిష్ణాతులైన వారినే తాత్కాలిక ఫ్యాకల్టీగా భర్తీ చేస్తున్నాం. 


   రూ.17.5 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్స్‌


గత ఏడాది పూర్తయిన బ్యాచ్‌కు ప్లేస్‌మెంట్స్‌ కల్పించడంలో దేశంలోనే ఏపీ నిట్‌ రెండో స్థానంలో నిలిచింది. బీటెక్‌ మూడో సంవత్సరం పూర్తి చేసుకుని ఫైనల్‌ ఇయర్‌లో చేరిన విద్యార్థులు ఇప్పటి నుంచే మంచి ప్రతిభ చూపుతున్నారు. 2021–22 చివరి సంవత్సరం బ్యాచ్‌ కు చెందిన 80 మంది విద్యార్థులు రూ.17.5  లక్షల సగటు ప్యాకేజీతో ప్లేస్‌మెంట్స్‌ పొందారు. బీటెక్‌ పూర్తయిన తర్వాత వారంతా ఉద్యోగాల్లో చేరనున్నారు. సాంకేతిక విద్యతో పాటు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ పెంచుకోవడానికి నిట్‌లో ఎంబీఏ కోర్సు ప్రవేశపెడుతున్నాం. 2022–23 వి ద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్‌లు నిర్వహిస్తాం. ప్రస్తుతానికి 60 సీట్లతో ప్రారంభం కానుంది.  


   పరిశోధన ప్రాజెక్ట్‌లు మంజూరు


ఈ ఏడాది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ర్టీయల్‌ రీసెర్చ్‌ (డీఎస్‌ఐఆర్‌) సంస్థ పరిశోధనల నిమిత్తం రూ.7.5 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. డీఎస్‌ఐఆర్‌ రూ. 5 కోట్లు కేటాయిస్తే మిగిలిన రూ.2.5 కోట్లు ఏపీ నిట్‌ సమకూరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రంగాల్లో ఎనర్జీపై ప్రాజెక్ట్‌లో పరిశోధనలు నిర్వహించనున్నారని డైరెక్టర్‌ సూర్యప్రకాశ రావు స్పష్టం చేశారు.