తాళిబొట్లతో మండలిలో టీడీపీ నిరసన
టీడీపీ సభ్యుల చేతుల్లోంచి తాళిబొట్లు
లాగేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత
‘అన్యాయం ఇది.. మీకో దండం..’ అంటూ
సభను బాయ్కాట్చేసి బయటకు లోకేశ్
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కల్తీ సారా మరణాలు, మద్యనిషేధంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ తాళిబొట్లను చేతిలో పట్టుకుని శాసనమండలి లో టీడీపీ సభ్యులు నిరసన చేశారు. ‘అధ్యక్షా! తాళిబొ ట్లు తెగుతున్నా చర్చకు అనుమతించరా’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేశ్ నిలదీశారు. టీడీపీ సభ్యుల చేతుల్లోంచి తాళిబొట్లు లాక్కు ని వైసీపీ సభ్యురాలు పోతుల సునీత విసిరికొట్టడంతో మండలిలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం మండలి సమావేశం కాగానే మద్య నిషేదం, కల్తీ సారా మరణాలపై టీడీపీ సభ్యులు, ఎస్‌ఎ్‌ఫఐ విద్యార్థి సం ఘాల నేతలపై పోలీసుల లాఠీచార్జీపై పీడీఎఫ్ సభ్యు లు ఇచ్చిన వాయిదాతీర్మానాలను చైర్మన్ తిరస్కరించి.. ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కల్తీసారా మరణాలపై చర్చకు పట్టుబడుతూ, లోకేశ్ సహా టీడీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. ‘కల్తీ సారా మరణాల న్నీ జగన్‌రెడ్డి హత్యలే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించా రు. తమ వెంట తెచ్చుకున్న తాళిబొట్లను ప్రదర్శించా రు. దీనిపై చైర్మన్ మండిపడ్డారు. ‘‘ఏంటిది! సభలోకి రోజుకో రకం వస్తువులు తెస్తున్నారు. ఇది సరికాదు. మీరు బయటకు వెళ్లండి’’ అని ఆగ్రహించారు. తాళిబొట్లు సభలోకి తెచ్చి మహిళలను టీడీపీ సభ్యులు అవమానించారని వైసీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఈ సమయంలో వెల్‌లోని టీడీపీ సభ్యుల వైపు వైసీపీ సభ్యులు దూసుకెళ్లారు. ఇరుపక్షా ల మధ్య మార్షల్స్ నిలబడి కంట్రోల్ చేశారు. టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఖబడ్దార్ అంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేకలు వేశారు. ‘సారా బ్యాచ్, గంజా య్ బ్యాచ్’ అంటూ టీడీపీ సభ్యుడు మంతెన సత్యనారాయణరాజు అదే తీవ్రతతో నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుడు దీపక్‌రెడ్డి చేతుల్లోని తాళిబొట్టును వైసీపీ స భ్యురాలు పోతుల సునీత లాగేశారు. తాళిబొట్లు ప్రదర్శిస్తే అవమానించారని అంటున్నారని.. మాజీ సీఎం భార్యను సభలో అవమానించేలా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదని వైసీపీ సభ్యురాలు పోతుల సునీతను ఉద్దేశించి టీడీపీ సభ్యుడు కేఈ ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ గందరగోళం మధ్యే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, చైర్మన్ ఆమోదించారు. టీడీపీ సభ్యులు అశోక్‌కుమార్, దీపక్‌రెడ్డి, రాజనరసింహులు, కేఈ ప్రభాకర్, దువ్వారపు రామారావు, అంగర రామ్మోహనరావు, మంతెన సత్యనారాయణరాజు, తిరుమలనాయుడును సభ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులను మార్షల్స్ బయటకు తీసుకెళ్లాలని ఆదేశించారు. దీనిపై లోకేశ్ నిరసన తెలిపారు. ‘‘ఇది చాలా అన్యాయం అధ్య క్షా! కల్తీ మద్యం, మద్య నిషేధంపై చర్చకు అనుమతించాలని మేం 9 రోజుల నుంచి శాంతియుతంగా కోరుతున్నా స్పందించడం లేదు. అధికార పార్టీ సభ్యులు మమ్మల్ని తిడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు. మీ తీరుతో సభలో మాకు అన్యాయం జరుగుతోంది. మీకో దండం..సభకో దండం’’ అంటూ సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.