Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 21 Jan 2022 03:37:41 IST

పరువు పాయే..!

twitter-iconwatsapp-iconfb-icon
పరువు పాయే..!

ఓటీఎస్ కు స్పందన ఢమాల్‌ 

సీఎం వెళ్లకముందు ‘పశ్చిమ’లో రూ.15.4 కోట్లు వసూలు

ఆ తర్వాత 20 రోజుల్లో వచ్చింది రూ.5 లక్షలే 

జగన్‌ సభ కోసం చేసిన ఖర్చులూ రాని వైనం 

పథకం పరుగులు పెడుతుందన్న ఆశలు గల్లంతు 

అధికారుల అంచనాలు ఒక్కసారిగా తల్లకిందులు 

వసూళ్లు పాతాళానికి పడిపోవడంపై మల్లగుల్లాలు 

రాష్ట్ర వ్యాప్తంగా పేదల్లో కనిపించని ఆసక్తి 


పేదల నుంచి పెద్దమొత్తంలో దండుకోవడమే లక్ష్యంగా వైసీపీ సర్కారు ప్రారంభించిన ఒన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎ్‌స)కు స్పందన కరువైంది. పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్‌ సభకు ముందు వరకూ బాగానే ఉన్న వసూళ్లు... ఆ తర్వాత పాతాళానికి పడిపోయాయి. సభ కోసం చేసిన ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదని అధికారులు ఉసూరుమంటున్నారు. ప్రజల్లో ఆశించినంతగా స్పందన లేకపోవడంతో ఈ నెల 10న నిర్వహించిన మెగా మేళా కాస్తా సచివాలయ ఉద్యోగుల ఆందోళనల నడుమ తుస్సుమంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌... సంపూర్ణ గృహ హక్కు పేరిట పేదలకు ఏదో గొప్ప మేలు చేస్తున్నామంటూ భారీగా నగదు వసూలు చేసేందుకు తెరపైకి వచ్చిన పథకం. గతేడాది డిసెంబరు 8నుంచే అనధికారికంగా పథకం ప్రారంభం కాగా, అధికారికంగా పేదలకు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని 21న పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రారంభించారు. పేదలకు ఇంత మేలు ఏ ప్రభుత్వమూ చేయలేదంటూ ‘వసూళ్ల’ పథకాన్ని ‘మేలు’ చేసేదిగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే సీఎం మాటలు విన్న తర్వాత ఏమైందో ఏమో గానీ ఓటీఎ్‌సకు స్పందన ఢమాల్‌ అని పడిపోయింది. జగన్‌ సభకు ముందు ఓటీఎస్‌ కింద పేదలు రూ.15.4 కోట్లు చెల్లిస్తే, నాటినుంచి ఈనెల 10 వరకూ కేవలం రూ.5లక్షలు రాబట్టేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. సీఎం వచ్చి స్వయంగా రిజిస్ర్టేషన్‌ పత్రాలు అందజేయడంతో ఇక పథకం పరుగులు పెడుతుందని, లబ్ధిదారులు వెల్లువలా ముందుకొస్తారని అనుకున్న అధికారుల అంచనాలు తల్లకిందులయ్యాయి. సీఎం వచ్చి వెళ్లాక స్పందన పెరగకపోగా, ఒక్కసారిగా ఎందుకు పడిపోయిందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. సీం సభ కోసం జన సమీకరణ, టీలు, స్నాక్స్‌, ఇతర ఏర్పాట్లకు భారీగా ఖర్చవుతుంది. ఇంతా చేస్తే ఆయన వచ్చి వెళ్లాక ఓటీఎ్‌సలో నగదు చెల్లించేవారి కోసం అధికారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి సభకు చేసిన ఖర్చులు కూడా ఆ తర్వాత వసూలు కాలేదని తాజా లెక్కలతో అర్థమవుతోంది. 


చప్పబడిన ఓటీఎస్‌

ఓటీఎస్‌ ద్వారా కనీసం రూ.4వేల కోట్లు రాబట్టాలని వైసీపీ ప్రభుత్వం లెక్కలు వేసింది. అందుకు తగ్గట్టుగానే దానిపై ఊకదంపుడు ప్రచారం చేసి మరీ వసూళ్లకు రంగంలోకి దిగింది. ఒక్క పదివేలు కడితే చాలు... ఇంటిపై శాశ్వత హక్కులు లభిస్తాయంటూ ఇప్పుడేదో ఇళ్ల యజమానులకు అసలు హక్కులు లేవన్నట్టుగా ప్రచారం చేసింది. రిజిస్ర్టేషన్‌ పత్రాలు చేతికందడంతోనే ఇంటి విలువ భారీగా పెరిగిపోతుందని పేదలంతా లక్షాధికారులు అయిపోతారన్న స్థాయిలో కలరింగ్‌ ఇచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటికప్పుడు ప్రభుత్వానికి తక్షణం కనీసం రూ.వెయ్యి కోట్లు వచ్చిపడతాయని, రెండు మూడు నెలల్లో మిగిలిన రూ.3వేల కోట్లు దశల వారీగా వచ్చి చేరతాయని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మొత్తం రివర్స్‌ అయింది. ఇంటి పత్రాలు తీసుకోవాలని భావించిన వారంతా సీఎం సభ కంటే ముందే నగదు కట్టేశారు. ఆ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.200కోట్లకు పైగా వసూలయ్యాయి. సీఎం పథకాన్ని ప్రారంభించి 20రోజులు అవుతున్నా ఆ తర్వాత వసూళ్లు రూ.100కోట్లు కూడా దాటలేదు. అంటే మొత్తం కలిపినా రూ.500కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న రూ.4వేల కోట్ల సంగతి ఇక అంతే అన్నట్టుగా తయారైంది. 


మెగా మేళా అట్టర్‌ ఫ్లాప్‌

ప్రజల్లో స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో ప్రభుత్వం ఈ నెల 10న ఓటీఎ్‌సపై మెగా మేళా నిర్వహించింది. కానీ ప్రొబేషన్‌ కోసం సచివాలయాల ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఈ మేళా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఉద్యోగులంతా ఆందోళనలో ఉండటంతో అనేకచోట్ల మేళాను నిర్వహించేవారే కరువయ్యారు. యంత్రాంగం నుంచే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో లబ్ధిదారులూ పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు కాకుండా మరోసారి మెగా మేళా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 


పునరాలోచనలో పేదలు 

కరోనా పరిస్థితులు, ఉపాధి లేకపోవడం, పంటలకు తెగుళ్లు లాంటి అనేక సమస్యలతో ప్రజలు ఆర్థికంగా సతమతమవుతున్న సమయంలోనే ప్రభుత్వం ఓటీఎస్‌ తేవడంతో దానిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. అందులోనూ ఎప్పటినుంచో ఉంటున్న ఇళ్లకు ప్రభుత్వం కొత్తగా ఇచ్చే హక్కులు ఏమిటంటూ పలుచోట్ల లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఓటీఎ్‌సలో నగదు చెల్లిస్తే ఇంటిని అమ్ముకోవచ్చంటూ ప్రభుత్వం చేసిన ప్రచారం కూడా నెగెటివ్‌ అయింది. ఏళ్ల తరబడి ఉంటున్న సొంత ఇంటిని అమ్ముకోవడమేంటని అధికారులను పేదలు ప్రశ్నిస్తున్నారు. ఇక అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయించి ఇస్తామని టీడీపీ ఇచ్చిన హామీ కూడా ప్రభావం చూపింది. ఇంతకాలం లేని హడావిడి ఇప్పుడు ఎందుకని, కొంతకాలం ఆగుదామని పేదలు పునరాలోచనలో పడ్డారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.