అప్పులన్నీ తప్పులే!

ABN , First Publish Date - 2022-03-20T08:03:44+05:30 IST

జగన్‌ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచుతోంది. తప్పుడు లెక్కలతో కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతోంది..

అప్పులన్నీ తప్పులే!

అదనపు రుణాల కోసం 

అడ్డగోలు లెక్కలు

జీఎస్డీపీ అంచనాలతోనే తొలి గోల్‌మాల్‌

రాష్ట్ర సొంత రుణ వనరుల లెక్కల్లో మాయ

తప్పుడు లెక్కలు చూపి ఎక్కువ రుణానికి అనుమతి

మూడేళ్లలోనే రూ.33,476 కోట్ల దొంగ రుణాలు

2022-23లో రూ.80 వేల కోట్లకు టెండరు

కాగ్‌ను కాదని రాష్ట్రాన్ని గుడ్డిగా నమ్ముతున్న కేంద్రం


జగన్‌ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచుతోంది. తప్పుడు లెక్కలతో కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతోంది. ఇందుకోసం... అన్ని రకాల నియమ నిబంధనలను తుంగలో తొక్కుతోంది. ఒకవైపు ‘కార్పొరేషన్ల’ పేరిట రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు తెస్తూనే... మరోవైపు జీఎస్డీపీ అంచనాలు, ఇతర లెక్కల్లోనూ గోల్‌మాల్‌ చేసి కేంద్రం నుంచి ‘ఎక్కువ’ అప్పులకు అనుమతులు తెచ్చుకుంటోంది. ‘ఈ రోజు గడిస్తే చాలు’ అన్నట్టు జగన్‌ సర్కారు ఎడాపెడా చేస్తున్న అప్పులు... రాబోయే పదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేయడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అప్పులు తెచ్చుకోవడానికి కొన్ని నియమాలున్నాయి. విపత్కర పరిస్థితుల్లో అదనపు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు రాజ్యాంగమే కల్పించింది. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం, వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. మూడేళ్లలో కేంద్రానికి తప్పుడు లెక్కలు పంపి... రూ.33,476 కోట్ల అప్పులు అదనంగా చేసింది.  2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.80,000 కోట్ల అప్పులకు అనుమతి కోరింది. ఈ లెక్కల్లో అన్నీ మాయలే. ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఎంత అప్పులు చేయొచ్చో నిర్ణయించేందుకు కేంద్రం వద్ద ఒక విధానం ఉంది. దీని ప్రకారం... ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాల్లో 3.5 శాతాన్ని అప్పుగా తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతిస్తుంది. అయితే... రాష్ట్రానికి సొంతంగా/ముందుగానే అనుమతించి అందుబాటులో రుణ వనరుల (పీఎఫ్‌ నిధులు, విదేశీ సహాయ ప్రాజెక్టులకు వచ్చే రుణాలు, నాబార్డు అందించే రుణాల వంటివి) ద్వారా తెచ్చే అప్పులను ఈ 3.5 శాతం నుంచి మినహాయించాలి. ఆ లెక్కలన్నీ కేంద్రానికి రాష్ట్రం స్పష్టంగా చెప్పాలి. ఇక్కడే జగన్‌ సర్కారు మోసానికి తెరలేపుతోంది. ప్రభుత్వం సొంత రుణ వనరుల లెక్కను ఇష్టానుసారంగా, మితంగా పంపిస్తోంది. వాటినే కేంద్రం గుడ్డిగా నమ్మి... కొత్త అప్పులకు అనుమతి ఇస్తోంది. ఇలాంటి తప్పుడు లెక్కల ద్వారా... ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.33,476 కోట్లు అదనంగా అప్పు తీసుకొచ్చింది.


విడతల వారీగా మోసం...

ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రెండు విడతల్లో అప్పులకు అనుమతి జారీ చేస్తుంది. ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఒకసారి, జనవరి నుంచి మార్చి వరకు ఒకసారి! ఏప్రిల్‌లో ఇచ్చే అప్పులకు జీఎ్‌సడీపీ ముందస్తు అంచనాలపై ఆధారపడి అనుమతి ఇస్తుంది. 9 నెలలు గడిచి జనవరి నెలకు వచ్చేసరికి జీఎ్‌సడీపీ అంచనాపై మరింత స్పష్టత వస్తుంది. అందుకే... జనవరిలో సవరించిన జీఎ్‌సడీపీని కేంద్రానికి చూపితే, ముందుగా ఇచ్చిన అప్పుల అనుమతిలో ఏవైనా హెచ్చుతగ్గులుంటే కేంద్రం సరిచేస్తుంది. కానీ, రాష్ట్రం ఈ పని కూడా చేయడం లేదు. ఏప్రిల్‌లో పంపిన జీఎ్‌సడీపీ ముందస్తు అంచనాలపైనే చూపించి... జనవరిలో కూడా కొత్త అప్పులకు అనుమతి తీసుకుంటున్నారు.


కేంద్రంలో ఇంత నిర్లక్ష్యమా ?

రాష్ట్రాలు పంపే లెక్కలు సరైనవా కావా చెక్‌ చేసుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ కేంద్రం ఆ పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల అ కౌంట్లను ప్రతి నెలా కాగ్‌ పరిశీలించి నివేదికలు ఇస్తూ ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సమాచారమంతా కాగ్‌ వద్ద ఉంటుంది. మూడేళ్లుగా 4 విభాగాలకు సంబంధించిన లెక్కలను తప్పుల తడకగా పంపినా కేంద్రం పట్టించుకోవడంలేదు. అందుకే రాష్ట్రం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోయింది.

ఇలా గోల్‌మాల్‌...

నెగోషియేటెడ్‌ లోన్లు రూ.1976 కోట్లు(నాబార్డు, ఇతర లోన్లు), ఈఏపీ లోన్లు: రూ.1756 కోట్లు, స్టేట్‌ పీఎఫ్‌, పబ్లిక్‌ అకౌంట్‌ (నెట్‌) మొత్తం రూ.1972 కోట్లు... వీటన్నింటి మొత్తం రూ.5,704 కోట్లు! రూ.62,054 కోట్ల నుంచి రూ.5704 కోట్లు తీసేస్తే... 56,350 కోట్లు.  కానీ... ఆ సంవత్సరం ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.50,896 కోట్లు తెచ్చారు. అంటే... ఇంకా రూ.5452 కోట్ల పరిమితిని వినియోగించుకోలేదన్నది సర్కారు వారి లెక్క. కానీ... ఆ సంవత్సరం జీఎస్డీపీ రూ.9,66,099 కోట్లకు తగ్గింది. దీని ప్రకారం రుణ పరిమితి రూ.28,982 కోట్లకు తగ్గుతుంది. దీనికి ఇతర లెక్కలు కలిపితే రూ.60,732 కోట్లకు చేరింది.  నెగోషియేటెడ్‌ లోన్లు రూ.1976 కోట్లు, ఈఏపీ లోన్లు రూ.4562 కోట్లు, స్టేట్‌ పీఎఫ్‌ అండ్‌ పబ్లిక్‌ అకౌంట్‌ నెట్‌ రూ.10,916 కోట్లు... ఈ మూడింటి మొత్తం ఏకంగా రూ.17,454 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని గ్రాస్‌ బారోయింగ్‌ సీలింగ్‌ నుంచి తీసేస్తే వచ్చేది రూ.43,276 కోట్లు మాత్రమే. కానీ... 2020-21లో రాష్ట్రం ఆర్‌బీఐలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు రూ.50,896 కోట్లు. అంటే అదనంగా రూ.7619 కోట్లు తెచ్చారు.

Updated Date - 2022-03-20T08:03:44+05:30 IST