రాష్ట్రాల మాటకు విలువేదీ?

ABN , First Publish Date - 2022-02-02T08:06:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలకు భిన్నంగా నదుల అనుసంధానంపై కేంద్రం ముందుకే వెళ్తోంది. ...

రాష్ట్రాల మాటకు విలువేదీ?

 వాటిని ఒప్పించకుండా..

 నదుల అనుసంధానమా?


అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలకు భిన్నంగా నదుల అనుసంధానంపై కేంద్రం ముందుకే వెళ్తోంది. గోదావరి, కృష్ణా జలాల వివాదాలను పరిష్కరించకుండా.. ముఖ్యంగా గోదావరి మిగులు జలాల లెక్క తేల్చకుండా అనుసంధానంపై కదలొద్దని గత నెలలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఉభయ రాష్ట్రాలూ స్పష్టం చేశాయి. అయితే ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్‌, నాగార్జున సాగర్‌-పెన్నా, పెన్నా-కావేరి, పార్‌-తాపి-నర్మద, దామన్‌గంగ-పింజాల్‌ నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం తన బడ్జెట్‌లో ప్రసంగంలో స్పష్టం చేయడంతో.. రాష్ట్రాల వైఖరితో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న విషయం తేటతెల్లమైంది. సదరు అనుసంధానానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని గత నెల ఆరో తేదీన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఓ లేఖ కూడా రాశారు. తమ అభిప్రాయాలకు అనుగుణంగా.. నీటి వాటాల సంగతి తేలాకే నదుల అనుసంధానానికి అంగీకరిస్తామని రెండు రాష్ట్రాలూ తేల్చిచెప్పాక.. వాటిని ఒప్పించే ప్రయత్నం ఏ మాత్రం చేయకుండా.. అనుసంధానంపై ముందుకెళ్తామని చెప్పడం రెండు ప్రభుత్వాలనూ నివ్వెరపరుస్తోంది. 


అనుసంధానంతో మేలు: కేంద్రం

గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో సముద్రంలోకి వృథాగా పోతున్న దాదాపు 247 టీఎంసీల నీటిని ఒడిసిపట్టే వీలుందని కేంద్ర జలశక్తి శాఖ చెబుతోంది. ముఖ్యంగా కరువు ప్రభావిత ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంటోంది. గోదావరి నదిని ఇచ్చంపల్లి లేదా జానాంపేట వద్ద కలుపుతారు.

Updated Date - 2022-02-02T08:06:49+05:30 IST