పేదలకు వినోదం ఇదేనా?

ABN , First Publish Date - 2022-03-09T07:54:08+05:30 IST

జగన్‌ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకూ ఎక్కడా పొంతన కనిపించడం లేదు. మూడేళ్లలో ఎన్నో విషయాల్లో మడమ తిప్పిన వైసీపీ సర్కారు తాజాగా....

పేదలకు వినోదం  ఇదేనా?

పేదలు వెళ్లే నేల టికెట్లపై రెట్టింపు భారం

ధనికులు వెళ్లే బాల్కనీ ధరల తగ్గింపు

కొత్త ధరలపై పేదలు, సినీ వర్గాల పెదవి విరుపు

అన్నింటా జగన్‌ది రివర్స్‌ పాలనే అంటూ వ్యాఖ్యలు


అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకూ ఎక్కడా పొంతన కనిపించడం లేదు. మూడేళ్లలో ఎన్నో విషయాల్లో మడమ తిప్పిన వైసీపీ సర్కారు తాజాగా పేదలకు వినోదం అందించే విషయంలోనూ మాట మార్చింది. పేదలు వెళ్లే నేల టికెట్లపై భారీగా భారం వేసి... ధనికులు వెళ్లే బాల్కనీ టికెట్ల రేట్లను మాత్రం తగ్గించింది. పేదోడికి సినిమా టికెట్‌ భారంగా ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గతంలో చెప్పగా.. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఆ పేదలపైనే భారం పడిందన్న విషయం స్పష్టమైంది. పల్లెటూర్లలో కేవలం 20 రూపాయలకే చూసే సినిమా ఇప్పుడు రూ.40కి చేరింది. అదే పట్టణాలు, నగరాల్లో యాభై రూపాయల నుంచి 70కి పెరిగింది. అదే సమయంలో సినిమా కోసం వంద రూపాయలు ఖర్చు చేయగలిగిన ఎగువ మధ్య తరగతి ప్రేక్షకుడిపై మాత్రం ప్రభుత్వం భారం తగ్గించింది.


భీమ్లానాయక్‌ హడావుడి తగ్గిన తర్వాత జగన్‌ ప్రభుత్వం పెంచిన రేట్లపై పేదలు ప్రశ్నిస్తుండగా.. బాల్కనీ రేట్ల తగ్గింపుపై సినిమా రంగానికి చెందినవారు పెదవి విరుస్తున్నారు. సినీ ప్రేక్షకులెవరూ ధరల గురించి ప్రభుత్వాన్ని అడగకపోయినా.. గతేడాది ‘వకీల్‌ సాబ్‌’ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు టికెట్ల ధరలు భారీగా తగ్గిస్తూ జగన్‌ ప్రభుత్వం జీవో జారీచేసింది. అప్పటి వరకూ రాష్ట్రంలో నాన్‌ ఏసీ థియేటర్లలో నేల టికెట్‌ రూ.20, బాల్కనీ ధర రూ.80 వరకూ ఉంది. పల్లెలైనా, పట్టణాలైనా ఏసీ హాళ్లలో రూ.50 నుంచి రూ.100 మేర వసూలు చేసేవారు.


ఈ ధరలు ప్రజలకు భారంగా ఉన్నాయంటూ.. గ్రామాల్లో నాన్‌ ఏసీ నేల టికెట్‌ కేవలం ఐదు రూపాయలు, బాల్కనీ రూ.15గా నిర్ణయించిన జగన్‌ ప్రభుత్వం పట్టణాల్లో రూ.10 నుంచి రూ.30కి మించకూడదంటూ జీవో జారీచేసి షాకిచ్చింది. గ్రామాల్లోని ఏసీ థియేటర్లలో ముందు వరుస పది రూపాయలు, బాల్కనీ రూ.20... పట్టణాల్లో రూ.40 నుంచి రూ.60కి ఖరారు చేసింది. ఎగ్జిబిటర్లు, సినీ పెద్దలు, ప్రతిపక్ష పార్టీలు తప్పు బట్టినా స్పందించలేదు. దీంతో ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం జగన్‌ వద్దకొచ్చి సినీ పరిశ్రమను ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో రేట్లు పెంచుతూ జీవో ఇస్తారని చెప్పినా పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసింది. ఎట్టకేలకు టికెట్‌ ధరలు కొంత మేర పెంచుతూ సోమవారం విడుదల చేసిన జీవోలోని రేట్లు చూసిన సినీ ప్రియులు జగన్‌ సర్కారు మరోమారు మాట తప్పిందని అంటున్నారు. మన రాష్ట్రంలో పట్టణాల్లోనే సినిమా థియేటర్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో వాటిలో ముందు వరుసలో కూర్చుని సినిమా చూస్తే నాన్‌ ఏసీలో కేవలం రూ.20కే వినోదం లభించేది. ఇప్పుడు రెట్టింపు చేసిన జగన్‌ సర్కారు.. ఆ పేద ప్రేక్షకుడిపై భారీగా భారం వేసింది. ఏసీ హాళ్లలో యాభైకే చూసే సినిమా ఖర్చుని రూ.70కి పెంచారు.


బాల్కనీ టికెట్‌ రూ.80 పెట్టి చూడగలిగిన ఎగువ మధ్య తరగతి ప్రేక్షకుడికి మాత్రం సగం భారం తగ్గించి రూ.40 చేశారు. పట్టణాల్లో బాల్కనీ రూ.60 కాగా ఏసీ థియేటర్లలో రూ.100 ఉన్న ధరను రూ.70కి దించేసింది. దీంతో జగనన్న పాలన అన్నింటా రివర్సే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-03-09T07:54:08+05:30 IST